అమ్మమ్మ గారి ఇల్లు

పెద్ద రేడియో లో ఘంటశాల పాటలు వస్తున్నాయి. “అబ్బాయి ఇంకా పేట నుంచి రాలేదు , వస్తే తెచ్చిన వంకాయలని ఆ పొయ్యిలో కాల్చేసి వంకాయ పచ్చడి చేస్తాను” అని ఆవిడ  తనలో  తాను అనుకుంటోంది.ఆవిడ అనుకుంటుండగానే అబ్బాయి పేట నుంచి వచ్చాడు. ఇంటి పక్కనే మంగయ్య తాత గారి తో పలకరిస్తున్న బుల్లిమావయ్య సైకిల్ స్టాండ్ వేస్తున్న అబ్బాయి ని చూసి , పరుగందుకుని అబ్బాయి దగ్గర కూరల సంచి తీసుకుని ఆమెకి ఇచ్చాడు . “ఈయన మువ్వంకాయలు తెచ్చారు, పెద్ద వంకాయలు తెమ్మంటే” అని అది ఆయనకు వినపడకుండా. “అయితే కారం పెట్టి కూర చేసేస్తా” అంటూ అబ్బాయికి వినిపించేలా చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. ఆ పొయ్యి మీద అన్నం ఎసరు పెట్టి…ఇంకో పొయ్యి మీద వంకాయలని తరిగి కారం పెట్టి కూర చేసింది.

“వంట అయ్యిందా” అని అరుగు మీద నుంచి అబ్బాయి అరుపు. “ఇదిగో అయ్యిపోవచ్చింది” అంటూ కంగారు పడుతూ, “బుల్లి గాడు వచ్చాడా” అంటూ వంటింట్లో నుంచే అడిగింది, “వాడు వస్తే మీ ఇద్దరికీ వడ్డించేస్తాను” అని అంది.
బుల్లి మావయ్య కూడా రావడం తో ఇద్దరికీ కంచాలు వేసేసి , చక్కగా వడ్డిస్తోంది ఆవిడ. “కారం కొంచం తక్కువైందే” అంటూ కొంచం గట్టిగానే చెప్పాడు అబ్బాయి.  అబ్బాయి తింటూ కలుపుకుంటూ ఉంటే , ఆ కలుపుడికి  కంచం గిరా గిరా తిరుగుతోంది..
ఆమె ఏమి మాట్లాడ లేదు. అబ్బాయి భోజనం అయిన తరువాత ఆమె కూడా తినేసి, అప్పటికే వీధి ఆరుగు మీద కూర్చుని, భవాని శంకరం మావయ్య తో కబుర్లు చెప్తున్న అబ్బాయి తో నాలుగు మాటలు కలిపి  వచ్చి పడుకుంది.

************

తెల్లారుతోంది . పెరట్లో చింత చెట్టుమీద వాలిన పక్షులు పొద్దున్నే పలకరించుకుంటూ అరుస్తున్నాయి. అప్పటికే  అబ్బాయి లేచి నీళ్ళపొయ్య వెలిగించాడు. ఒక పక్కన తేగలుని నీళ్ల పొయ్యి మంటలో కాలుస్తూ “ఏమి వండుతున్నావు ఇవ్వాళ ” అని చేతులు కాచుకుంటూ అడిగాడు అబ్బాయి. పనసపొట్టు కూర, మజ్జిగ పులుసునూ అని వంటింట్లోనుంచే చెప్పింది…

రేడియో లో ఢిల్లీ వార్తలు వస్తున్నాయి. కాఫీ తాగేసి, స్నానం చేసేసి రెడీ అవుతున్న అబ్బాయికి “ఇదిగో ఫ్లాస్కో” అంటూ టీ దాంట్లో పోసి అబ్బాయి కిచ్చింది. అబ్బాయి ఫ్లాస్కో పట్టుకుని “పేట వెళ్లి వస్తాను” అంటూ కండువా పైన వేసుకుని సైకిల్ ఎక్కాడు. బయటికి వచ్చి ఎదురొస్తూ, “వస్త్తూ వస్తూ..పెద్ద వంకాయలు తెండి” అని చెప్పింది .
ఈవిడ వంటింట్లో పొయ్యి మీదున్న కూర ని ఒకసారి తిప్పి, అప్పుడే అంట్లు తోమడానికి వచ్చిన నాగ వేణి తో మాట్లాడి ఆమెకి టీ ఇచ్చి, మళ్ళీ వంటింట్లోకెళ్లింది.అప్పటికే బుల్లి మావయ్య  కాఫీ తాగేసి క్రిష్ట్నమూర్తి గారింటికేళ్లాడు.

వంట అంతా అయిన తరువాత, ఈవిడ వీధి అరుగు మీద కూర్చుని ఉంటె, పసుపు పచ్చని ఛాయ తో , నుదుటన పెద్దబొట్టు, ముక్కుపుడక, కాలికి కడియాలు వేసుకుని కావుడమ్మమ్మ  “వంట అయ్యిందా” అని అడిగితె, “అయ్యింది అక్కా ! మీవి” అంటూ అంటూ తిరిగి ప్రశ్న వేసింది. పైన కొబ్బరి చెట్టు మీద కాకి అరుస్తోంది, ఇవ్వాళ మన పిల్లలు వస్తే బావుంటుంది అని మనసులో అనుకుంది.

********

“అమ్మా!  తాతయ్య  మాస్టారు ఇంటికే  కదండీ , రండమ్మా  నా రిక్షా ఎక్కండి” అంటూ అప్పుడే పేటలో బస్సు దిగిన పర్వత వర్ధని ని మెరకడు అడిగాడు . పర్వత వర్ధని తో పాటు ముగ్గురు పిల్లలూ రిక్షా యెక్కి కూర్చున్నారు . రిక్షా, పేట నుంచి కోఠి వారి ఆగ్రహారం బయలు దేరింది. అప్పుడే పేట నుంచి అగ్రహారం వెళ్తున్న చిట్టితాత గారి బుల్లిబాబు మావయ్య  రిక్షాలో  కి చూసి  “అక్కా  బాగాఉన్నావా !” అని పలకరించి , పిల్లల్ని చూసి ” సైకిలుమీద దింపేనా మిమ్మల్ని  అని అడిగాడు. పిల్లలు అడ్డంగా బుర్ర ఊపడం తో నవ్వుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు .

చుట్టూత కొబ్బరి చెట్లు. ఆ పక్కనే పిల్ల కాలువలు. మట్టి  రోడ్డుమీద ఉన్న  చిన్నచిన్న గుంతలకి రిక్షా ఊగుతూ వెళ్తోంది.

రిక్షా మెల్లగా చిట్టితాత /ధర్మావతి అమ్మమ్మ  వాళ్ళ ఇంటి మీదుగా  వెళ్తూ జయంతి  వారు , గరిమెళ్ళ వారి ఇంటి ముందరనుంచి వెళ్తోంది. వెంకట శాస్త్రి తాత గారింట్లో నుంచి రాజేశ్వరి అమ్మమ్మ రిక్షా కేసి చూస్తోంది. రిక్షా మెల్లగా  భాగవతుల వారి ఇంటి ని,  వీరన్న మాస్టర్  , సూరయ్య మాస్టర్ గార్ల ఇళ్లను దాటుకుంటూ వెళ్తోంది. వీధులో నించుని చూస్తున్న బులుసు పండుని వాళ్ళ అమ్మగారు పిలవడం తో  ఇంటిలోకి పరిగెత్తాడు. కృష్ణమూర్తి గారింటి బయట ప్రసాదు మాస్టర్ గారు రావుడు మాస్టారు తో మాట్లాడుతున్నారు.

దూరం గా నుంచే  చూసిన కిష్టప్ప మావయ్య పరిగెత్తుకుంటూ వచ్చి , “ఎలాగ ఉన్నావ్ పర్వతం, బావగారు బాగున్నారా” అని కుశల ప్రశ్నలు వేసాడు. అరుగుమీద పడక కుర్చీలో కూర్చున్న  మీసాల పెద్ద తాతయ్య చుట్ట కాలుస్తూ ‘ఎవరూ వచ్చింది” అని  అక్కడ నించున్న సూరి మావయ్య ని అడుగుతున్నారు. కృష్ణమూర్తి గారు  అరుగుమీద కూర్చుని చూస్తున్నారు. వాళ్ళ గోడమీద  “పిచ్చుక గుర్తుకే ఓటు వేయండి” అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

రిక్షా వచ్చి  తాతయ్య మాస్టారు ఇంటిదగ్గెర ఆగింది . పర్వతం దిగింది..ఆమె తో పాటు ఆమె పిల్లలు దిగారు….హమ్మయ్య పిల్ల వచ్చిందనుకుని రావే రావే అంటూ లోపలకి తీసికెళ్ళింది….ఈ లోపులో దూరం నుంచే రిక్షా ని చుసిన బుల్లి బాబు పరిగెత్తు కుంటూ వచ్చాడు..
ఆప్యాయం గా పిల్ల తో మాట్లాండింది, పిల్ల పిల్లలని దగ్గిరకు తీసుకుంది, ముద్దాడింది. ఇదిగో నే పర్వతం వంట అయ్యింది పిల్లలకి అన్నం పెట్టేసే…పొద్దున్న ఏమి తిన్నారో ఏమిటో అంటూ ….

ఈ లోపులో పెదమావయ్య  గారి  రాజు , లల్లి  వచ్చారు. వీది అరుగు మీదకూర్చుని రాజు “వీరివీరి గుమ్మడిపండు” ఆడించింది.  రాజు  చందమామ లోని పేదరాశి పెద్దమ్మ కథల్ని  పూస గుచ్చినట్లు చెప్తూ ఉంటే, చిట్టితాత గారి భాను పిన్ని వచ్చి “పసాదు పనస గింజ వచ్చేసింది” అంటూ  నా బుగ్గల్ని లాగింది. అప్పుడే  మంగయ్యతాత  గారి  రామం మావయ్య  పొలం నుంచి ఇంటిలోకి  వెళ్తున్నారు. విశాలి మంగయ్యతాత గారికి గ్లాసులో మంచి నీళ్ళు ఇస్తోంది. పెరట్లో చింతచెట్టు దగ్గెర మంగేష్ కనపడితే , వాడితో ఆడుకోవడానికి పరిగెత్తాను.

పెదతాతయ్య  గారి ఇంటి పెరట్లో ఆవులు గడ్డిని తింటున్నాయి. పెద్దమ్మమ్మ ఆవుని నిమురుతోంది. పెదమావయ్య వచ్చి ఆవు దూడకి మూతికి కట్టిన కట్లు విప్పి , తల్లి ఆవు దగ్గెర పాలు తాగడానికి పంపిస్తున్నాడు. తల్లి ఆవు సంతోషం తో  పిల్ల ఆవును నాకుతోంది .
******************

ఆప్యాయత, అనురాగం ఎక్కువ వేసి, దానికి కొంత అమాయకత్వం కలిపి , ఆ వచ్చిన మిశ్రమాన్ని  ఒక  మనిషిగా  కాకినాడలో పుట్టించాడు దేవుడు. ఈవిడ కాకినాడ  లో నాగమణి గా పెరిగి ,  కొత్తూరి రమణప్పశాస్త్రి (అబ్బాయి/తాతయ్య మాస్టర్ని పెళ్ళాడి  గున్నమ్మ పేరు తోనే తన జీవన ప్రయాణం సాగించింది.

ఇంతకీ ఆవిడ మా అమ్మమ్మ.. ఆ ఊరు కోఠి వారి ఆగ్రహారం. అంత ఎత్తు నుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించే కొబ్బరి చెట్లు ఒక పక్క. పైరగాలికి ఊగుతూ, పలకరించే పచ్చని పొలాలు ఇంకో పక్క .

వీధి అరుగు మీద కూర్చుని ఎప్పుడెప్పుడు మనవలు వస్తారా అని  ఆవిడ ఎదురుచూస్తూ ఒక పక్క..

వీలు కుదిరినప్పుడల్లా, ఎప్పుడెప్పుడు అమ్మమ్మగారింటికి వెళ్లి అమ్మమ్మ ని తాత గారిని ఒక్కసారి పలకరించేసి, పులకరించి పోవడం ఇంకో పక్క…

*******************

ప్రసాద్ ఓరుగంటి ( అమ్మమ్మకి మనవడు )

లాక్ డౌన్ 

ఏరా!  అమెరికాలో ఎలా ఉన్నార్రా మీరు అందరూ” అని అమెరికాలో ఉన్న వేంకటాద్రి కి ఫోన్ చేసి అడిగాడు సింహాద్రి. ఇంకా వెంకటాద్రి సమాధానం ఇవ్వకుండానే “అవును రా , రెండు మాసాల నుంచి న్యూస్లో  “కరోనా కాటుకి అమెరికా విలవిల” అని , “ఆకలి రాజ్యం గా మారనున్న అగ్రరాజ్యం” అనేసి  నలుగురు తక్కువ కాకుండా తెగ డిస్కషన్లు టీవీ లో చూస్తున్నాము . “అవునోరే మర్చిపోయాను ఎప్పట్నించో అడుగుదామని , అక్కడకూడా లాక్ డౌన్ టైంలో, ఊసిపోక ఓసారి ఊరి ని చూసొద్దామని బయటకి  వెళ్తే  బాదేస్తున్నారా”  అని ప్రశ్నలుఅడుగుతూ ఉండగానే “ఎందుకు లేరా బయటకి  వెళ్లి  దెబ్బలు తినడం, ఇంట్లోనే జాగత్త గా  ఉండి  ఏదో తినేసి బతికేండీ” అని సలహా ఇస్తూ  ఫోన్  పెట్టేసాడు  సింహాద్రి.

వెంకటాద్రికి తిరిగి  ఫోన్  చేసి , సింహాద్రి కుతూహల  ప్రశ్నలకు, కూలంకుశం గా సమాధానం ఇద్దామనుకున్నాడు. కాని ఫోన్  చేస్తే  ఇంకా మిగిలిన ఛానల్ లలో జరిగిన డిస్కషన్ లు గుర్తొచ్చి , మరికొన్ని అడుగుతాడేమో అని భయపడి తిరిగి  ఫోన్ చెయ్యలేదు. ఒక పెన్ , పేపర్ తీసుకుని  స్నేహితుడు సింహాద్రికి  ఉత్తరం రాయడం మొదలెట్టాడు.

*************************

ఇంకా “లాక్డౌన్” అనేమాట ఎక్కడా  వినిపించని  రోజులు.

ఉద్యోగస్తులు ,వ్యాపారస్తులు ఎవరి పనుల్లో  వాళ్ళు ఉండి, వాళ్ళ కార్లలోనో, పక్కోళ్ల కార్లలోనో (అదే..కార్ పూలింగ్ ) , లేదా  ట్రైన్లోనో  ఆఫీస్ కి వెళ్ళి పోయి , అక్కడే బ్రేక్ఫాస్ట్ లు , లంచ్ లు తింటూ చక్క గా పని చేసుకుంటున్నారు. పిల్లకాయలు పొద్దునే లేచి చక్కగా ముస్తాబయ్యి , బుక్కులట్టుకుని బళ్లోకి వెళ్తున్నారు .

ఆఫీసునుంచి వచ్చిన వెంటనే తల్లితండ్రులు పిల్లకాయలని  కరాటే, స్విమ్మింగు, సంగీత, నృత్య, చిత్రలేఖనం లాంటి క్లాసులకి తిప్పుతూ, ఒకగంట అయినా పిల్లల్ని  స్క్రీన్  టైంకి దూరం చేస్తున్నామని సంబర పడిపోతున్నరోజులు . అప్పుడప్పుడు టీవీలు, ఫోన్లు పక్కన పెట్టి బయటికి వెళ్లి చక్కగా ఆడుకుంటున్న పిల్లలు .

****************************

అది పుట్టింది ఎక్కడో ఊహన్ లో నైనా , ఊహించుకొనే లోపులోనే  ఊళ్ళ ఊళ్ళ ని దాటుకుంటూ ,  వేలవేల మైళ్ళు ప్రయాణించి “మీ  ఊపిరిని ఊదే దానికీ నేను రెడీ” అన్నట్టుగా  ప్రపంచాన్ని చుట్టేసింది మన కంటికి కనిపించని సూక్ష్మజీవి.

అంతే ! ఆ మహమ్మారి  వచ్చేసింది. ఒక్కసారి  “షెల్టర్ ఇన్  ప్లేస్ ”  ఆర్డర్స్  వచ్చేసాయి. వర్క్   ఫ్రొం హోమ్ చెయ్యాలని , బళ్ళు  కూడా  బంద్ చేస్తున్నామని అవసరమయితే  తప్ప బయటకి  రావద్దని  వచ్చేసాయి ఆదేశాలు.

*****************************

జూమ్ (zoom )  మంతర్  కాళీ … జు..జూమ్ మంతర్  కాళీ… పొద్దున్నే  ఆఫీస్ లు జూమ్(zoom ) మీటింగ్లతో  మొదలు .

అసలే కరోనా సమయం,  ఎవడూ ఇంటిగడప దాటడని  వాళ్ళకి  ధైర్యం. స్లాక్ (slack) చాట్స్ తో  నిద్రలేపుదాం అని ఈస్ట్ కోస్ట్  వాళ్ళు ఇష్యూష్ తో మొదలెట్టిన మీటింగ్స్, అంతులేని  సీరియల్ కథల లా సాగిపోతున్నాయి.

ఎలాగో  పిల్ల, పీచు, కుక్క, నక్కా , పిల్లి, బల్లి లు  కూడా  హోమ్ లోనే  ఉంటాయి కాబట్టి, అప్పుడప్పుడు జూమ్  మీటింగ్  మధ్య లో కుక్కలతో కుశల ప్రశ్నలు, పిల్లులతో పలకరింపులు ,  పిల్లలతో అల్లర్లు . అది సీఈఓ మీటింగయినా  మామూలు మీటింగ్ అయినా ఇవన్నీ  కామన్ అన్నమాట  .

హమ్మయ్య పసిఫిక్ సమయం సాయంత్రం ఆరు అయింది. ఇక విశ్రాంతి తీసుకొని, భార్యామణి దయతలిచి చేసిన సమోసా ఛాట్  తిందామనుకుంటే , కంగారు దేశం నుంచి మళ్ళి టింగుటింగు మంటూ స్లాక్ చాట్ లు.

ఇక పిల్లల విషయానికొస్తే ,  అప్పట్లో , అప్పుడప్పుడు  బయటికివెళ్ళి చక్కగా ఆడుకొనేవాళ్ళు,  ఇప్పుడు ఎప్పుడూ ఐపాడ్ , ఫోనో,  లేదా  జూమ్  లో  క్లాస్ లతో ఇంట్లోనే ఉంటూ, అమ్మా నాన్నల చేత చక్కగా అడిగి మరీ చేయించుకుని తింటున్నారు.

గ్రోసరీస్ అన్నీ  ఆన్లైన్  లోనే   ఆర్డర్  చేసేస్తున్నారు. ఇన్స్టాకార్ట్  వాళ్ళు  డోర్బెల్   కొట్టేసి, తలుపు తీయకుండానే సరుకులు ఇంటి ముందు పెట్టేసి తుర్రుమని పారిపోతున్నారు . కొంతమంది ఆర్డరు చేసిన సరుకుల్ని కార్ దిగకుండానే  ట్రంక్  (డిక్కీ ) లో పెట్టేసి షాపులోకి తిరిగి పరిగెత్తుతున్నారు .

**************

ఇంట్లో మగవాళ్ళు , కుదిరితే  కాజా  చెయ్యమని , వీలుంటే  చేగోడీ లు అంటూ  ఆడవాళ్ళని విసిగిస్తున్నారు. అప్పట్లో వంటల్లో  చేతులు తిరిగిన మగవాళ్ళు మాత్రం, ఇప్పుడు గరిటెలు తిప్పేస్తున్నారు. వచ్చే  వీకేండ్ కి పిల్ల కాయలకి పకోడీచేద్దామా లేదా  పొటాటో  చిప్స్  చేద్దామా అనే తర్జన భర్జన లో తల్లి తండ్రులు తెగ చూసేస్తున్నారు యూట్యూబ్ లో  వంటా-వార్పుల ప్రోగ్రామ్స్ .

బయటికెళ్తే  ముఖానికి మాస్క్లేసుకుని, ఇంటికొచ్చిన వెంటనే  చేతుల్ని సబ్బేసి రుద్దేసి మళ్ళి  పక్షిలాగా గూట్లో కి వెళ్ళి దాక్కోవడం . ….”ఇలాగ  జరుగుతోంది  రా  బాబు”  అంటూ  వెంకటాద్రి  ఉత్తరం  రాసి తన స్నేహితుడు సింహాద్రికి పోస్ట్ చేసాడు.

*********************

సంవత్సరం 2022 

రెండేళ్ళ తరువాత తన స్నేహితుడు రాసిన అందిన లెటర్ ని చదువుతూ  అనుకున్నాడు సింహాద్రి , అవును ఈ కరోనా ప్రపంచం లో ఎన్నో జీవితాలని మింగేసింది…ఎందరి బతుకుల్నో చిదిమేసింది. మనిషికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. ఆ కష్ట  సమయం లో చేయూత నిచ్చిన డాక్టర్లను, నర్సుల ను, స్వీపర్లను, పోలీసులను దేవుళ్ళు అని చెప్పింది. ఉద్యోగస్తులు, పెన్షనర్లు సగం జీతం తీసుకుని మరీ ప్రభుత్వాలకు సహాయం చేశారు. ఎంతోమంది స్వచ్చంధంగా ముందుకు వచ్చి నిరుపేదలకు అండగా నిలిచారు. అలాగే మనుషులకి గడప దాటకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉండచ్చని రుజువుచేసింది….

అనుకోకుండా , అదేసమయం లో వచ్చిన తన స్నేహితుని (వెంకటాద్రి) కాల్  చూసి ఇంకా ఆనందం వేసింది .

వేంకటాద్రి :  ఎలా ఉన్నావురా సింహాద్రి , చాలా రోజులయ్యుంది

సింహాద్రి : బానేఉన్నాం రా ,  నువ్వు రాసిన లెటర్ ఇప్పుడే చదువుతున్నా .

వేంకటాద్రి :అవునా , నేను  రెండేళ్ళ కితమే రాశారా… అదిప్పుడు అందింది నీకు.

సింహాద్రి : పొనీలేరా , ఇప్పటికైనా అందింది .  ఏరా ఎలాఉన్నావ్?  అప్పటికీ ఇప్పటికీ ఏదైనా మార్పు వచ్చిందా అక్కడ? .

వెంకటాద్రి : అప్పుడు మైసూర్ పాక్ చేయడం వచ్చింది .ఇప్పుడు మొత్తానికి పూత రేకులు చేయడం వచ్చేసింది. మిగతావి అంతా సేమ్. బయటికి వెళ్తే మూతికి మాస్కు  , ఇంటికి వస్తే  చేతికి సబ్బు. అక్కడెలా ఉన్నారు మనవాళ్లు ?

సింహాద్రి : ఇప్పుడు బయట పిజ్జాలు తేవట్లేదురా …మా పిల్లలు నేను చేసిన  పిజ్జా తప్పా  ఇంకోటి తినరు.  మిగతావి అంతా సేమ్.బయటికి వెళ్తే మూతికి మాస్కు, ఇంటికి వస్తే  చేతికి సబ్బు.

***********************************************************************

నోట్:ఇది కేవలం కల్పిత కథ. పాత్రలు, పాత్రధారులు కూడా కల్పితం. ఎవరినీ ఉద్దేశించినది కాదు.

కొరోనా వైరస్ చాలా ప్రమాదకరం. దానికి గూగుల్ లోఉండే పిచాయ్ అయినా నూడుల్స్ వండే  దేశాయ్ అయినా ఒకటే .

బయటికి వెళ్తే  పేస్ మాస్కు, ఇంటికివస్తే సబ్బుతో  చేతులు రుద్దుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం

*************************************************************************

ప్రసాద్ ఓరుగంటి

గ్యాస్  బండ కిట్టయ్య

గుండె నిండా మొండి ధైర్యానెట్టుకుని , సైకిల్ వెనకాల గ్యాస్ బండల ని కట్టుకుని ఫుల్ సిలెండర్ తేవడానికి ముమ్మిడివరం వెళ్తున్నాడు కిట్టయ్య . అప్పటికే దుమ్ము పట్టిన సైకిల్ ని గుడ్డ ముక్క తో తుడిచేసి , చక్రాల్లో కొంత ఆయిల్ పోసి కొత్త సైకిల్ లాగ రెడీ చేసేసాడు.

“ఇదిగో ముమ్మిడారం  దాకా ఏళ్లొస్తా”  అని తన భార్యకి చెప్పి సైకిల్  ఎక్కపోతుంటే  “సరేలే ఎండక్కకుండా  వచ్చేసే ” అని ఇంట్లో నుంచే జాగ్రత్తలు చెప్పింది కిట్టయ్య భార్య . “అలాగే లే” అని సైకిల్ కి గ్యాస్ బుక్ లున్న  సంచి తగిలించి ,  స్టాండ్ తీసి మెల్లగా సైకిల్ ఎక్కి బయల్దేరాడు కిట్టయ్య .

ఎండాకాలం కావడం తో మండే సూరీడు కొంచం పెందలాడే  వచ్చేసి  తన  ప్రతాపాన్ని తెగ పెదర్శిస్తున్నాడు. వెళ్తున్న దారిలో కనపడే వాళ్లని నవ్వుతా పలకరిస్తూ,  ముమ్మిడారం కి వెళ్తున్నాడు కిట్టయ్య .

అప్పుడే కాఫి  హోటల్లో లోపల టిఫిన్ తినేసి బయట రోడ్డు పక్కన చేతులు కడుక్కుంటూ కిట్టయ్య ని చూసి అడిగాడు సత్యనారాయణ, “కిట్టయ్యా మంచి ఎండలో బయలు  దేరావ్ ముమ్మిడోర మేనా”  అని . “అవును నారాయణా” అని ఒకసారి సిలెండర్ తాడు గట్టిగా ఉందో లేదో అని వెనక్కి చూసి,  మెల్లగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కిట్టయ్య.

****************

ఊళ్ళో  అందరూ కిట్టయ్య  ని “గ్యాస్  బండ కిట్టయ్య ” అని పిలిచేవారు . కొంతమంది  చనువు గా ఉండే వాళ్ళు ‘కిట్టిగా ‘ అని కూడా  పిలిచేవారు . “ఇదిగో  కిట్టయ్యా  చూత్తుంటే ఈ సిలెండర్  ఇయ్యాలో రేపో  అయిపోయేలా ఉంది , ఇంటికి మా ఇయ్యాలోరు  వస్తున్నారు . గబాల్న ముమ్మిడారం వెళ్లి  ఫుల్  బండని తీసుకొచ్చే , ఇదిగో గ్యాస్ డబ్బులు, అలాగే వస్తూ  కాఫీ హోటెల్లో టీ తాగడానికి చిల్లర” అంటూ కోటయ్య, కిట్టయ్య  కి ఖాళీ  సిలెండర్ ఇచ్చాడు. “దానికేముంది  అండి , ఎలాగ  ధర్మారం గారి  ఫుల్ సిలెండర్ తేవడానికి వెళ్తున్నా, చెరోటీ కట్టేసి పట్టు కొచ్చేత్తా ” అని భరోసా ఇచ్చాడు కిట్టయ్య .

“కిట్టయ్యా ,  “పక్కాయన కి స్పేర్ సిలెండర్ ఉంది కానీ , నీకు తెలుసు కదా మా ఇద్దరికీ మాటల్లేవు , ఏదోటి చేసి ఆయనకి నచ్చజెప్పి, నా పేరు చెప్పకుండా ఆ సిలెండర్ తెచ్చేవయ్యా బాబూ.. నీకు పుణ్యం ఉంటుంది ” అని అన్నాడు రాజన్న దీనం గా మొహం పెట్టి . కిట్టయ్య కి జాలి వేసి ” అలాగే అండి  ఏదోటి  చేసేత్తా లెండి ”  అని  అనడం తో  ఆ మాటకి రాజన్న, కిట్టయ్య చేతులు పట్టేసుకున్నాడు నవ్వుతా.

కిట్టయ్య కి సిలెండర్ పని లేకపోతె, ఊళ్ళో ఇంకో  పని ఏదైనా చేస్తూ, జనాల తలలో నాలుక లా ఉండేవాడు . కిట్టయ్య కి జరమొచ్చి  కనపడక పోతే  ఊరంతా గగ్గోలు  పెట్టేసేవారు . కిట్టయ్య వంట్లో నలత గా ఉందని కొంత , వాళ్ళ ఇంట్లో వంట కి ఇబ్బంది అవుతుందేమో  అని మరి కొంత.

గాలి వానకి ఊరంతా అతలాకుతం అయిపోతే , ఊళ్ళో వాళ్ళతో పాటు కిట్టయ్య కూడా ఊరు మామూలు గా అవడానికి చాలా కష్ట  పడ్డాడు. కొన్నాళ్ళు గ్యాస్ సిలెండర్ తేవడానికి డబ్బులు కూడా తీసుకోలేదు.

“ఏరా కిట్టి గా, ఎంత కాలం ఇలా సిలెండర్ లు మోస్తావు రా, ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు కదరా” అని తనకి కావాల్సిన వాళ్ళు అంటే, “ఇయ్యాల రేపే ఇలాంటి పనులు ఉంటాయి మనకి, తరువాత ఎప్పుడో ఆ సిలెండర్ లు లారీ లోనో  ట్రాక్టర్ లోనో ఇంటి ఇంటికి తెచ్చేసే  రోజులు వస్తాయి” అని అడిగిన వాళ్ళకి నవ్వుతూ చెప్తూ ఉండే వాడు కిట్టయ్య .

**************************

కొంతకాలం ముందట ,కుంపటి లో బొగ్గులు వేసి వేసి, కింద మంట వచ్చే వరకు ఊదుతూ, ఎప్పడు వంట  అవుతుందో అని కుంపటిని  మసిబారిన ముఖం తో చూస్తూ, వంట వండే మగువలు. పొలం లోకో, పొరుగూరికో  కొంచం పెందలాడే తినేసి వెల్దామనుకుని, ఆ కుంపటి ని చూస్తూ కుత కుత లాడిపోయే మగాళ్లు .

మెల్లగా కాలం మారి, ఊళ్ళో  చాలామంది కుంపటి , నూతన్ స్టవ్ నుంచి గ్యాస్ స్టవ్ కి మారే రోజులు రావడం తో ఇళ్ళల్లో వంటలన్నీ గ్యాస్ మీద నడుస్తున్నాయి.  ఇంట్లోకి కొత్త గ్యాస్ కనెక్షన్ ఇస్తే , ఊరంతా  ఒకసారి వచ్చి చూసి ముచ్చటపడే రోజులు అవి .

తరువాత ఊళ్ళో జనాలు సిలెండర్ కోసం సైకిల్ మీద ముమ్మిడారం వెళ్లి ఫుల్ సిలెండర్ ని సైకిల్ వెనకాల కారేజీకి పెట్టి , సిలెండర్ కదలకుండా గోనెసంచి చుట్టి , దానికి పెద్ద చేంతాడు పకడ్బంధీ గా కట్టి, కష్టపడీ తీసుకొస్తున్నారు.

ఊళ్లోకి  కి అప్పుడే వచ్చిన కిట్టయ్య ఇదంతా చూసి ,  “ఆ కష్టమేదో నేనే  పడతాను, నా సైకిల్ కి గ్యాస్ బండలు చెరోటీ  అటూ ఇటూ తగిలించేస్తాను.కాపోతే సిలెండర్ తేవడానికి మీకు తోచింది ఇవ్వండి  చాలు” అని ఒకరిద్దరు దెగ్గర అనడం తో  వాళ్లకి తెగ నచ్చేసి , “ఊరులోఎవరకి అవసరమొచ్చినా నీదేరా కిట్టిగా” అనేసారు. అప్పటు నుంచి కిట్టయ్య  గ్యాస్ సిలెండర్ కిట్టయ్య అయ్యాడు.

కిట్టయ్య చూడ్డానికి సన్నగా ఉన్నా , చాలా మొండోడు. గ్యాస్ బండ ని అమాంతం గాఎత్తేసి అడిగినోళ్ళింట్లో  వంటింట్లో పెట్టేసి, రెగ్గులేటర్ ని కలిపేసి , గ్యాస్  వెలిగేవరకు దెగ్గరఉండి  ఏ లీకు లేకుండా చూసుకుని అప్పుడు వెళ్లేవాడు.

****************************************

సైకిల్ మీద ముమ్మిడారం వెళ్తున్న కిట్టయ్యకి  బొండాయికోడు దాటిన తరువాత కొంచం తల తిరగడం అని అనిపిస్తే , పక్కనేవున్న సోడా బడ్డీ  దెగ్గర కెళ్ళి , గోళీసోడా కొట్టమ్మనాడు. “అలాగే కిట్టయ్యా , కొంచెం  నీడలోకి వచ్చి నిలబడు” అని అన్నాడు సోడా బడ్డీ సుందరయ్యా . ‘అలాగే’ అంటూవచ్చి సోడా తాగేసి, జేబులోంచి చిల్లర తీస్తూ కింద పడిపోయాడు….

***********

కింద పడిన చిల్లర నేల మీద పడి గిరగిరా తిరుగుతున్నాయి. సోడా బడ్డీ సుందరయ్య కి నోటిమాట రావడం లేదు .

చుట్టుపక్క జనాలు అంతా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. “ఎండ లో  వడ దెబ్బ కొట్టేసి ఉంటుంది, కొంచం చల్లటి నీళ్లు మొహం మీద కొట్టండి. మన కిట్టయ్య లేచి కూర్చుంటాడు” అని కిట్టయ్య కి తెలిసిన ఒక పెద్ద మనిషి  అంటున్నాడు.

నీళ్లు మొహం మీద గుమ్మరిస్తున్నారు , లే… లే కిట్టయ్యా  అని అరుస్తూనేఉన్నారు … కింద పడిన చిల్లర కదలకుండా  నేలకి అంటిపెట్టుకునే ఉన్నాయి. సైకిల్  క్యారేజ్ కి కట్టిన గ్యాస్ బండలు కూడా సైకిల్ కి అంటిపెట్టుకునే ఉన్నాయి.

****************

ఆవిషయం తెలిసిన వెంటనే ఊరంతా స్తంభించింది . “ఎప్పుడూ మనతోటి ఉండే కిట్టయ్య ఇక లేడు” అనేది జీర్ణించుకోలేక పోయారు

*****************

రోజులు గడుస్తున్నాయి ……సంవత్సరాలు  పరిగెడుతున్నాయి .

*************

ఊళ్ళో కి పెద్ద లారీ హార్న్  వేసుకుంటూ వస్తోంది. లారీ  వెనకాల బోల్డన్ని సిలెండర్ లు కట్టేసి ఉన్నాయి. లారీ లో నుంచి ఒక కుర్రాడు దిగుతూ “మీరు ఫోన్ లో బుక్ చేసారు కదా ! సిలెండర్ ఇదిగోండి అంటూ ఇంటిగుమ్మం ముందు పెట్టీసి వెళ్ళిపోయాడు . లారీ దుమ్ము లేపుకుంటూవెళ్లిపోయింది. బయట ఇంటి గుమ్మంలో పెట్టిన సిలెండర్ ని లోపల కిచెన్లో కి  మోసికెళ్తూ , కిట్టయ్య ని ఓసారి గుర్తు చేసుకున్నాడు రాజన్న.

****************************************

ప్రసాద్ ఓరుగంటి

అప్పుడు అలాగ …ఇప్పుడు ఇలాగ

ఇంకా టీవీ ఏంటెన్నా లు అక్కడక్కడా కనపడే రోజులు, అలాగే సమయం సందర్భం లేకుండా కరెంట్ తీసేసే సమయం 

సిగరెట్టు పొగలు దట్టం గా గాల్లోకి సుడులు సుడులు గా తిరుగుతున్నాయి. అక్కడ హాళ్ళో కూర్చున్న పిల్లలూ, పెద్దలూ అటువైపే చూస్తున్నారు.తరువాత ఏమి జరుగుతుందా అని. ఈ లోపులో టపీమని కరెంట్ పోయింది. చూస్తున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా అరిచారు. దూరం గా ఒకడు పరిగెత్తుకుంటూ ఆయాస పడుతూ ఈ ఇంటికి వస్తున్నాడు. ఆయాసపడుతూ చెప్తున్నాడు “ఇప్పుడే లైన్ మాన్ నిచ్చినేసుకుని ఆ వీధి లో కి వెళ్తున్నాడు, బహుశా అతడే కరెంట్ తీసేసి ఉంటాడేమో అని అన్నాడు. అక్కడున్న వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. “రండి రా వెళ్దాం” అంటూ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ తీసి సైకిల్ సీట్ మీద ఒకడు, ముందర కడ్డీ మీద ఇంకోడు, వెనకాల క్యారేజీ మీద మరొకడు తొక్కుకుంటూ “అసలు ఎవడు ఈ టైం లో కరెంట్ తీసాడు” అని అడిగి కడిగి పడేద్దామని ఆవేశం గా బయలుదేరారు.

వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి , ఆ వ్యక్తి సైకిల్ కి నిచ్చెన కట్టుకుని కొబ్బరి తోటలో కి వెళ్లడం తో “ఎహె ఇతను లైన్ మాన్ కాదు. కొబ్బరి కాయలు దింపులు తీయడానికి తోటలోకి వెళ్తున్నాడు” అని గ్రహించి , “ఎవడు చెప్పాడో వాడి పని పడదాం” అనుకుని మళ్ళి సైకిల్ వేసుకుని బయలుదేరారు. కరెంట్ ఇక్కడ కాదంట , “బొమ్మూరు లో పెద్ద ట్రాన్సఫార్మర్ పేలి పోయిందిట, ఇయ్యాల ఇంకా రాదు ట” అని అంతక ముందర చెప్పినాడే సైకిల్ మీద వెళ్ళిపోతూ చావు కబురు చల్లగా చెప్పాడు. “కరెంట్ ఎలాగ లేదు, రండిఎహె క్రికెట్ ఆడుకుందాం” అని ఎవడో చెప్పడం తో కుర్రాళ్లందరూ వికెట్ లు, బాట్, బాల్ పట్టుకుని సంత పాకల మీదుగా హై స్కూల్ కి వెళ్తున్నారు.

*******

ఒక అర్ధ రూపాయి కోయిన్ గాల్లో కి యెగిరి తిరుగుతోంది. అక్కడున్న అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. కాయిన్ కింద పడి బొమ్మ పడితే బాటింగ్ చేద్దామని రాంబాబు అనుకున్నాడు. కానీ అది బొరుసు పడడం తో “కాయిన్ సరిగా గిర గిరా తిరగలేదు” మళ్ళీ కాయిన్ వేయమన్నాడు. “లేదు లేదు” అని అటుపక్క టీం జనాలు గొడవ చేస్తున్నారు. రెండో సారి మళ్ళీ కోయిన్ గాల్లో కి ఎగిరింది.ఈ సారి కాయిన్ మళ్ళీ బొరుసు పడింది. “లేదు లేదు మూడో సారి వెయ్యాలి. మూడోసారి ముత్యం. ఇదిగో !ప్రభాకర్ ఈ సారి, కాయిన్ కిందపడిన వెంటనే, నీ కోయిన్ తీసేసుకో” అని ఆదేశమిచ్చాడు రాంబాబు. దీన్ని కొన్ని ఊళ్ళల్లో “గొని” అంటారని రాంబాబు వాళ్ళింటికొచ్చిన చుట్టాలబ్బాయి చెప్పాడు. మరి కొంతమంది “తొండి” కూడా అంటారని ఆ తరువాత తెలిసింది. మొత్తానికి మూడోసారి బొమ్మ పడటం, ప్రభాకర్ కోయిన్ తీసేసుకుని జేబులో పెట్టేసుకోవడం జరిగిపోయాయి.

అటుపక్క టీం ఇక చేసేదేమి లేక బాల్ పుచుకుని బౌలింగ్ వేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి మొదట టీం బాటింగ్ అయ్యింది. బౌలింగ్ వేసి వేసి అలిసి అలిసి విసిగిపోయిన రెండో టీం బాటింగ్ కి రెడీ అవుతున్నారు.”మొదట ఓపెనర్ గా ఎవడు” అని డిసైడ్ చేసుకోలేక పంటలు వేయమన్నాడు శీను . మొదట బాటింగ్ చేద్దామనుకున్న ముగ్గురు చేతులు పట్టుకుని పంట వేయడం మొదలెట్టారు. ఆ పంట లో మిగతా ఇద్దరికన్నా భిన్నం గా చేయి వేయడం తో శీను నెగ్గాడు. మొత్తానికి మొదట బాటింగ్ వచ్చిందని చేతికి గ్లోవ్స్ ,కాళ్ళ కి పాడ్ పట్టుకుని క్రీజ్ లో కి అంతులేని ఉత్సాహం తో వెడుతున్నాడు శీను. అటుపక్క బాల్ పుచ్చుకుని స్పిన్ చేద్దామని రాంబాబు రెడీ అవుతున్నాడు.

దూరం గా సైకిల్ మీద ఒక వ్యక్తి గ్రౌండ్ లో కి రావడం కనిపిస్తోంది. అతని మాటలు దగ్గెరవుతున్నాయి. “కరెంట్ వచ్చేసింది ట” “కరెంట్ వచ్చేసింది ట” అని ఆయాస పడుతూ సైకిల్ దిగకుండానే అరుస్తున్నాడు. ఇది విన్న వెంటనే బాల్ ని పక్కన పడేసి అతని సైకిల్ ఎక్కేసి ఊళ్ళో కి తుర్రున పారిపోయాడు రాంబాబు .మొదట ఇన్నింగ్స్ ఆడేసి ఫీల్డింగ్ చేస్తున్న కుర్రాళ్ళు కూడా పరిగెత్తు కుంటూ వెళ్లిపోయారు. అటుపక్క రన్నర్ గా నించుని, బ్యాట్సమెన్ సింగల్ కొడితే, పరిగెత్తడానికి సిద్ధం గా వుండి బాటింగ్ చేసేద్దామనుకున్న ఇంకో కుర్రాడు, “మొదట ఇన్నింగ్స్ లో బౌలింగ్ ఎలాగ ఇవ్వలేదు, వీళ్లిద్దరి లో ఎవడో ఒకడు త్వరగా అవుట్ అయిపోతే , హ్యాపీ గా ఫస్ట్ డౌన్ దిగేద్దామని” వెయిట్ చేస్తున్న ఇంకోడు, ఇలాగ బౌలింగ్ వేసిన బ్యాచ్ చేసేదేమి లేక పాడ్ లు, వికెట్ లు పట్టుకుని సంత పాకల మీదుగా ఇంటికి తిరుగు ముఖం పెట్టారు.

******

మళ్ళీ అందరూ పోగయ్యారు హాళ్ళో టీవీ చూడ్డానికి. అప్పుడే కపిల్ దేవ్ బౌలింగ్ లో జావేద్ మియాందాద్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాల్ ఈలలతో, చప్పట్లతో మోత మోగి పొయ్యింది. ఆ టైం లో టీవీ చూస్తూ ఒక పిల్లగాడు ఆవలిస్తున్నాడు. “ఒరేయి నువ్వు ఆవలిస్తూనే ఉండరా ఈ మ్యాచ్ అయ్యేవరకు , ఇంకో వికెట్ పడుద్దేమో” అని కుర్చీ లో ముందరకే టెన్షన్ తో కూచుని ఉన్న సూరి ఆ కుర్రాడి తో అన్నాడు. వాడు నోరు తెరిచి ఆవలిస్తూనే ఉన్నాడు, మరో వికెట్ పడుతుందేమో అని. అలాగ క్రికెట్ మ్యాచ్ లు చూడ్డానికి అందరూ కలిసి టీవీ ఉన్న ఇంట్లో కెళ్ళి మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు

**********

టీవీ ఏంటెన్నా లు కొబ్బరిచెట్లతో పోటీ పడి మరీ కనపడే రోజులు, అప్పటిలాగానే సమయం సందర్భం లేకుండా కరెంట్ తీసేసే సమయం

రోజులు గడుస్తున్నాయి….కాలం కపిల్ దేవ్ బంతి లా ఫాస్ట్ గా తిరుగుతోంది. అందరి ఇంటి పెరట్లో ఏంటెన్నా లు కొబ్బరి చెట్లతో పోటీ పడీ మరీ నిలిచి ఉన్నాయి. ఎప్పుడూ చెట్ల మీదో, ఇంటి పై కప్పుల మీదో వాలే పక్షులు చక్కగా ఏంటెన్నా ల మీద వాలి ఉయ్యాల జంపాలా ఆడుకుంటున్నాయి.

“మా టీవీ లో బొమ్మల కన్నా చుక్కలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి అని ఒకడు . “మా టీవీ లో సౌండ్ వినిపిస్తోంది, బొమ్మ రావట్లేదు అని వాపోతున్నాడు మరొకడు. యాంటెన్నా లు ఇటుతిప్పి, ఎటు తిప్పినా చుక్కలు, ఆ చుక్కల్లో చంద్రుడు లాగా వార్తలు చదివే శాంతి స్వరూప్.

ఇంట్లో టీవీ లు అయితే దిష్టి బొమ్మల్లా టేబుల్ మీద కూర్చున్నాయి .బయట యాంటెన్నా లు రేవు లో తాడి చెట్లలా ఉన్నాయి. మనకి టీవీ చూసే భాగ్యం లేదా అని అందరూ విసుక్కుంటూ, చుక్కల్లోనే అప్పటి యాంకర్ చెప్పే “ఉదయం ఉదయం ప్రసారాలు, మధ్యాన్నం -మధ్యాన్న ప్రసారాలు” లు వింటూ ఎవడైనా వచ్చి బావు చేత్తే బావుండును అని అనుకుంటున్నారు.

****

దూరం గా సన్నటి వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. చూడ్డానికి శివ లో నాగార్జున లాగా ఉన్నాడు. సైకిల్ స్టాండ్ వేసాడు. కింద కి వంగి నాగార్జున లాగ సైకిల్ చైన్ తీయకుండా, సంచి లోంచి స్క్రూ డ్రైవర్ తీసాడు .ఇంకో చేతిలో రెంచు పట్టుకుని, నోటిలో స్క్రూ డ్రైవర్ పట్టుకుని చకచకా గోడ ఎక్కేసాడు ఏంటెన్నా ని ఫిక్స్ చేయడానికి. “హమ్మయ్య డాట్రు గారి సత్తిబాబు వచ్చేసాడు” ఇక టీవీ లో బొమ్మ కనపడుద్ది అని టీవీ ఆన్ చేయడానికి లోపలకెళ్ళాడు అప్పటిదాకా చుక్కల్లో వికెట్ లని లెక్కెట్టుకుంటున్న ఒకడు. సత్తిబాబు వచ్చేసాడు అని తెలుసుకున్న ఇంకోడు సైకిల్ ఎక్కి వచ్చేసి గోడమీద ఉండి ఫిక్స్ చేస్తున్న సత్తిబాబుని “ఏవయ్యా సత్తిబాబు ఇక్కడ బిగించేసి గొమ్ముని వచ్చేవయ్యా బాబు, టీవీ సరిగా చూసి చాలా రోజులయ్యింది ” అని అనేసి తుర్రున సైకిల్ ఎక్కి వాళ్ళఇంటికి వెళ్ళిపోయాడు సత్తి బాబు కి ఘన స్వాగతం చెప్పడానికి. మొత్తానికి అందరి ఇళ్లల్లో ఏంటెన్నా లు ఫిక్స్ చేసేసి చుక్కలు లేని టీవీ లో బొమ్మల్ని చక్కగా రావడానికి సత్తిబాబు చుక్కాని అయ్యాడు.

ఇంటికెళ్లిన సత్తిబాబు ఆలోచిస్తున్నాడు. తరువాత ఏమి చేస్తే బావుంటుంది అని.

***************

యాంటెన్నా గొట్టాలని బట్టలు ఆరేసేందుకు ఉపయోగపడే సమయం

రోజులు దూసుకెళ్తున్నాయి. కాలం మారుతోంది. ఎప్పుడో టీవీ లో వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చే సినిమా లు కాదు.ప్రతి రోజు వస్తే యెంత బావుంటుంది అని, మనకు కావలసిన సినిమా లు వేస్తె ఇంకా సూపర్ అనుకునే రోజులు.

ఒక ఇంటి పై కప్పు మీద పెద్ద డిష్ ఉంది. ఇంట్లో కట్టలు కట్టలు గా కేబుల్ వైర్లు. ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళు ఇంటింటికి వెళ్లి కేబుల్ కనెక్షన్ ఇస్తున్నారు .అప్పటికే అందరి ఇంట్లో నల్లటి కేబుల్ వైర్లు టీవీ తో కనెక్ట్ అయ్యిపోయి ఉన్నాయి. రోజుకి కావలసిన సినిమాలు వేసేస్తున్నారు.

మెల్లగా ఛానెల్స్ కూడా వస్తున్నాయ్. ఈ టీవీ మీ టీవీ అని, ఈ కేబుల్ మీ కేబుల్ అంటూ ఒక ఛానల్, రెండు, మూడు. ..మెల్లగా మెల్లగా లెక్కలేని ఛానెల్స్ . బోల్డన్ని సినిమాలు. చానెల్స్ లో సీరియల్స్ .

*****

రాత్రి సమయం 7 గంటలు. ఊరు బయట అంతా నిశ్శబ్దం. ఒక ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. ” నువ్వు బతకాలంటే, ఇక్కడనుంచి వెంటనే వెళ్ళిపో ” అని. ఇంకో ఇంట్లో ” నిన్ను చంపకపోతే నా పేరు అఖిలాండేశ్వరి కాదు” అని. ఇంకో ఇంట్లో కూడా ఇంచు మించు అలాంటివే. ఇవన్నీ ఎవరింట్లో గొడవలు కావు . టీవీ సీరియల్స్ లో అరుపులు.

***********

ఫోన్ లోనే ప్రపంచాన్ని చూస్తూ, పక్కన ఏమి జరుగుతుందో తెలియని రోజులు :

పెద్ద పెద్ద టీవీ లు. టీవీ లో బోల్డన్ని ఛానెల్స్. ఛానెల్స్ లో లెక్కలేని మరియు అంతం లేని సీరియల్స్.

పెద్ద పెద్ద సెల్ ఫోన్లు . ఫోన్లలోనే ప్రపంచికం. ఆ ప్రపంచికం చుట్టూతా పిల్లలూ , పెద్దలూ.

హల్లో కూర్చుని చేతి లో మొబైల్ పట్టుకుని టీవీ లో వస్తున్న క్రికెట్ ని చూస్తున్నాడు ఒక కుర్రోడు. టపీమని కరెంట్ పోయింది. “రేయ్ ఆడుకుందాం వస్తావా” అని పక్క ఇంట్లో ఉంటున్న ఇంకో కుర్రోడుకి వాట్స్అప్ చేసాడు . “ఇదిగో వచ్చేస్తున్నా రా” అని అతను రిప్లై ఇచ్చాడు. మూడో కుర్రాడు కూడా “నేను కూడా వస్తున్నా” అని వీళ్ళ తో వచ్చి చేరాడు. ముగ్గురు కలిశారు. ఒక చోట కి చేరారు . ముగ్గురూ జేబులో నుంచి సెల్ ఫోన్ లు తీశారు. మొదలెట్టారు సెల్ లో గేమ్ లు.

*******************************

ప్రసాద్ ఓరుగంటి

మార్గ దర్శకులు

అది 1969 సంవత్సరం జూన్ మాసం, నాలుగవ తేదీ బుధవారం.

ఈ సంవత్సరం లోనే ప్రపంచం లో కొన్ని అద్భుతాలు జరిగాయి. భారత దేశం గర్వించే ISRO ఈ సంవత్సరం లో ప్రారంభం అయ్యింది. అలాగే చంద్రుని మీద మొట్టమొదట కాలు పెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా ఈ సంవత్సరం లోనే.

**********

పై తేదీ కొన్ని నెలల ముందర:

ఒక అందమైన అనాతవరం గ్రామం యువకుడు పక్క ఊరులో టీచర్ ఉదోగ్యం చేస్తూ జీవితం లో స్థిర పడి, తన అమ్మ కి మంచి కోడలిని తీసుకొద్దామనుకున్న వేళ,

ఆ సమయం లోనే ఒక పెద్దాయన తన చిన్న కూతురికి పెళ్లి సంబంధం వెతుకుతూ , అంబాజీ పేట కోఠి వారి అగ్రహారం నుండి అనాతవరం వచ్చి అక్కడ గంటి బుచ్చి మాస్టర్ గారిని కలిసి, “మాస్టారూ! ఈ ఊరులో ఒక టీచర్ కుఱ్ఱాడు మంచి పెళ్లి కొడుకు ఉన్నాడుట మీకు తెలుసునా ” అనీ అడిగిన వేళ .

ఆ వేళలు ఒకటై , వీరిద్దరిని ఆ దేవతలు కలుపుదామని అని నిశ్చయించినట్టుగా

నందంపూడి జమీందార్ గారు , కొత్తూరి నరసింహ మూర్తి గారు మరియు పెద్దల సమక్షం లో అనాతవరం లో “మా కుర్రాడు వజ్రం” అని అనాతవరం పెద్దలు, “మా అమ్మాయి బంగారం” అని అగ్రహారం పెద్దలు అనుకుని పెళ్లి కి తాంబూలాలు పుచ్చుకున్నారు.

*******

కోఠి వారి అగ్రహారం. చుట్టూత కొబ్బరి చెట్లు. ఆ వీధి లో దూరం గా కొబ్బరి మట్టలతో, రాట్లతో వేసిన పెళ్లి పందిరి నిండా మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి. ఆ పందిరి రాట్లని పట్టుకుని చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు సందడి గా అటూ ఇటూ తిరుగుతున్నారు. పెళ్లి కి వస్తున్న చుట్టాలు ఒకొక్కలే గుర్రం బండి లో నుంచి దిగుతున్నారు. అప్పుడే వేసవి కాలం మెల్లగా వెళ్తూ ,వరుణుడు ని పిలిచినట్టుగా పై నుంచి చిరు చిరు జల్లులతో ఆశీర్వదిస్తున్నాడు.

పెద్దల సమక్షం లో, దేవతల ఆశీర్వాదం తో వేద మంత్రోచ్ఛారణల ల మధ్య , చిరు చిరు జల్లులతో 1969 సంవత్సరం జూన్ మాసం, నాలుగవ తేదీ ,బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం పంచమీ తిధిన ఆ అనాతవరం యువకుడికి ,అగ్రహారం యువతికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులను ముత్యాల పల్లకి లో కొత్తూరి వీధుల లో ఊరేగుతుంటే, “ఆ సీతా రాములు ఇక్కడకొచ్చి పల్లకి లో ఊరేగుతున్నారా” అనేట్టు గా కళ్యాణం కమనీయంగ జరిగింది.

*******

వరుడు: ఓరుగంటి శ్రీరామ మూర్తి (రాంబాబు), ఓరుగంటి అప్పారావు మరియు సావిత్రిల ఆఖరి అబ్బాయి

వధువు: కొత్తూరి పర్వత వర్ధని . కొత్తూరి రమణప్ప శాస్త్రీ మరియు నాగమణిల నాలుగవ అమ్మాయి

**********

వరుడు అక్క లు సత్యవతి, సుబ్బులు మరియు అన్న వెంకటరావు మరియు వదిన లు వచ్చి తమ్ముడు మరదలును ఆశీర్వదించటం, అప్పుడే వచ్చిన గిరి బావగారు అందరిని సంబ్రమాశ్చర్యాలతో ఆనందింప చేయడం, వధూ వరులను ఆశీర్వ దించడం ఇవన్నీ వరుడు కి సంతోషమైయితే

అక్క చెల్లెల్లు, అన్న తమ్ముళ్లు, మరియు కొత్తూరు వంశీయుల మధ్య జరుగుతున్న కళ్యాణం, అలాగే పేరులో నే సుగుణాలని పెట్టుకున్న వరుడును చూసి వధువు కి ఆనందం.

ఇన్ని ఆనందాల మధ్య అగ్రహారం లో కొత్తూరు నరసింహ మూర్తి దంపతులు (వధువు పెదనాన్న & పెద్దమ్మ) వరుడి కి కాళ్ళు కడిగి కన్యాదాన చేసిన సమయాన, వధువు తల్లి తండ్రుల ఆనంద అశ్రునయనాల మధ్య, కొత్తూరి వంశీయుల కోఠివారి అగ్రహారం నుండి 13 కిలో మీటర్ దూరం లో అనాతవరం లో నున్న అత్త ఇంటి గడప ని కుడి కాలు తో అడుగు పెట్టింది కొత్త కోడలు పర్వత వర్ధని .

నా ఇంటికి వచ్చింది కన్న కూతురు లాంటి కోడలు పిల్ల అని అనుకుని కొత్త కోడలు ని అపురూపం గా చూసుకుంటూ మురిసిపోయింది అత్తగారు సావిత్రమ్మ. ఇలాగ పర్వత వర్ధని, కోడలి గా వచ్చి తన పెద్ద బంధు వర్గాన్ని అత్తింటికి పరిచయం చేసింది.

*******

ఇలాగ , వాళ్లిద్దరూ ఏభై సంవత్సరములు కలిసి ఆనందం గా అనాతవరం లో సంతోషం గా గడుపుతూ ఉన్నారు. ఈ రాంబాబు మాస్టర్ అంచెలంచెలుగా తన టీచర్ వృత్తిలో ఎన్నో శిఖరాలను అధిరోహించి ,తన పల్లె ని ఢిల్లీ కి పరిచయం చేసి రాష్ట్ర పతి చేత అవార్డు అందుకున్న ఉత్తమ ఉపాద్యాయుడు ఇతడు. ఈ ఉత్తముడు కి వచ్చిన ఈ అపురూప బహుమానం వెనుక ఆమె చేసిన అపూర్వ సహాకారం ఉంది అనటం లో అతిశయోక్తి లేదు.

ఈ దంపతులు ఎందరో యువ దంపతులకు ఆదర్శ పాత్రులు. మరెన్న మందికో మార్గ దర్శకులు.

మీ ఏభై వ (50th ) పెళ్లి రోజు శుభాకాంక్షలు చెపుతూ మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆనందం గా గడుపుతూ ఇంకా వచ్చే యువ దంపతులు కూడా మీ బాట లో నే మీ ఆదర్శం గా ఉంటారని,

సక్సెస్ ఫుల్ శ్రీరామా మూర్తి కి, విక్టరీ మేడం వర్ధనికి ఏభై వ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ…..ఎప్పుడూ మీ బాట లో నడిచే…

——————-

మీ కుమారులు & కోడళ్ళు , మనుమలు & మనవరాళ్లు ,బంధువులు, మీ అభిమానులు మరియు మీ శ్రేయోభిలాషులు.

************

Written by Prasad Oruganti.

రథ యాత్ర -2 (అనాతవరం దేవుడి పెళ్లి కథ)

దేవుడి పెళ్లి (1955 నుంచి 1981 ):

గ్రామం లో కి కరెంట్ వచ్చిన సమయం. కరెంట్ స్తంభాలు పాది , తీగల ద్వారా ఇళ్లల్లో కి కరెంట్ ఇస్తున్నారు. పక్షులు చెట్లు, ఇళ్ల కప్పులతో పాటు కరెంటు తీగల మీద, స్తంభాల మీద వాలి రీ ఛార్జ్ చేసుకుంటున్నాయి. కొంతమంది ఇళ్లలో కరెంట్ దీపాలు వెలుగుతున్నాయి. ఊరికి కరెంట్ వచ్చిందని గ్రామం మొత్తం సంతోషం గా ఉంది.

ఇంకో మూడు నెలలో వైశాఖ మాసం. రధం చూస్తే నలభై అడుగులు. కరెంట్ తీగలు రావడం తో , ఈ రధం తో రధ యాత్ర చెయ్యడం కష్ట మని పెద్దలు నిశ్చయించుకున్నారు. పల్లకీ మరియు ఇతర దేవతా వాహనాలతో దేవుడి కళ్యాణం చేద్దామనుకున్నారు. అది తెలుసుకున్న కొంతమంది పిల్లలు, యువకులు గాబరా పడ్డారు. “అయ్యో ఇంక రధం తిరగదేమో, మనం రధం లో కూర్చోలేమని /రధాన్ని లాగలేమోమని”. “ఈ కరెంట్ కన్నా కొండత యెత్తునున్న రథమే కావాలి ” అని పిల్లలు ఏడుస్తున్నారు.

అభివృద్ధి తో పాటు ఆచారం కూడా ముఖ్యమనుకుని, నూకల బుల్లివెంకన్న గారు, నూకల సుబ్బారావు గారు, రామరాజు గారు మరియు మిగతా ఊరి పెద్దలంతా అనుకుని, నలభై అడుగుల రధాన్ని సగానికి సగం ఇరవై అడుగులు చేసి, రధ యాత్ర ని కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు. పెద్ద పెద్ద చక్రాలు, టర్నింగ్ లో ఎడమ వైపు కు గాని , కుడి వైపు కు గాని సులువు గా తిరగడానికి దీర్ఘ చతురస్రాకారం లో ఉండే ఇనప డ్రైవింగ్ స్టీరింగ్, బలమైన పగ్గాలు తో రధం , రధోత్సవం కి తయ్యార్ అన్నట్లు శివాలయం గుడి పక్కన ఠీవీ గా నిలబడి ఉంది.

*********

వేసవి కాలం వైశాఖ మాసం ఎప్పుడొస్తుందా అని పిల్లలు, యువకులు. రధోత్సవం లో మూర్తీభవించిన ఆ దేవతా మూర్తులని కళ్లారా చూద్దామని పెద్దలు, అందరూ వేయి కళ్ళతో తో చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది.

అప్పట్లో రధం లో కూర్చున్న పిల్లలు, ఇప్పుడు యువకులయ్యారు. అప్పటి యువకులు కొంచం పెద్ద వాళ్ళయ్యారు. యువకులు రధం పగ్గాలు చేత పట్టారు. మళ్ళీ అదే నినాదాలు “అశ్శరభ శరభ” “అల్లెల్ల వీర “, తో రధాన్ని ముందుకి నడిపిస్తున్నారు. రధం తో పాటు పల్లకీ , దేవతా వాహనాలు తో మేళ తాళాలు. వీటిలితో పాటు భోగం మేళాలు కూడా జోడించారు.

అదే ఉత్సాహం , అదే భక్తి అందరిలో..పెద్దవాళ్ళందరూ ముందు ఉండి , జాగ్రత్త గా రధ యాత్ర ని నడిపిస్తున్నారు.

**********

రధం శివాలయం , విష్ణాలయం మీదుగా రెండో వీధి లో కి ప్రవేశించి కట్లమ్మ గుడి దగ్గెర ఆపారు . అక్కడనుండి రెండో వీధి మీదుగా ఒకటో వీధి లో కి ప్రవేశిస్తుండగా తూము దగ్గెర ఒక మధ్య వయస్కుడు నల్లటి ముసుగు లో దూరి ” అందరూ రెడీ నా రైట్ రైట్ “ అంటూ తన కెమెరా లో నుంచి రధం లాగుతున్న యువకులకు, అక్కడున్న పెద్దలకి నించోమని చెప్పి, ముసుగులో అన్ని సెట్ చేసుకుని , పావు గంట తరువాత ఫోటో లు తీసారు . అతనే నూకల విశ్వ సుందరం గారు మరో పేరు ఫోటో సుందరం గారు. ఈయన ఫోటో లు తీసిన తరువాత రధం ఒకటో వీధి లో కి ప్రవేశించింది.

మొదట రోజు గుళ్లో పానకాలు , ఒక రోజు నారాయణమూర్తి గారింట్లో , నూకల సుబ్బారావు గారింట్లో, రామరాజు గారింట్లో, చివరి రోజు సరిపెల్ల వారింట్లో ఇచ్చేవారు. అప్పుడప్పుడు గేట్ లో నుంచి వచ్చి రధోత్సవం లో ఉత్సాహం గా హాజరయ్యే వాళ్ళలో చెల్లు అగ్గన్న గారు, తాతబ్బాయి నాయుడు గారు, రామదాసు బంగారయ్య (ఆదిబాబు గారి తండ్రి) కూడా ముందర ఉండే వారు.

*********

సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అనే రోజు , మళ్ళీ వచ్చింది .అప్పటి యువకులు తోటకూర సత్తికొండ రాజు గారు, వడ్లమాని బాబీ (అవతారం గారి బాబీ) గారి ఆధ్వర్యం లో పిల్లలతో , వాళ్ళ చిన్ననాటి స్నేహితులతో, అప్పటి పెద్దల ఆశీర్వాదం తో మళ్ళీ ” “అశ్శరభ శరభ” “అల్లెల్ల వీర ” నినాదాలతో, కేరింతలతో , భక్తి తో పాటు ఈ సారి పిల్లల్లో , యువకులలో ఉత్సాహం నింపుతూ దేవుడి పెళ్లి ని బ్రహ్మాండం గా మేళ తాళాలు , భోగం మేళాలు , పెద్ద పల్లకీ ఊరేగింపులు , పానకాలు తో ఐదు రోజుల పాటు రధోత్సవం అంతే అంగరంగ వైభవం గాజరిపించారు. మేము సైతం మేము సైతం అంటూ,

నూకల సత్తి బాబు (రవణమ్మ గారి సత్తి బాబు) గారు, నూకల సూరిబాబు (పొట్టి సూరి) గారు, సరిపెల్ల భూషణం గారు, నూకల కాంబాబు గారు, సిద్ధాంతి గారి బాబి గారు , పెద్ద మాస్టర్ శేఖరం గారు , అనుపిండి రామూర్తి గారి కన్నబాబు గారు ,పాలగుమ్మి సూర్యనారాయణ గారు , ఫోటో సుందరం గారి బాబ్జి, చిన్న మాస్టర్ గారి రాంబాబు గారు, పేరన్న గారి నాగేశ్వరరావు, సత్యనారాయణ రాజు గారు , వెర్రిబాబు గారు, నాగన్న గారు, బడి లచ్చమ్మ గారి సుబ్బయ్య, సూరయ్య లు.

అబ్బీసు గారు ,అయ్యలసోమయాజుల రమణ గారు (సుందరం గారి అల్లుడు ), వడ్లమాని మణి గారు , అనుపిండి రామం గారి చిట్టి, శేషులు , నారాయణ మూర్తి గారి సుబ్బయ్య గారు ,విశ్వనాధ్ గారు & బాబ్జి గారు ,వరహాభట్ల శంబన్న శాస్త్రి గారు , పేరి మహాదేవ శాస్త్రి గారు , మూలా సూరి శాస్త్రి, గంటి నర్సు, శేషు గారి తో పాటు నూకల పేరప్ప గారు, రామం గారు, బుచ్చి మాస్టర్ గారు, నూకల సుబ్బారావు గారి శీనప్ప గారు , విస్సప్ప గారు, కన్నబాబు గారు, అబ్బాయిరాజు గారు, రామ భద్రుడు గారు, సుబ్బారావు మాస్టర్ గారు, అనుపిండి గణపతి గారులు, అగ్నిహోత్రుడు, రామం గారు, పేరి అన్నాజీ గారు, నూకల సూరిబాబు గారు (బుల్లివెంకన్న గారి పెద్ద అబ్బాయి) కూడా రథం పగ్గాలు పట్టుకుని నడిపించారు.

***********

రధ చక్రాలు తిరుగుతున్నట్టుగా , రోజులు, సంవత్సరాలు కూడా అంతే స్పీడ్ లో వెళ్తున్నాయి . పిల్లలంతా యువకులవుతున్నారు.

పెద్ద పెద్ద రధ చక్రాలు కొంచం చిన్నవయ్యాయి.ఐరన్ స్టీరింగ్ ని తీసేసారు. ఈ రధాన్ని బండారులంక గ్రామం లో చేసి , రధ యాత్ర కి సిద్ధం చేసారు. రధ చక్రాలు చిన్నవైనా పిల్లల్లో, యువకుల్లో మాత్రం ఉత్సాహం మరీ ఎక్కువైంది.

కోయిల వసంతం గురుంచి ఎదురు చూసినట్టు, కుర్రాళ్లందరూ వైశాఖ మాసం రధ యాత్ర గురుంచి ఎదురు చూపు. ఆ రోజు రానే వచ్చింది.

*********

రధాన్ని రెడీ చేసారు. గుళ్లో పూజలు అన్నీ ముగిసిన తరువాత పెద్ద పల్లకీ ని మోస్తూ మూడు ప్రదక్షిణాలు చేస్తున్నారు .కుమ్మరి వెంకన్న వీరంగం వాయిస్తున్నాడు.డోలూ ,సన్నాయిలు తో నాద స్వరం వాయిస్తున్నారు.

బయట అంటా కోలాహలం గా ఉంది . అర్చకులు బ్రహ్మెశ్వరరావు గారు వచ్చి, దేవతా మూర్తులని రధం లో పెట్టి, ఆకులో అన్నం రథం ముందర పెట్టి, హర హరా అని అన్నారు. అప్పటికే చేతిలో రథం పగ్గాలు పట్టుకుని ఒక్కసారి “హర హరా” అని అరిచాడు బుల్లి వెంకన్న గారి సూరి బాబు.

అతని తో పాటు అగ్నిహోత్రుడు గారి బాచి, పప్పు బాబీ, పప్పు శీనులు, అగ్గన్న గారి విస్సు, కర్రా వీరభద్రం,నూకల సుబ్రహ్మణ్యం (శర్మ గారి, తమ్ముడు శేషప్ప గారి తనయుడు), నూకల ప్రభాకర శర్మ గారు , సోమేశ్వరావు గారి సత్తిబాబు, సూరిబాబు, నాగబాబులు ,తంబూరావు గారు, నల్లయ్య శాస్త్రి గారు, అగ్నిహోత్రుడు గారి సురేష్, టెలిఫోన్ రాజు, నాయిన రాజు గారి బాబీ, పేరప్ప గారి రాంబాబు,రాజాలు.

వడ్లమాని నాని గారి శ్రీను, రవి లు, సలాది శంకరరావు గారు (సలాది చిన్నబ్బాయి గారి అబ్బాయి) ,శర్మ గారి పేరప్ప గారు ,విశ్వనాథ మాస్టారి హరే రాంబాబు, నత్త గుల్ల సుబ్బారావు గారి వసంత ,బాండ్ , మునసబు గారి సూరిబాబు, పేరి మురళి, మురళి అన్న గారు, రామరాజు గారి సూరి, సుబ్బారావు మాస్టర్ గారి సురేష్, శంకర్ లు, పెంటపాటి కృష్ణ, రమణలు, గురువు గారి (ఆదిరాజు లక్ష్మణ మూర్తి గారి) శీను , పేరన్న గారి కామేశ్వరావు ,సుబ్రహ్మణ్యం గారు, తోరం సూర్యనారాయణ , కోఠి గాయత్రి, పాలగుమ్మి కృష్ణ, రమణలు, అమ్మన్న గుండు,దత్తుబాబు కూడా గొంతు కలపడం తో రధం క్లబ్ మీదుగా విష్ణాలయం వద్ద ఆగింది.

అక్కడ పూజలు చేసిన తరువాత, మెల్లగా శీనప్పగారి ఇంటి నుంచి, రెండో వీధి పప్పు సూర్యనారాయన గారి ఇంటి పక్క నుంచి మూడో వీధి లో కి ప్రవేశించింది. అప్పటికే రధం ఎత్తు తగ్గడం వలన, మరియు కొంచం చిన్న చక్రాల తో రధం ఉండడం వలన సులువు గా మూడో వీధిలో కి రథం ప్రవేశించింది.మూల గున్నయ్య గారి బ్రహ్మానందం గారు, బాబీ గారు కూడా రధం వెనుకాల వెళ్తున్నారు. రధం మెల్లగా బుచ్చి మాస్టర్ గారింటి వద్ద ఆగింది.

బుల్లివెంకన్న గారి సూరిబాబు, మంచి నీళ్లు తెమ్మని బుచ్చి మాస్టర్ గారి బాబ్జి (బావ)కి చెప్పారు. వెంటనే బాబ్జి లోపలికెళ్ళి పెద్ద గుండిగ లో నీళ్లు పెట్టి, అందరూ తాగేసిన తరువాత , రధాన్ని వెనకనుంచి తోస్తూ ముందర బాలన్స్ చేసుకొనేటట్టు గా మునసబు గారి సూరి బాబు, పప్పు బాబీ లు ఉండి, రధాన్ని పేరి మహాదేవ శాస్త్రి గారింటి దాకా పోనిచ్చి, తిరిగి కట్లమ్మ గుడి మీదుగా రెండో వీధిలో కి ప్రవేశించింది.

రధోత్సవం లో భక్తి తో పాటు , సరదాలు, రథాన్ని కోరమాండల్ ఎక్ష్ప్రెస్స్ అంత ఫాస్ట్ గా లాగడాలు, రధం కింద రాళ్ళూ పెట్టి ఆపడాలు, యువకుల చిన్న చిన్న తగాదాలు, పెద్దల ఊరడింపులు, మేళ తాళాలు, బాజా భజంత్రీలు , వడపప్పు పానకాలు తో ఐదు రోజుల పెళ్లి అప్పుడే అయ్యిందా అన్నట్టుగా దేవుడి పెళ్లిని ఎప్పటిలాగానే బ్రహ్మాండం గా నడిపించారు అప్పటి కుర్రాళ్లు.

*************

దేవుడి పెళ్లి: 1982 నుంచి ప్రస్తుతం :

పెద్ద పల్లకీ మోయడానికి బరువు ఉండడం తో వెత్సా విశ్వనాథం గారు చిన్న పల్లకీ లని చేయించారు.

కాలం ముందరకి పరిగెడుతోంది. పిల్లలు అందరూ యువకులయ్యారు. కొంతమంది యువకులు చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగ, వ్యాపార రీత్యా, చుట్టూ పక్కల నగరాలకు వెళ్తున్న రోజులవి. అలాగే కొంతమంది యువకులు ఊరి ని విడిచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ పరిస్థితి లో దేవుడి కళ్యాణం ఎలా కొనసాగించాలి అని పెద్దలు అనుకుంటున్నారు. “నేను ఉన్నాను. ఇప్పటి నుంచి ఈ దైవ సేవలు చేయడానికి నేను ముందరుంటాను మీ అందరి సహకారం తో ” అని ఒక యువకుడు తన గొంతు విప్పాడు.

*********

“అమ్మా , మేము వేసవి సెలవులకి అమ్మమ్మ గారి ఊరింటికి వెళ్ళం . ఇక్కడే ఉంటాం. మన ఊరి దేవుడి పెళ్లి అయిన తరువాత వెళ్తాము” అని అందరి పిల్లలు, వాళ్ళ తల్లి తండ్రులకి గట్టిగా చెప్పుతున్న సమయం . దేవుడి పెళ్లి రావడం తో పిల్లలంతా ఉత్సాహం తో ఉరకలు వేస్తున్న రోజులు.

“ఎప్పడెప్పుడు పిలుపొస్తుందా ఆ యువకున్నుంచి” అని పిల్లలు ఎదురు చూపులు. పిలుపు ఇచ్చిన అతనితో పాటు, కొంతమంది యువకులు, పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి క్లబ్ లో తాటాకులతో కప్పిన రధాన్ని చూసి, మీద కప్పిన తాటాకులని తీసి ,రధాన్ని మెల్లగా బయటకి తోసి విష్ణాలయం పక్కన పెట్టారు. అప్పుడే విష్ణాలయం అర్చకులు రామకృష్ణ వచ్చి రధాన్ని వీక్షించి వెళ్ళాడు. కుర్రాళ్ళు రధాన్ని పూర్తిగా కడిగారు. అంతకముందున్న ఎండు మామిడాకులు ని తీసేసి, అప్పుడే కోసిన మామిడి తోరణాలతో అలంకరించారు. రిబ్బన్లని, రంగు కాగితాలని అంటించి రధాన్ని ఉత్సవానికి తయారు చేస్తున్నారు. చేస్తున్న పిల్లల్లో ఒక విధమైన ఆనందం, యువకుల్లో ఉత్సాహం.

*********

రధం చక్కగా ముస్తాబయ్యి, “నేను ఉత్సవానికి రెడీ” అన్నట్లు గుడి దగ్గెర ఉంది. “మేమూ కూడా రెడీనే” అన్నట్లు పగ్గం పట్టుకుని యువకులంతా ఉత్సాహం తో ఉరకలు. మొట్ట మొదటసారి రధం లో కూర్చున్న చిన్న పిల్లల్లో చెప్పుకోలేని సంతోషం .ఈ ఉరికే ఉత్సాహానికి, ఉబ్బితబ్బిబి అయ్యే సంతోషానికి ఆ యువకుడు ఉత్ప్రేరకం అవుతున్నాడు .

రధం పగ్గాలు పట్టిన యువత, పిల్లలు,ఆ యువకుడి ఆదేశం గురించి చూస్తున్నారు. ఆ యువకుడు ఒక్కసారి ” గోవిందా గోవిందా “అని అరవడం తో రధం పగ్గాలు పట్టుకున్న యువకులు రధం లాగడం మొదలెట్టారు. మొట్ట మొదట సారి రధం లో కూర్చున్న పిల్లలో ఉత్సాహం కట్టలు తెంచుకుని యువత తో వంతు పాడుతున్నారు.

రధం ముందర బల్ల మీద ఇటుపక్కా, అటుపక్కా రెండు కాగడాలు పట్టుకుని ఇద్దరు కుర్రాళ్ళు, ఆ కాగడాలలో నూనె పోయడానికి పక్కనే నూనె గిన్నె . రధం బల్ల మధ్య లో నించుని భక్తులకి దేవుడి ప్రసాదం అందిస్తూ సోమేశ్వరావు గారు (శివ కళ్యాణం )/రామకృష్ణ (కేశవ స్వామి కళ్యాణం). కాగడా పెట్టుకుంటానని పిల్లల్లో పోటీలు, ఏడుపులు. తరువాత పెద్దల సముదాయింపులు.

*****

చిన్న పిల్లలు కి అప్పుడప్పుడే తెలుస్తోంది. రధం అంటే ఏమిటి, రధం లో కూర్చుంటే యెంత బావుంటుంది అని. “అమ్మా అమ్మాదేవుడి పెళ్లి ఎప్పుడే”అని అడుగుతున్నాడు చిన్న పిల్లవాడు ఒక ఇంట్లో .అమ్మ దగ్గెర నుంచి సమాధానం లేదు.”ఎందు కంటే వీడు దేవుడి పెళ్లి అని చెప్తే రధం లో కూర్చో పెట్టమంటాడు” అని చెప్పలేదు ఆ తల్లి. ఆ చిన్న పిల్లవాడు తన తోటి స్నేహితుల దగ్గెర తెలుసుకుని, “అమ్మా అమ్మా, దేవుడి పెళ్లి ఈ రాత్రి నుంచి అంట”, నేను రధం ఎక్కుతా ఎక్కుతా, దేవుడి పెళ్లి చూస్తా” అని మారాం చేస్తున్నాడు. “రధం మన ఇంటికి వచ్చినప్పుడు దేవుడి కి దండం పెట్టుకుని చూద్దువు కానీ” అని సముదాయించింది తల్లి .

దూరం గా బాజా బజంత్రీలు విన్పిస్తున్నాయి. దేవుడు వస్తున్నాడని తెలిసింది. ఆ చిన్న పిల్లవాడి లో ఒక విధమైన ప్రకంపనలు వచ్చాయి.

మొదట పల్లకీ వచ్చి ఆగింది. కొంచం దూరం గా రధం, లాగుతూ యువకులు “అశ్శరభ శరభ” “అల్లెల్ల వీర ” నినాదాలతో, కేరింతలతో ఉన్నారు. అవన్నీ చూస్తూ , “నాన్నా నాన్నా! నేను రధం ఎక్కుతా ఎక్కుతా” అని గట్టి గా ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు .దూరం గా అది గమనిస్తున్న ఆ యువకుడు ఆ చిన్నవాణ్ణి నెమ్మదిగా రధం లో తీసికెళ్ళి కూర్చో పెట్టాడు. అలాగే మిగతా ఏడుస్తున్న ఆ చుట్టు పక్కల ఉన్న చిన్న పిల్లలని కూడా తీసికెళ్ళి రధం లో కూర్చో బెట్టాడు. ఆ ఏడుస్తున్న పిల్లలందరూ నెమ్మదిగా ఏడుపు ఆపేసి రధం వంక చూడకుండా దూరం గా వెళ్తూ “అశ్శరభ శరభ” అంటున్న ఆ యువకుడి వైపు చూస్తున్నారు యెనలేని ఆనందం తో.

రథం లో కూర్చున్న పిల్లలందరూ వచ్చి రాని మాటలతో అతని తో “అశ్శరభ శరభ” అన్నారు. రధం మెల్లగా వెళ్తోంది. ఆ చిన్న పిల్లల్లో రధం ఎక్కామని ఉత్సాహం తో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఆ యువకుడి కి తెలియదు ఆ రధం లో కూర్చున్న పిల్లందరూ, తరువాత అతని వెంటే నడుస్తారని.

ఆ యువకుల ఉత్సాహానికి , పిల్లల ఆనందానికి ఉత్ప్రేరకం అయిన ఆ యువకుడే వడ్లమాని లక్ష్మీ ప్రసాద్. అతని నాయకత్వం లో, పెద్దల సమక్షం లో, యువకులతో దేవుని కళ్యాణం అంగ రంగ వైభవం గా జరుగుతోంది.

“అతనితో పాటు మేము ఉన్నాం” అంటూ రామరాజు గారి వెంకన్న, తోటకూర రాంబాబు, మునసబు గారి రవి, కిరణ్ లు, పెంట పాటి సూరి, బుల్లి వెంకన్న గారి వెంకన్న బాబు, శర్మాజీ (బొబ్బన్న) లు, హరి బాబు, మద్రాస్ విస్సు , పేరి విస్సు, సరిపెల్ల బాబ్జి ,చిట్టమ్మ గారి పూజ్యం, శీనప్ప గారి అన్నాజీ, విస్సప్ప గారి సాయి, మండా శ్రీను , పేరిచర్ల సుబ్బరాజు మరియు శీనులు, వెర్రిబాబు గారి శీను, కర్రా రామకృష్ణ, పాలగుమ్మి రమణ, మోహన కృష్ణ లు, అనుపిండి కావుడి గారి రామకృష్ణ, మూల గున్నయ్య గారి బాబ్జి , శ్యాములు, పేరన్న గారి శ్రీనివాసు. విశ్వనాథ మాస్టారి గణేష్, అగ్గన్నగారి బాబ్జి, పేరి మాస్టారి శ్రీను, ఉషా దేవి గారి రాము, విజ్జు లు.

వీళ్ళందరూ ఒక్కసారి “అశ్శరభ శరభ” అంటే మిగతా కుర్రాళ్ళు “అల్లెల్ల వీర ” అని అనడం ,”యేసుకో యెంకమ్మా” అని కొందరంటే “దోసకాయ పచ్చడి ” అని మరికొందరు అరుస్తున్నారు . ఆ నినాదాలతో రధం లో కూర్చున్న పిల్లలు కూడా వంతు పాడుతున్నారు. రధం స్పీడ్ గా లాగ కుండా అక్కడున్న పెద్దలు వారిస్తున్నారు. పక్కనే ఉండి సలహాలు ఇస్తున్నారు.రధం వెనకాల నారాయణ మూర్తి గారి సూరి బాబు గారు నూకల సోమ శేఖర రావు గారు ( బెల్లం కొట్టు సూరిబాబు గారి  రెండో అబ్బాయి) , కేశాప్రగడ సత్యనారాయణ గారు, గేట్ లో నుంచి ప్రత్యేకం గా రధోత్సవం కి వచ్చిన వారిలో చెల్లు సుబ్బయ్య గారు, సముద్రారావు గారు లు కూడా మేమూ సైతం అంటూ రధం పగ్గాలు పట్టుకున్నారు.

************

రధం వెనకనుంచి తోసేటప్పుడు, బాలన్స్ కోసం పెంటపాటి కృష్ణ, అనుపిండి రవి లు ఓ సారి, సత్తికొండ గారి రాంబాబు, మునసబు గారి సూరి లేదా మద్రాస్ విస్సు ఒకసారి ఉంటూ ఎడమకి, కుడి కి తిరగడం లో సహాయం చేస్తున్నారు.

చివరి రోజు (ఐదవరోజు ) కి వచ్చేటప్పటికి , కుర్రాళ్లలో ఉత్సాహం నింగి కి అంటేది. పూర్వం నుంచి ఆచారం గా వస్తున్న ,బుక్కాలును ఒకళ్ళ మీద ఒకళ్ళు మెల్లగా జల్లుకునే వారు. అది మెల్లగా అభివృద్ధి అయ్యి, చివరి రోజు న హోలీ పండగ లాగ రంగులు రాసుకోవడం మొదలెట్టారు.

అందుకే ఆ చివరి రోజు గురుంచి యువకులతో పాటు, పిల్లలు కూడా ఎదురు చూసే వారు. బాణా సంచాలు కాల్చే వారు. పేలుపు జువ్వలు తెప్పించి, చివరి రోజు మధ్యాహ్నం రధోత్సవం ముందు, అలాగే రధోత్సవం అయిన తరువాత రధం లో ఉత్సవ విగ్రహాల ని తీసే ముందు పేలుపు జువ్వలు వేసి రధ యాత్ర ని ముగించే వారు.

***********

కాలం స్పీడ్ అందుకుంది. ఈ కుర్రాళ్లతో పాటు, కొత్త యువత కూడా మేము సైతం అంటూ వడ్లమాని ప్రసాద్ నాయకత్వం లో, అతని స్నేహితులతో ,పెద్దల సమక్షం లో రధం పగ్గాలు పట్టుకుంటున్నారు.

“మేము కూడా” అంటూ, విస్సప్ప గారి ఫణి , వెత్సా బుజ్జి, సురేష్ లు, రాంమూర్తి గారి శ్రీనివాస్, విశ్వనాథం మాస్టారి గారి శ్రీను, మునసబు గారి శాస్త్రి, బుచ్చి బాబులు ,రాంబాబు మాస్టారి నరేష్ , రమేష్ లు, తోటకూర చంటి, పేరిచర్ల రామ రాజు, వర్మా, కాశి రాజు గారి గోపి, పేరిచర్ల విస్సు, పానుగంటి రమేష్, రవిలు, గమిని హనుమాన్, గాదె రవి లు, నూకల విశ్వనాథం (అద్దంకి మన్నారు) ,కర్రా కామేషు ,కేశాప్రగడ నాగ రాము , పెంటపాటి గుర్నాథం, అనుపిండి కావుడి గారి శేషు కూడా రథం పగ్గాలు పట్టుకున్నారు.

వీళ్ళతో పాటు పెద్దలు కాశీ రాజు గారు, కాంబాబు గారు, గమిని నరసింహమూర్తి గారు (గాంధీ గారు), గాదె వెంకటేశ్వరావు గారు, గాదె శీను, నాగేశ్వరావు (గుమాస్తా గారు) గారు, సొసైటీ స్వామి గారు, మెడికల్ షాప్ షావుకారు గారు, గౌరీనాథ్ గారు,  కూడా వచ్చి రధ యాత్ర లో నడుస్తున్నారు.

దేవుడి పెళ్లిని, ఊరి పండగ గా తీసుకున్న రోజులవి. కుర్రాళ్లలో స్పీడ్ పెరిగింది. అందరూ రథం లాగుదామనే వాళ్లే . రధం వచ్చే రోజున పల్లకీ లు మోయమని వడ్లమాని ప్రసాద్ కి చెప్పేసారు. “మేమున్నాం మీరు రధం లాగండి” అని అంటూ పేరన్న గారి సుబ్రహ్మణ్యం, శ్రీనులు, అప్పుడప్పుడు విశ్వనాథ మాస్టర్ గారి గణేష్, సుబ్బారావు మాస్టర్ గారి శంకర్ , మూల గున్నయ్య గారి శ్యాము, అబ్బీసు గారు, కావుడి గారి రామ కృష్ణ , అగ్గన్న గారి బాబ్జి, బుచ్చి మాస్టర్ గారి బాబ్జి, ఉత్తమ మోతర్ సాయి (గుమస్తా గారి )లు ఊరంతా పల్లకీ మోస్తూ సహాయ పడుతూ ఉండేవారు.

“మొత్తానికి మాకు అవకాశం వచ్చింది, రధం లాగడానికి” అనే ఉత్సాహం తో, పరుగులు తీస్తూ ఆ కుర్రాళ్ల తో పాటు , నూకల జానేష్ , సత్తి , వెత్సా రాజా, పాలగుమ్మి రమేష్, సురేష్ లు, రాంబాబు మాస్టర్ గారి ప్రసాద్ (నేను) ,కాశీ రాజు గారి రవి , హోటల్ మాణిక్యం, అబ్బీసుగారి ఫణి , రాములు , సుందరం గారి శేఖర్ , ఆసు ,ఆభా, పేరిచర్ల మురళి, పృథ్వీ, స్వామి గారి నరేంద్ర, నాగు, వెలవెల పల్లి రాజేష్, రాంజీ , కిషోర్ లు కూడా రధం పగ్గాలు పట్టుకుని పరిగెత్తడం ప్రారంభించారు.

సమ్మర్ సెలవులకి ప్రత్యేకం గా దేవుడి పెళ్లి కి వచ్చే- అమ్మన్న గారి రామం గారి పవన్, ప్రశన్న, బాలాత్రిపుర సుందరి,  శ్రీవల్లిలు , బుచ్చి మాస్టర్ గారి మనవలు పప్పు వెంకటేష్, శ్రీనివాస్ లు, నారాయణమూర్తి గారి నూకల శ్రీరాము, విశ్వనాధ్, రామం గారి మనవడు రాము, పేరప్ప గారి మనవలు వేణు , శ్రీరామ్ లు, రాజ్యం గారి కిరణ్, శ్రీధర్ లు, అగ్నిహోత్రుడి గారి రాజా, ఆదిత్య లు, కావుడిగారి మనవలు -ప్రభాకర్, బాలసుబ్రహ్మణ్యం,మాణిక్యం ,సూరిబాబు లు, మహాదేవశాస్త్రి గారి ఉదయ్ ,సాయి , శీనప్పగారి ప్రశాంత్ , హరిణి లు , శర్మ గారి శ్రీనివాస్ (భయ్యా) , వాసు లు ,ఆదిత్య, భార్గవి లు, జానకమ్మ గారి శ్రీరామ్ , శ్రీకాంత్ , శరత్ , భార్గవ్ , ఫణి లు, రాణి వీరభద్రం గారి జ్యోతి, మెహర్ కూడా రధ యాత్ర అంటే ఆత్రం పడినవాళ్ళే.

***************

దేవుడి పెళ్లి చివరి రోజు వచ్చేస్తోంది అని కొంచం గాబరా. అలాగే ఆ రోజు వస్తే రంగులు పోసుకోవచ్చు అని, హడావిడి చెయ్యచ్చు అని, పేలుపు జువ్వలు పేల్చచు అని సంబర పడుతున్నారు ….

ఒకపక్క పురికోసలు కట్టలు కట్టలు గా ఉన్నాయి. న్యూస్ పేపర్స్ కూడా దొంతర దొంతరలు గా ఉన్నాయి. ఒక వ్యక్తి కూర్చుని, శ్రద్ధగా మందు కూరుతున్నాడు. కూరిన మందు ను అంతే శ్రద్ధ గా, జాగ్రత్త గా చుట్టి, ఒకొక్కటే పక్కన పెడుతున్నాడు. పరీక్ష కోసం పెరట్లో కెళ్ళి దాని చివర అంటించి వచ్చాడు. ఆ వత్తు కాలి , “ధడేల్ “మని పెద్ద శబ్దం వచ్చింది.

ఆ సౌండ్ కి ఏదో పెద్ద గా పేలిందని చుట్టుపక్కల అంతా వచ్చేసారు.ఆ కుర్రాడు అదే సక్సెస్ అని తలచి దేవుడి పెళ్లి చివరి రోజు కి బాంబ్ లు తయ్యార్ చేసాడు.ఆ బాంబులు బ్రహ్మాండం గా పేలి, దేవుడి పెళ్లి లో ఈ కుర్రాడి బాంబులు లేకుండా చివర రోజు అయ్యేది కాదు. ఆ బాంబులు “సత్తి బాంబులు ” అనే పేరు తో మోత మ్రోగాయి. అవి నూకల వీర వెంకట సత్యనారాయణ (సత్తి బాబు) చేసిన బాంబులు. గాల్లో పేలుపు జువ్వలు, నేల మీద సత్తి బాంబులు తో చివరి రోజు మోత మ్రోగిపోయేది.

*****************

చివరి రోజు దేవుడి పెళ్లి. మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది . “చివరిరోజు కళ్యాణం కదా! కొంచం దేగ్గెర గా వచ్చి చూస్తే బావుంటుంది” అని అనుకున్నాడేమో మండే సూర్యుడు, ఎండల్ని మండిస్తున్నాడు. ఉక్కపోత ఎంతున్నా ఉత్సాహం తగ్గట్లేదు ఎవరి లో. పిల్లలు, యువకులు,పెద్దలు గుడికి తరలి వెళ్తున్నారు. రధం ఉత్సాహం గా ఉత్సవానికి రెడీ అయ్యినట్టు గుడి దగ్గెర ఉంది . గుడి లోపల తాసాలు, కుమ్మరి బాజాలు, తో మోత మ్రోగి పోతోంది. గుళ్లో పల్లకీ తో మద్రాసువిస్సు , పేరన్న గారి సుబ్రహ్మణ్యం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు వేస్తున్నారు. పల్లకీ ముందర అర్చకుడు పార్వతీశం ఉన్నాడు.

ఉత్సవ విగ్రహాన్ని మెల్లగా రధం లో పెట్టారు సోమేశ్వరావు గారు. బయట చెరువు గట్టు మీద నుంచి కాశీ రాజు గారి రవి , రామరాజు, సత్తి, చంటి, నరేష్ లు పేలుపు జువ్వలేసారు. ఆ పేలుపు జువ్వకి అక్కడున్న కుర్రాళ్ళో ఊపు వచ్చింది. అప్పటికే రధం పగ్గాలు పట్టేసుకుని లాగడానికి యువకులు, పిల్లలు, పెద్దలు కూడా రెడీ గా ఉన్నారు. సత్తి చేసిన బాంబులుని అద్దంకి మన్నారు (విస్సు ) ఇషాక్ గారి మిల్లు దగ్గెర పెట్టి వత్తు వెలిగించి పరిగెత్తుకుని వస్తున్నాడు. ఆ బాంబు పేలుడికి ఒక్కసారి అంతా ఉలిక్కి పడి , వెంటనే “హర హరా” అంటూ రధం లాగడం మొదలెట్టారు.

అప్పుడే ఇంటి నుంచి సైకిల్ మీద సామాను పెట్టుకుని గేట్ లో కి వెళ్తూ, కోట మల్లేశ్వరావు గుడి దెగ్గర ఉన్న రధాన్ని చూస్తూ దండం పెట్టుకుంటున్నాడు.

***********************

రధం ఊరేగుతూ రెండో వీధి లో సిద్ధాంతి గారి ఇంటి వద్ద ఆగింది. అప్పటికే దేవుడి పెళ్లి అని పుట్టింటికి వచ్చిన ఊరి ఆడపడుచులు, ఊరి కోడళ్ళు అందరూ మూల వీధి పెరడు గుమ్మం నుంచి సిద్ధాంతి గారి ఇంటికి చేరారు.

దేవుడి పెళ్లి అయిన తరువాత ,తాత గారైన మాణిక్య శర్మ గారింట్లో పెళ్లి చూపులు ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ అమ్మాయి తల్లి తండ్రులు. అక్కడున్న ఊరి ఆడపడుచులంతా, ఆ అమ్మాయి కి అబ్బాయిని పెళ్ళిచూపులు కన్నా ముందరే చూపిద్దామని అనుకుని, సిద్ధాంతి గారి అరుగుమీదకి తీసికొచ్చారు .

“ఇదిగిదిగో ఈ అబ్బాయి ఈ అబ్బాయి” అని ఆ అమ్మాయి కి చూపిస్తూ ఉంటె, అప్పటికే రకరకాల రంగుల తో అతని ముఖం వెలిగి పోతోంది. ఆ అమ్మాయి కి అర్ధం కాలేదు, ఎవరో ఈ రంగుల బాబు అని. తరువాత రోజు పెళ్లి చూపుల్లో అసలు ముఖం చూసింది. ఆ రంగుల బాబే ఓరుగంటి రమేష్ , ఆ అమ్మాయి సువర్చల.

************

తాసాలు వాయించే వాళ్లు గుండ్రం గా నిలబడ్డారు. ఒకొక్కలే వాయిస్తూ ఆపడం , పక్క వాడు అందుకోవడం. ఇలాగ తిరుగుతూ తిరుగుతూ కొడుతున్నారు . వీళ్ళ వాయింపుడు “దేవి శ్రీ ప్రసాద్ ” కొట్టే డ్రమ్స్ బీట్ కి ఏమాత్రం తక్కువ కాకుండా, తాసాల మోత తో ఆ వీధి కంపిస్తోంది .ఆ డప్పులకు వడ్లమాని ప్రసాద్ స్టెప్పులు, కుర్రాళ్ళ ఈలలు, గోలలు. సైలెంట్ గా డాన్స్ ని చూస్తున్న కుర్రాళ్ల ని డాన్స్ చేయమని వలయం లో తోయడం, వాడు బిడియం తో బిక్కచచ్చి పోయి ,రెండు ఎగురులు యెగిరి, వచ్చేడం, తరువాత గర్వం గా అందరివైపు చూడటం…ఎన్నో సరదాలు.

తూము దెగ్గర అమ్మన్న గుండు నాగిని డాన్స్ లు, సుబ్బారావు మాస్టర్ గారి సురేష్ కొత్త స్టెప్పులు, ఎన్నో… ఎన్నెన్నో. రధం పేరప్ప గారిఇంటి ముందు నుంచి ఒకటో వీధి కెళ్తుంటే, ఇంట్లో నుంచి బకెట్ తోటి బయట ఉన్న యువకుల మీద నీళ్లు పోయడాలు , చిన్న చిన్న తగాదాలు. పెద్దలు ఊరడింపులు.

***********

ఇంకో కుర్రాడు కాలికి ఎర్ర రిబ్బను కట్టుకుని (అప్పుడే జానీ సినిమా రిలీజ్ అయ్యింది) ,నల్ల కళ్ళ అద్దాలేట్టుకుని, ఆ తాసాల వాయిస్తున్న వలయం లో పవర్ స్టార్ గెటప్ లో మెగాస్టార్ స్టెపులేస్తున్నాడు. (వాడిని అప్పట్నుంచి కొందరు “అనాతారం మెగాస్టార్” అని పిలవడం మొదలెట్టేసారు. వాడు ఇప్పుడు ఆ స్టెప్పులన్నీ పక్కన పెట్టి కథ లు రాయడం మొదలెట్టాడు.) అతని తో పాటు చాలా మంది కుర్రాళ్ళు కాలికి ఎర్ర రిబ్బను కట్టేసుకుని ఎగురుతున్నారు. వాళ్లలో చెల్లు సుబ్బయ్య గారి సత్తి బాబు, బ్యాంకు రంగమ్మ గారి మనవడు శీను కూడాను.

************

మిల్లులోంచి తెచ్చిన సంచి రంగులు. అక్కడే నించుని, రాయించుకుని వాళ్ళకి ముఖం మీద రంగులు రాయడం. “రంగులు రాయద్దు” అని పారిపోతున్న వాళ్ళని,తరుముతూ, తరుముతూ పట్టుకుని ముఖం తో పాటు, జుట్టంతా, రాసేసి వదిలేయడం. ఈ సరదాలు, సంతోషాల మధ్యన సరిపెల్ల వారింట్లో పానకాలు తాగేయడం. పెద్దలు “సూర్యాస్తమయం అవుతోంది రధాన్ని తొందరగా తీసికెళ్ళాలి” అంటే పిల్లల్లో , యువకుల్లో నిరుత్సాహం.” అయ్యో అప్పుడే ఐదు రోజులు అయ్యిపోయాయా ” అని దిగులు తో ఒకరి మొహాలు ఒకరు గుర్తు పట్టలేనంత గా మొహం నిండా రంగులతో,రధాన్ని గుడి వద్ద కి తీసికెళ్ళి రధ యాత్ర ని ముగించే వారు .

***********

తరువాత తరువాత, “నాతో కలిసి రధం లాగడానికి వచ్చేదెవరు”, ” నాతో వచ్చి పల్లకీ మోసేదెవరు”నాతో కలిసి బ్రహ్మాండం గా దేవుడి పెళ్లి ని జరిపించేదెవరు” అని వడ్లమాని ప్రసాద్ అని అంటుంటే “నేను” “నేను” “నేను” అంటూ, అమ్ము శ్రీకాంత్ ,కర్ణం గారి రవి, మురళి లు ,దత్తు గారి కామేష్ , నిరంజన్ లు , పాలగుమ్మి కృష్ణ గారి రవీంద్ర, సురేష్ రాజు, పెంటపాటి స్వామి, గౌరీనాథ్ గారి అనిల్ , తమ్ముడు ,వసంత గారి చైతన్య, మల్లిక్, నూకల కుమార్ ,అనుపిండి కాంబాబు ,మధుబాబు, రాజా లు , ఇలా ఎందరో ఎందరో …అతడితో చెయ్యి కలుపుతున్నారు.

2017 సంవత్సరం లో సత్తికొండ గారు రాంబాబు , రథాన్ని మరమత్తులు చేయించి, అంతే ఉత్సాహం తో యువత బ్రహ్మాండం గా దేవుడి పెళ్లి వడ్లమాని ప్రసాద్ నాయకత్వం లో జరుగుతూనే ఉంది, జరుగుతూ ఉంటుంది….

ఇప్పటి తరం పిల్లలు కూడా మేము రెడీ అని ముందరకి వస్తున్నారు , వారి లో గోపి సన్స్ , చంటి సన్ ,హరి సన్ , విస్సప్ప గారి విశ్వనాథ్ (ఫణి సన్) , రాంబాబు మాస్టారి శ్రీరామ్, హర్ష వర్ధన్లు (నరేష్ సన్స్ ) లు కూడా. ..వస్తూ రధం పగ్గాలు పట్టుకుంటున్నారు.

***************

మా ఊరి ఆడపడుచులు గురించి చెప్పకుండా , ఈ కథ ని ముగించను.

మా ఊరి ఆడపడుచులు, సంక్రాంతి పండక్కి పుట్టింటి కి వచ్చి వాళ్ళ అమ్మా ,నాన్నలను చూసొచ్చారు .”ఇంకో రెండు నెలల్లో మళ్ళీ అమ్మా నాన్నలని  చూసేసి, ఎలాగా అప్పుడు వచ్చే దేవుడి పెళ్లిని కూడా కళ్ళారా చూసి, వస్తామని ” వాళ్ళ భర్త లను మెల్లగా అడుగుతున్నారు. “పుట్టింటికి మొన్నే (సంక్రాంతి) కదా వెళ్ళావు, మళ్ళీ దేవుడి పెళ్లి కి వెళ్లాలా ” అని మా ఊరి అల్లుళ్ళు ఎప్పుడుఅనలేదు మా ఊరి ఆడపడుచులతో .”కుదిరితే మేము వస్తాం , లేదంటే మీరు దేవుడి పెళ్లి కి వెళ్ళండి” అని పైకి అన్నా ,దేవుడి పెళ్లి చివరి రోజు వచ్చే సమయానికి అనాతరం అల్లుళ్ళు కూడా రధ యాత్ర లో “మేము సైతం” అంటూ రధం పగ్గాలు పట్టుకుంటూ కనపడిన వాళ్ళే.

పిల్లా, పాపలతో, కూతురు, అల్లుళ్లతో, కొడుకు, కోడళ్లతో, మనవలతో ,మనవరాళ్ళతో వచ్చి ఈ దేవుడి పెళ్లి పండక్కి అప్పటికీ ,ఇప్పటికీ హాజరవుతున్నారు .

వాళ్లలో పెంట పాటి వారి ఆడపడుచులు, గమిని బేబీ, దేవి లు, శీనప్పగారి లక్ష్మి, పప్పూ ప్రభావతి , పేరి మహాదేవ శాస్త్రి గారి అరుణ, కమల, గిరిజలు, శంబన్న శాస్త్రి గారి వర్ధని, పద్మలు, అనుపిండి కావుడి గారింట్లో ఆడపడుచులు, విస్సప్ప గారి పద్మ , సుగుణలు, కన్నబాబు గారి ఉషా ,
మీనా , ఉమా జ్యోతి లు, బుల్లయ్య గారి అరుణ , స్వర్ణలు , శర్మ గారి ఉమ, సబిత లు ,బుచ్చి మాస్టర్ గారి మణి , సావిత్రి , అరుణ , శ్యాము లు, అగ్ని హోత్రుడు గారి ఉష ,సుందరిలు, సిద్ధాంతి గారి కామేశ్వరి , శివ, శారద , అరుణ లు, సూరిబాబు గారి సుందరి , పేరప్ప గారి మధు ,నూకల బుల్లివెంకన్న గారి రామం గారి పద్మ .

అమ్మన్న గారి ఇంటి ఆడపడుచులు, సోమేశ్వరావు గారి పద్మ, రామం గారి సుధ ,దేవి  ,నాగేశ్వరావు (గుమాస్తా) గారి కాత్యాయిని, కాంబాబు గారి శారదా , శ్యాములు ,నూకల శైలజ, లక్ష్మి నరేష్, శైలజలు , మద్రాస్ విస్సు అలేఖ్య, రమలు, సత్యవతి గారి పిల్లలు సన్నీ,సీత లు. అమ్ము లక్ష్మి (చెల్లాయి) గారు, అన్నపూర్ణ గారు, సత్యవతి గారి మనవరాళ్ళు సుందరి, లలిత, గాయత్రి, గీత లు. బాబీ గారి లలిత, అరుణ , కుట్టీ లు , నాని గారి భద్రు, కాశీ రాజు గారి పద్మ , సరిపెల్ల పద్మ, రాజేశ్వరి , ఆత్కురి శైలజ , శివాలయం సోమేశ్వరావు గారి వెంకట లక్ష్మి, లలిత, అమ్ము సుజాత ,అనుపిండి రమ ,శరభరాజు గారి ఇంటి ఆడపడుచులు , నూకల సూరి బాబు (బెల్లం కొట్టు సూరిబాబు గారు)  గారి ఇంటి ఆడపడుచులు , ఫోటో సుందరం గారి ఇంటి ఆడపడుచులు, పేరిచర్ల వారి ఆడపడుచులు.

అలాగే ఊరి కోడళ్ళు కూడా అంతే అభిమానం తో దేవుని కల్యాణానికి వస్తుంటారు. అలాగే ఇప్పటి తరం వాళ్ళు మూల గున్నయ్య గారి మానస, కావుడి గారి కామేశ్వరి, గాయత్రీ, మరువాడ సంతోషి, కీర్తి లు, నాని గారి అమ్ములు, సత్తికొండ గారి శ్రీవల్లి, చెల్లి లు అలాగే మిగతా ఆడపిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉత్సవం లో మేము సైతం అని అంటున్నారు.

******************

దేవుని కళ్యాణం ఏ రోజు ఏమి జరుగుతుంది

పూర్వం రోజుల్లో రథయాత్ర పూర్తి అయ్యేటప్పటికి అర్ధరాత్రి అయ్యేది. ఆ తరువాత కళ్యాణం మొదలెట్టేవారు. ఇప్పుడు రధ యాత్ర ముందరగానే పూర్తి చేసి , కల్యాణ పూజ ని రాత్రి 10 గంటలకి ప్రారంభిస్తున్నారు. దీనివలన కుటుంబ సమేతం గా కల్యాణాన్ని వీక్షిస్తూన్నారు.

మొదట రోజు అంకురార్పణ , ఎదురుకోలు ఉత్సవం . రధోత్సవం అయిన తరువాత, రథాన్ని , దేవతా వాహనాల్ని కొంచం ముందర ఆపి , పల్లకీ లో త్రిశూలం, చక్రం తీసుకు వచ్చి , బుక్కాలు చల్లుకుని దేవుని కళ్యాణానికి తీసికెళ్తారు. తిరు కళ్యాణం అనంతరం ప్రసాదం, పానకాలు భక్తులకి ఇస్తారు.

రెండవరోజు వైశాఖ పూజ. మధ్యాహ్నం నూకల మాణిక్య శర్మ గారింట్లో పానకాలు, సాయంత్రం నంది , గరుడ వాహనాలు ఊరేగింపు . ఆ తరువాత అనుపిండి సత్యవతి గారింట్లో పానకాలు .

మూడో రోజు: నరసింహ జయంతి , మధ్యాహ్నం నూకల సుబ్బారావు గారింట్లో పానకాలు, రాత్రి రధ యాత్ర, నంది వాహనం ఊరేగింపు. తరువాత నారాయణ మూర్తి గారింట్లో పానకాలు .

నాలుగో రోజు : ఉదయం బలిహారం. మధ్యాహ్నం మునసబు గారింట్లో వైశాఖ పూజ. సాయంత్రం నంది , గరుడ వాహనాలు ఊరేగింపు . ఆ తరువాత సత్తికొండ రాజు గారింట్లో పానకాలు .

ఐదవ రోజు : ఉదయం చక్ర స్నానం. మధ్యాహ్నం నుంచి భారీ నుంచి అతి భారీ తో బాణా సంచా కాల్చడాలు , బాజా భజంత్రీల తో రధోత్సవం, నాగవల్లి , ఆ తరువాత సరిపెల్ల వారింట్లో పానకాలు. అక్కడనుంచి రథం , గరుడ వాహనం గుడి కి చేరుతుంది . మరుసటి రోజు గుళ్లో పుష్పోత్సవం.

కొన్ని సంఘటనలు :

  • పూర్వం, నంది వాహనం ఒకటో వీధి చివరి కి వెళ్ళేటప్పటికి, నంది వాహనం మీద నుంచి శివుడు విగ్రహం పడిపోయింది. అప్పుడు రంగాచార్యులు గారు, బ్రమ్మేశ్వరావు గారిని గుడికి వెళ్లి తలుపులు తీసి చూడమన్నారుట. అప్పుడు గుడిలోని శివుడు కూడా వాహనంపై నుండి విగ్రహం ఏ వైపుకు పడిందో గుడిలో ని విగ్రహం కూడా అదేవైపుకు వొరిగిపోయింది.తక్షణమే ఊరేగింపు ఆపేసి 18 రోజులు సంప్రోక్షం చేసారు.
  • శివుడి గుడి దగ్గెర నుంచి రధం వెళ్తోంది . ఒక్కసారి , రధం మీద నున్న శిఖరం కింద నుంచుని ఉన్న సరిపెల్ల బాబ్జి గారి కాళ్ళ మీద పడి, కాలికి గాయం అయ్యింది.
  • రధం కింద పిల్లలు పడుతున్నారని తెలిసి ,వాళ్ళని కాపాడే యత్నం లో పాలగుమ్మి సూర్యనారాయణ గారికి , నల్లయ్య శాస్త్రి గారికి, పెంటపాటి కృష్ణ కి కూడా గాయాలయ్యాయి.

అనాతవరం లో ఎప్పుడో 200 సంవత్సరాల మునుపే మొదలయ్యిన దేవుని కళ్యాణం , ఇప్పటికీ అంత వైభవం గా జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉంటుంది.

*****************

గొప్ప చరిత్ర కలిగిన ఈ ఊరులో ఎందరో మహానుభావులు .వాళ్లలో మా అమ్మా, నాన్నలు. అమ్మ (వర్ధని ), నాన్న ( శ్రీరామమూర్తి ఓరుగంటి-national best teacher award recipient ) లకి పాదాభి వందనములు చేస్తూ …..

*****************

written by

ప్రసాద్ ఓరుగంటి

*********************

special thanks to my wife Usha for reviewing the content and my brother Ramesh for correcting the flow and Naresh for giving go or no-go signal for publishing the story.

*************************************************************************************

రథ యాత్ర-1 (అనాతవరం దేవుడి పెళ్లి కథ)

పుట్టి , పెరిగిన ఊరంటే ఇష్టం లేని వారుండరు. ఆ ఇష్టాన్ని, ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని , అప్పటి జరిగిన విషయాలని ఒక కథ రూపం లో మలిచి పుట్టి పెరిగిన ఊరు ని తలచుకుంటూ, మీ ముందు ఒక చారిత్రాత్మక కథ ” రథ యాత్ర ” (అనాతవరం దేవుడి పెళ్లి కథ) .

*******************

పైరగాలికి ఊగుతూ, పలకరించే పచ్చని పొలాలు ఒక పక్క , అంత ఎత్తు నుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించే కొబ్బరి చెట్లు ఇంకో పక్క. వీటీలి మధ్య నున్న చిన్న రోడ్డు మీద ఝాట్కా బండి టక టకా మని గుఱ్ఱాల గిట్టల శబ్దం తో పరిగెడుతోంది. ఝాట్కా బండి లో కూర్చున్న పెద్దమనిషి కి కొంచం దూరం లో తామరాకులతో, కలువపువ్వులతో నున్న ఒక పెద్ద చెఱువు కనపడింది .దాని పక్కనే ఆనుకున్న శివాలయాన్ని దూరం గా చూస్తూ, కొండంత యెత్తునున్న రధాన్ని చూస్తూ మైమరచిపోయాడు. ఆ వెళ్తున్న ఝాట్కా బండి లో ఆ పెద్దమనిషి వెనక వెనక తిరుగుతూ గుడి వైపు దండం పెట్టుకుని ఉంటుంటే , అతని అనుచరుల్లో ఒక అతను గొప్ప చరిత్ర కలిగిన ఆ ఊరి గురుంచి, ఆ ఊరిలో జరిగే దేవుడి పెళ్లి రధ యాత్ర గురుంచి పూస గుచ్చినట్లు చెప్తున్నాడు…..

సుమారు 300 సంవత్సరాల క్రిందట అనాతవరం చరిత్ర :

అనాతవరం. ఈ ఊరు ఒకప్పుడు అన్నార్తులని (కూడు,గూడు,బట్ట లేని వాళ్ళు ) తల్లి లా ఆదరించిన ఊరు . కాబట్టి ఈ ఊరి ని “అన్నార్తుల వరం” గా పిలుచుకునే వారు. కాల క్రమేణా ఈ ఊరు అనాతవరం గా ప్రసిద్ధి కెక్కింది.

బ్రిటిష్ వారి కాలం లో విజయనగర గజపతి రాజుల పరిధి లో ఈ అనాతవరం గ్రామం ఉండేది. వర్షాధార పంట లతో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉండేవారు.

కొంతకాలం తరువాత , ఈ “అన్నార్తుల వరానికి” ప్రకృతి పరీక్షించి శపించినట్టుగా కరువు తాండవం చేసింది. వర్షాలు పడలేదు . ఉన్న పంట పొలాలు నీరు లేక ఎండి పోయాయి. చుట్టుపక్కల చెరువులు లేవు. పంటలు పండక, తిండి లేక ప్రజలతోపాటు, పశువులు, పక్షులు కూడా ఈ కరువు వలలో చిక్కుకుని అల్లాడారు.

*****

గజపతి రాజుల అధికారుల నుంచి శిస్తు కట్టమని ఆదేశం వచ్చింది అనాతవరం గ్రామ ప్రజలకి. అప్పటికే గ్రామ ప్రజలు కరువు కి కట కట లాడుతుండగానే , పన్ను కట్టట్లేదని పన్ను వసూల్ చేయమని మరో పరీక్ష పెట్టారు, ఈ “అన్నార్తుల వరానికి”. ఒక పక్క కరువు తోనూ , ఇంకో పక్క శిస్తు కట్టాలని వచ్చిన ఆదేశాలతో తో ప్రజలు బెంబేలెత్తి పోయారు ఏమి చేయాలో తెలియక .

శిస్తులు వసూలు అవట్లేదని తెలుసుకుని ఇక లాభం లేదనుకుని ఆ గ్రామ లో నివసిస్తున్న మాంఛి దృఢ కాయుఁడైన “అనుపిండి మహా పాత్రుడు” అనే యువకుడి ని దివాన్ గా నియమించి, శిస్తులు ముక్కు పిండి వసూల్ చేసే లాగ అతనికి అధికారం ఇచ్చారు ఆ గజపతి రాజుల ప్రభుత్వ అధికారులు.

“అనుపిండి మహపాత్రుణ్ణి” నిజం గా ఆ దేవుడే మనిషి రూపం లో పంపించినట్టుగా, అతడు వసూల్ చేయవలసిన శిస్తు ను పక్కన పెట్టి, ఊరు కి తూర్పు వైపున పెద్ద చెరువుని తవ్వించాడు . ఈ చెరువు తవ్వించడం వలన చుట్టూ పక్కల ఉండే వ్యవసాయ భూమిలకి పుష్కలమైన నీరు దొరికింది. వ్యవసాయ భూమిలకి నీరు అందించే విషయం లో ఈ మహపాత్రుడు గంగను ఆకాశం నుంచి భూమి కి తెచ్చిన భగీరథుడు అంతటివాడు అయ్యాడు. ఆ చెరువు ని ఆ అపర భగీరధుడి పేరుతో “మహిపాత్రుని చెరువు” అని , తరువాత “మహీపాల చెరువు” అని , ఇంకా తరువాత “మా పాల చెరువు” తో ఆ గ్రామం అనాతవరం ప్రక్కనే ఉంటూ మహిపాత్రుని పేరు తో గర్వం గా ఇప్పటికీ పిలవబడుతోంది.

అంతే కాకుండా ఆ మహా పాత్రుడు ఊరి కి పడమర దిక్కున కూడా ఇంకో చెరువు ని తవ్వించాడు. ఆ చెరువు తవ్విస్తుండగా అతడికి శివ లింగం కనిపించింది. అతను ఆనందా ఆశ్చర్యాలతో ఉండగా..

********

అనాతవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరం లో “ముని కూడలి” (ఇప్పటి ముని పల్లి) అనే గ్రామం లో మునులు ఉంటూ ,తపస్సు చేసుకునే వారు. ఆ మునుల్లో జన్ను మహర్షి కి ఈ శివ లింగం గురించి తెలియడం తో హుటా హుటా న కాలినడకన బయలు దేరి అనాతవరం గ్రామానికి చేరుకున్నారు జన్ను మహర్షి . వేద మంత్రాలతో, ముని పుంగవలతో , ఆ ఊరి పడమర తవ్విన చెరువు పక్కన ఆయన శివ లింగం స్థాపించి, పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి గుడి ని ప్రతిస్థాపించారు. అదే ఇప్పుడు పెద్ద చెరువు పక్కన కనిపించే శివాలయం.

ఆ తరువాత కొంత కాలానికి శ్రీదేవి , భూదేవి సమేత కేశవ స్వామి గుడిని (విష్ణాలయం) ని కూడా ప్రతిస్థాపించారు.

మొదట్లో శివాలయం ప్రధానార్చకులు గా శ్రీ వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారు, విష్ణాలయం ప్రధానార్చకులు గా శ్రీ అంగర శింగరా చార్యులు సేవలు చేసారు.

************************

కొంత కాలానికి అనాతవరం గ్రామం పిఠాపురం మహారాజు స్వాధీనం లో కి వచ్చింది. మరికొంత కాలానికి పిఠాపురం సామ్రాజ్యం లో నున్న కొన్ని గ్రామాలని అమ్మివేయడం తో భీమన పల్లి జమీందార్ శిరంగు సత్తిరాజు గారు, అనాతవరం గ్రామం ని కొనుగోలు చేసారు .ఆ తరువాత శిస్తులు వసూలు చేసే అధికారం ఆయనకి వచ్చింది.

భారత దేశానికీ స్వతంత్రం వచ్చిన తరువాత జమిందారీ వ్యవస్థ రద్దు అయ్యి , అనాతవరం భారత దేశ ప్రభుత్వం లో విలీనం అయ్యింది.

**********************

ఆ ఝాట్కా బండి లో పెద్ద మనిషి, అనాతవర చరిత్రని ఆతృతగా గా వింటూ, దేవుడి పెళ్లి చరిత్ర ని కూడా చెప్పమనడం తో అతని అనుచరుడు , సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుడి పెళ్లి గురించి చెప్తూ :

దేవుడి పెళ్లి : సుమారు 1935 నుంచి 1954 మధ్యన (ఊరికి ఇంకా కరెంట్ రాని సమయం ):

ఇంకా ఎడిసన్ కనిపెట్టిన బలుబు ఊళ్ళో వెలగట్లేదు. పక్షులు అప్పటికింకా చెట్లు మీద, ఇళ్ల కప్పుల మీదే వాలుతున్నాయి. గ్రామ ప్రజలు రాత్రిళ్ళు దీపం బుడ్డిలతో, హరికేను లాంతరులతో జీవనం సాగిస్తున్నారు. 

సందె పడుతోంది. పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. దూరం గా ఆవుదూడ పాలు తాగడం కోసం “అంబా ” అని అరుస్తోంది .ఇళ్లలో ఆడవాళ్లు మసిబారిన దీపం బుడ్డి లని, హరికేను లాంతర్లను తుడుచుకుంటూ వత్తులేస్త్తున్నారు . అప్పుడే పొలం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చిన మగవాళ్లు పెరట్లో కాళ్ళు, చేతులు కడుక్కుని సేద తీరుతున్నారు. అలాగే పొలం నుంచి సైకిల్ మీద వచ్చిన వాళ్ళు, సైకిల్ ని ఒక చేత్తో మోస్తూ, ఇంటిలో నున్న వీధి గది లో పెట్టి, స్టాండ్ వేసి, స్నానం చేయడానికి పెరట్లో నుయ్యి దగ్గెర కి వెళ్తున్నారు.వీధుల బయట చిమ్మ చీకటి గా ఉంది. దీపం బుడ్డిలని వెలిగించి, ఆకులో అన్నం పెట్టి వడ్డిస్తూన్నారు ఆడవాళ్లు.

********

వేసవి కాలం,వైశాఖ మాసం .అక్కడున్న వారిలో భక్తి ఉప్పొంగుతోంది. వీధులన్నీ “హర హర మహా దేవా! శంభో శంఖరా ” నినాదాలతో మార్మోగుతున్నాయి. ఒక పెద్ద రథం ఠీవీ గా వీధుల వెంట నడుస్తోంది. రథం లాగుతూ కొంతమంది, రథం లో దేవతా మూర్తి లని చూస్తూ కొంతమంది మురిసిపోతున్నారు. రథం దెగ్గర ఉన్న పెద్ద వాళ్ళు ఒక్కసారి “అశ్శరభ శరభ “అంటూ ఉంటే , అక్కడున్న యువత కూడా వాళ్లతో గొంతు కలిపి ‘అశ్శరభ శరభ’ అంటూ ఉండగా, వీధులన్నీ భక్తి తో పులకరిస్తున్నాయి. పాలు తాగుతున్న లేగ దూడ కి ,తల్లి ఆవు “తాగడం ఆపి,ఒక్కసారి ఆ రధాన్ని చూడు” అని చెప్పినట్టు గా ఆ ఆవులు రథం వంక మెడ ఎత్తి మరీ మరీ చూస్తున్నాయి….

*******

“అమ్మా అమ్మా”ఈ రోజు దేవుడి పెళ్లి టకదా ,కొండంత ఎత్తు ఉన్న పెద్ద రథం మన వీధి కి వస్తుంది ట , నేను రథం ఎక్కుతా, ఎక్కుతా” అని ఏడుస్తూ అమ్మని త్వరగా అన్నం పెట్టమని తొందర చేస్తున్నాడు ఒక చిన్న కుర్రవాడు. అప్పటికే అతడి స్నేహితులు తయారయ్యి, రథం ఎప్పుడు ఆ వీధి లో కి వస్తుందా అని వెయ్యి కళ్ళ తో చూస్తున్నారు. మేళ తాళా లతో ఒక పెద్ద రథం ఠీవి గా నడిచి వస్తోంది.

సుమారు నలభై అడుగుల ఎత్తు ,ఆరడుగుల తో పెద్ద పెద్ద చక్రాలుటర్నింగ్ లో ఎడమ వైపు కు గాని , కుడి వైపు కు గాని సులువు గా తిరగడానికి దీర్ఘ చతురస్రాకారం లో ఉండే ఇనప డ్రైవింగ్ స్టీరింగ్, రధాన్ని లాగడానికి బలమైన పగ్గాలతో పూరీ జగన్నాధుని రధం ఈ అనాతవరం గ్రామం లో తిరుగుతోందా అన్నట్లు భ్రమింప చేసే బ్రహ్మాండమైన పెద్ద రధం ఠీవి గా వీధుల వెంట నడుస్తోంది.

*******

పౌర్ణమి దెగ్గర పడే రోజులు కావడం వలన, చంద్ర కాంతి తో వీధులన్నీ, స్పష్టం గానే కనిపిస్తున్నాయి. రధం లో నిలబెట్టిన పెద్ద పెద్ద కాగడాలతో, ప్రతీ ఇంటిలో నుంచి వచ్చే ఆ దీపం బుడ్డి వెలుగువలనో, హరికేను లాంతరువలనో లేదా కొంత వెన్నెల వలనో, రధం లో దేవుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు.

అప్పటికే పిల్లలతో కిక్కిరిసిపోయిన రధం లో “మా పిల్లాడు కి కూడా కొంచెం చోటు ఇవ్వండని” అడిగాడు ఒక తండ్రి . నలభై అడుగుల రధాన్ని కింద నుంచి చూస్తూ “నాకు రధం లో కూర్చోవడానికి చోటు దొరికింది” అని ఆ పిల్లాడి లో ఆనందం, ఆ రధం లో దేవత మూర్తిలని చూస్తూ ఆ తల్లి తండ్రులు, హరి హర నామ స్మరణలు , “అశ్శరభ శరభ ” లు తో వీధులన్నీ మార్మ్రోగిపోతున్నాయి.

రధం ముందర బుట్ట బొమ్మలు, ఇతర దేవతా వాహనాలు కదుల్తున్నాయి. రధం శివాలయం దగ్గెర మొదలయ్యి, విష్ణాలయం మీదుగా,ముత్యాలమ్మ తల్లి గుడి ని దాటుకుంటూ, కుమ్మరి వీధులకి కమ్మని కనువిందు చేసి, పెంటపాటి సుబ్బారావు గారి ఇంటి నుంచి పప్పు సూర్యనారాయణ గారి ఇంటి మీదుగా , కట్లమ్మ గుడి వద్ద రధాన్ని నిలిపారు . పల్లకీ మరియు దేవతా వాహనాలు మాత్రం మూడో వీధిలో కి వెళ్తున్నాయి .పేరి విస్సయ్య గారి ఇంటి మీదుగా వరాహభట్ల శంబన్న శాస్త్రి గారి ఇంటి పక్క నుంచి వెళ్తూ మూల గున్నయ్య గారిల్లు , అనుపిండి కృష్ణమూర్తి (కామేశ్వరావు గారి తండ్రి) గారి ఇళ్లను దాటుకుంటూ నూకల సుబ్బారావు గారి ఇంటి పక్క నుంచి, నూకల మాణిక్య శర్మగారిని , నూకల వెంకట్రావు గారు, గంటి ప్రకాశం మరియి బుచ్చి మాస్టర్ గారి ఇంటి వద్ద దేవతా వాహనాలు ఆగాయి.

అప్పుడే నూకల మాణిక్య శర్మ గారు (అప్పటి యువకుడు ) ఇంట్లో కెళ్ళి తన తల్లి అబ్బాయమ్మ ని అడిగి , మంచి నీళ్లు తీసుకొచ్చి అరుగు మీద పెట్టిన వెంటనే, అతని తమ్ముళ్లు శేషప్ప గారు, బుల్లయ్య గారు, దేవతావాహనాలు మోస్తున్న కుర్రాళ్ల అందరికీ ఇస్తున్నారు . అందరూ మంచి నీళ్లు తాగేసిన తరువాత పల్లకీ , వాహనాలతో తిరిగి పేరి విస్సయ్య గారి ఇంటి పక్కనుంచి రెండో వీధిలోకి బయలుదేరాయి.

రధం లాగే యువత అంతా కలిసి ఒక్కసారి “అశ్శరభ శరభ “అంటూ కట్లమ్మ గుడి దగ్గెర నిలిపిన రధాన్ని ఓరుగంటి చిన్నమాస్టర్ (అప్పారావు) గారి ఇంటి దగ్గెర ఆపారు .

*******

ఇంటింటి వద్ద వాయించే మేళ తాళాలతో , అప్పటి యువకుల రధ నినాదాలతో, రెండో వీధి మార్మ్రోగిపోతోంది. అక్కడనుంచి నూకల అగ్నిహోత్రుడు గారు ఇంటి పక్క నుంచి, నూకల సిద్ధాంతి గారి ఇంటిదాకా రధం మెల్లగా కదిలింది. సిద్ధాంతి గారి తమ్ముడు నూకల సూరి బాబు గారికి, “మంచి నీళ్లు తెచ్చి అరుగు మీద పెట్టు” అని రధం లాగుతున్న అనుపిండి రామూర్తి గారు, సూరిబాబు గారికి చెప్పారు. వెంటనే ఆయన వెళ్లి గుండుగ లో నీళ్లు పోసి అరుగు మీద పెట్టారు. యువకులు నీళ్లు తాగేసి రధాన్ని మెల్లగా అమ్మన్న గారి రామం గారిల్లు , అక్కడ నుంచి నూకల బుల్లి వెంకన్న గారి ఇంటి వద్ద ఆపారు. “దూరం గా చూస్తున్న నూకల బుల్లి వెంకన్న గారు రధం దగ్గెరకొచ్చి “ఒరేయి పిల్లలూ , మంచి నీళ్లు గుండిగలో ఉన్నాయి ,అక్కడ తాగనివాళ్ళు, రధం దిగి తాగండి” అంటూ గట్టి గా అరిచారు. ఒక్క ఉదుటున రధం లో కూర్చున్న పిల్లలు, వాళ్లతో వచ్చిన తండ్రులు, రధం లాగుతున్న యువకులు కూడా అక్కడ గుండిగ లో పెట్టిన నీళ్లను తాగారు.

తరువాత నూకల నారాయణ మూర్తి గారి ఇంటి పక్క నుంచి మూల వీధి సందు దగ్గెర రధం ఆగింది. కోట గేట్లో నుంచి అనుపిండి రామం గారు, వడ్లమాని సోమేశ్వరరావు గారు వచ్చి రథం పగ్గం పట్టుకున్నారు. అక్కడ నుంచి మెల్లగా పెద్ద రధం, ఆదిరాజు లక్ష్మణ మూర్తి గారు ఇంటి నుంచి తూము దగ్గెరకొచ్చి ఆగింది. అప్పటికే తోటకూర రామరాజు గారు, మునసబు బుచ్చి బాబు గారు వచ్చి రధాన్ని రెండో వీధి సందు నుంచి అనుపిండి రామూర్తి గారి సందులోకి పోనిచ్చారు. మాంచి ధృడ కాయుడైన అమ్మన్న గారి రామం గారి ని, పెద్దాయన తోటకూర నరసింహ రాజు గారిని రధం ముందర ఉంచి వాళ్లిద్దరూ చక్కగా బాలన్స్ చేసుకుంటూ ,ఐరన్ స్టీరింగ్ ద్వారా కుడి వైపుకి మెల్లగా తిప్పుతూ, నూకల విశ్వనాథం మాస్టర్ గారిల్లు, నూకల పప్పు వెంకన్న గారింటికి (సుబ్బారావు మాస్టర్ గారి తండ్రి) , అనుపిండి రామూర్తి గారి ఇంటి మధ్య రోడ్డు మీద రధం ఆపారు .ఎప్పుడైనా రథం ముందరకి కదలనప్పుడు, అనుపిండి కృష్ణమూర్తి గారు (కావుడి గారి తండ్రి ) మరియు వడ్లమాని పెద్ద సోమేశం గారు లు వాళ్ళ భుజాలతో తోస్తూ,రధాన్ని ముందరకి నడిపించడం లో మేము సైతం అనే వారు .రధం లాగుతున్న కుర్రాళ్లందరికి అనుపిండి రామూర్తి గారి ఇంటి దగ్గెర పెట్టిన పెద్ద గుండిగ లో మంచి నీళ్లు తాగడానికి సరఫరా చేసారు.

********

రధం మీద కూర్చుని పట్టుకున్న కాగడా దీపాలతో , ఒకటో వీధి మెరిసిపోతోంది. బుట్ట బొమ్మలు , దేవతా వాహనాలు రధం ముందర కదుల్తున్నాయి. రధం లాగుతున్న కుర్రాళ్ళు ఒక్కసారి రధం పగ్గాలు పట్టుకుని “అశ్శరభ శరభ” అని అరిచారు . రధం లో నున్న పిల్లలు కూడా వంతు పాడారు. రధం మెల్లగా అనుపిండి రామభద్రుడు గారు, అనుపిండి అగ్గన్న గారి (సన్యాసిరావు మాస్టర్ గారి తండ్రి) ఇంటి మీదుగా, తోటకూర నాయిన రాజు గారు, తోటకూర సీతా రామరాజు గారి ఇంటి మీదుగా, వడ్లమాని నారాయణ (అవతారం గారి) గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ రామరాజు గారింటి దెగ్గర ఆగింది.

అక్కడ నుంచి మెల్లగా కొడుకుల కాళమ్మ గారింటి కి, ఐసోల్ల కామేశ్వరావు మాస్టర్ ఇంటి దాకా, అక్కడనుంచి పేరిచర్ల వారింటిదాకా వెళ్లి ఆగింది. (అప్పట్లో ఆ వీధి చివర సరిపెల్ల సత్యం గారు, దాట్ల గారుల ఇళ్ళు ఉండేవి ). పెద్ద రధం మాత్రం తిరిగి తిన్నగా అనుపిండి బుచ్చి బాబు గారింటి వద్ద ఉంచి, బుట్ట బొమ్మలు, దేవతా వాహనాలు మళ్ళీ తిరిగి మునసబు గారి తూము గుండా అనుపిండి రామూర్తి గారి సందు ద్వారా, అనుపిండి పేరన్న గారింటికి, ఆ తరువాత సూరపరాజు గారింటికి, పక్కనే ఉన్న రాణి వీరభద్రం గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ సరిపెల్ల కాంబాబు గారు /శంబన్న శాస్త్రి గారి ఇంటి వద్ద ఆగింది. అక్కడ కాసిన్ని మంచి నీళ్లు తాగేసి , అక్కడ నుంచి పెద్దమాస్టర్ (మరువాడ అప్పారావు) గారి ఇంటి వద్ద ఆగి, తిరుగుముఖం పట్టాయి.ఏ సందు లో నైనా మేళ తాళాలు వాయించకూడదు అనే నిబంధన ఉండడం తో హరి హర నామ స్మరణలతో మాత్రమే సరిపెల్ల వారి వీధుల నుంచి , మళ్ళీ మునసబు గారింటికి తిరుగు ప్రయాణం మొదలెట్టాయి దేవతా వాహనాలు .

*******

తరువాత దేవతా వాహనాలు, తిరిగి మునసబు బుచ్చి బాబు గారింటి వద్ద ఆగాయి. అలసిన వారందరూ అరుగుల మీద కూర్చునే ఉంటె, పెద్ద గుండిగ లో మజ్జిగ నీళ్లు పెట్టి తాగమని చెప్తున్నారు పెద్దలు. రధం లో కూర్చున్న పిల్లలు, రధం లాగే యువత అందరూ వచ్చి ఒకొక్కలే మజ్జిగ నీళ్లు తాగి మళ్ళీ రధం పగ్గాలని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. సన్నాయి మేళం వాయించే వాళ్ళని కూడా తాగమని బుచ్చిబాబు గారు చెప్పడం తో వాళ్ళు కూడా మజ్జిగ నీళ్లు తాగేసి బయలు దేరారు.

రధం మెల్లగా బుచ్చి బాబు గారి ఇంటి నుంచి మొదలయ్యింది. అక్కడనుంచి సరిపెల్ల అన్నాజీ గారి ఇంటికి, నూకల పాపడు గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ , రావమ్మ గారిఇంటి పక్క నుంచి, మరువాడ కృష్ణమూర్తి గారిల్లు , నూకల విశ్వ సుందరం గారిల్లు , నూకల బెల్లం కొట్టు సూరిబాబు గారి ఇంటి నుంచి, కోతుల మామ్మ , పాలగుమ్మి రామారావు గారిల్లు , అత్కూరి నారాయణరావు గారిల్లు పక్కనుంచి శివాలయం ప్రధానార్చకులు వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారి ఇంటి మీదుగా శివాలయం దగ్గరకి చేరాయి.

********

రధం లో ఉత్సవానికి ఊరేగించిన విగ్రహాలని తీసి, ప్రధాన అర్చకులు వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారు శివాలయం లో పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి కి కళ్యాణం జరిపించారు. రంగ రంగ వైభోగం గా జరుగుతున్న ఆ కల్యాణానికి ఊళ్ళో పెద్దలు అందరూ తిలకిస్తూ ఉంటె, గుడి ముందర ఆగి ఉన్న రధాన్ని యువత గుడి పక్కనున్న ఖాళీ స్థలం లో కి పెడుతున్నారు.

అలాగా వైశాఖ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమైన పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి మరియు శ్రీదేవి, భూదేవి సమేత కేశవ స్వామిల కళ్యాణం ఐదు రోజుల పాటు బ్రహ్మాండం గా మొదట్లో గుళ్లో భక్తులకి భోజనాలు ఏర్పాటు చేసేవారు. తరువాత మధ్యాన్నం పానకాలు, వడపప్పు, మజ్జిగ లు మంచినీళ్లు ఇస్తూ ఒక పక్క , కొండంత ఎత్తుని తలపించే నలభై అడుగుల రధం, దాని తో పాటు దేవతా వాహనాలు, హరి, హర నామ స్మరణలు, యువకుల “అశ్శరభ శరభ” “అల్లెల్ల వీర ” నినాదాలు తో అప్పటి ప్రజలు భక్తి తో ఉప్పొంగిపోయారు.

******************

(రధ యాత్ర-2 లో అత్యద్భుతమైన సంఘటనలు..అతి త్వర లో )

******************

Written by

(Prasad Oruganti )

ప్రత్యేక కృతజ్ఞతలు : రాంబాబు మాస్టర్ గారు , నూకల పేరప్ప గారు, వడ్లమాని బాబిగారు, వడ్లమాని ప్రసాద్, శర్మాజీ, నల్లయ్య శాస్త్రి గారు, హరే రాంబాబు, అర్చకులు వెలవెల పల్లి సోమేశ్వరావు గారు, నూకల కాంబాబు గారు, సన్నీ వడ్లమాని గారు.

ఆవకాయ…

ఆమె కి నిద్ర పట్టడం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంది. పక్కనే ఉన్న భర్త ఆమె ని అడిగాడు “ఏమైంది కాంతం ఆలా దీర్ఘం గా ఆలోచిస్తున్నావు, వంట్లో నలత గా ఉందా” అని. “ఆబ్బె అది ఏమి లేదు” అని చెప్పి విసుగ్గా అటుపక్క తిరిగి పడుకుంది కాంతం. ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న దోమల మందు టార్టోయ్స్ కేసి చూసాడు….ఒక దోమ భయం లేకుండా చక్రం చుట్టూతా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ,భర్త ఫ్లాష్ బ్యాక్ లోకి పొద్దున్న కెళ్ళాడు.
********
అసలే వేసవి కాలం కావడం వలన ,మండే సూర్యుడు “మీ పని పడతా” అన్నట్టు పొద్దున్నే చిట పట లతో పలకరిస్తున్నాడు. బయట “ఆవకాయ కాయ” ఆవకాయ కాయ ” అని అరుస్తున్నట్టు వినిపించింది కాంతానికి. లోపల ఉన్న ఆమె పరుగు పరుగున వచ్చేసింది. బయటకి వచ్చేటప్పటికి “అరటికాయ అరటికాయలు” అంటూ ఒకతను అమ్ముకుంటూ వెళ్తున్నాడు. అయ్యో అరటికాయలా అనుకుంటూ మళ్ళి లోపలికెళ్ళింది.

“ఇదిగో కాంతం” అంటూ పొరుగింటి మంగతాయారు రెండు రోజుల ముందరే పెట్టేసిన ఆవకాయ శాంపిల్ ని చిన్న గిన్నె లో పెట్టి “ఇంకా నువ్వు పెట్టలేదు కదా అని తెచ్చాను రుచి చూసి చెప్పు” అనేసి గిన్నె ని కాంతానికి ఇచ్చేసి ,మంగతాయారు వెళ్ళిపోయింది. కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ అంటూ తెగ మురిసిపొయినా, ఇంకా తను ఆవకాయ పెట్టలేదని కాంతానికి కొంచం బెంగుంది.

సాయంత్రం అయ్యింది. రాత్రి డిన్నర్ లో భర్త కి పొరిగింటి కొత్త ఆవకాయ వేసింది. ఆ కొత్త ఆవకాయ బావుంది బావుంది అని అన్నాడు కానీ, ఆవకాయ కాయ గురించి కానీ, మనింట్లో ఎప్పడు పెడదాం అని భర్త అనకపోవడం తో అప్పట్నుంచి భర్త తో అలిగింది.

సడన్ గా ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటికి వచ్చాడు భర్త. ఓహ్ మనం కూడా ఆవకాయ పెట్టాలి కదా అంటూ దోమల్ని కొట్టుకుంటూ వాలాడు మంచం మీద . గది లో మూల పిల్ల దోమలు టార్టోయ్స్ చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఆడుకుంటున్నాయి.

********
కొన్ని రోజుల తర్వాత

లోపల పెరట్లో నుంచి ఇంటిలోకి, అటూ ఇటూ చాలా హడావిడిగా తిరిగేస్తోంది కాంతం. పెరట్లో ఆరేసిన ఎండు మిరపకాయలు “మేము తయారు” అన్నట్టుగా ఎండలో ఎండుతున్నాయి. పక్కనే రోలు “నేను కూడా రెడీ మిమ్మల్ని దంచడానికి” అన్నట్లు ఎండు మిరపకాల వైపున , పక్కనే ఉన్న మాడుగుల ఆవాల వైపున, అటుపక్క నున్న రాళ్ల ఉప్పు వైపుకి ఉరిమి ఉరిమి చూస్తోంది.

ఇంకో పక్క న కాంతం ఇవన్నీ దంచే వాళ్ళని చక్కగా చూసుకుంటోంది. ఎండలో అలిసి సొలిసి పోకుండా ఎప్పటికప్పుడు పంచదార నీళ్లు ఇస్తోంది. అడిగిన వాళ్ళకి టీ కాస్తూ ఇటు అటు తిరుగుతోంది.

సువర్ణ రేఖ మామిడికాయ కూడా ఒక పక్క రాసులుగా పడి ఉన్నాయి.కొంతమంది ఆ కాయల్ని తడి గుడ్డతో తుడిచేస్తున్నారు. ఇంకో ఇద్దరు కత్తి పీటలేసుకుని కూర్చుని ఉన్నారు. తుడిచిన కాయల్ని ఒకొక్కటే తరుగుతున్నారు, వెంటనే తరిగిన కాయ లో ని జీడీ తీసి పడేస్తున్నారు. ఇల్లంతా హడావిడి గా ఉంది, అందరూ కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తున్నారు. ఇదంతా చేయిస్తున్న కాంతం లో ఒకటే ఆనందం ఆవకాయ రెడీ అయిపోతోంది. ఎంచక్కా చుట్టూ పక్కలోళ్ళకి, పిల్లలకి, కొత్త ఆవకాయ పంచేయచ్చు అని సంబరం గా ఉంది.

గుండలు, మామిడికాయ ముక్క చక్కగా రెడీ గా ఉన్నాయి. నూనె కూడా నేను సైతం అన్నట్టు చూస్తోంది. కలిపిన కొత్త ఆవకాయ అంతా మా దగ్గరే భద్రం అన్నట్టుగా గా పింగాణీ జాడీ లు ముద్దుగా ముస్తాబయ్యి ఉన్నాయి. ఒక జాడీ తర్వాత ఇంకో జాడీ అలాగా మొత్తానికి మూడు నాలుగు జాడీల్లో కొంత మాములు ఆవకాయ, మరో చిన్న జాడీల్లో ఉల్లి ఆవకాయ పెట్టేసి , ఆ జాడీలకి గుడ్డ కట్టేసి , పైన ఆ జాడీ మూత బిగించేసి హమ్మయ్య మొత్తానికి మనింట్లో ఆవకాయ అయిపోయిందోచ్ అని ఒకింత గర్వం తో ఉంది కాంతం.
****
“ఇదిగో మంగతాయారు, మా కొత్త ఆవకాయ కూడా రుచి చూడు” అనేసి గిన్నె లో పెట్టిన కొత్త ఆవకాయ ని అందించింది కాంతం. “కాయ సువర్ణ రేఖ లా ఉందే” అని ఆవకాయ కాయ ని చూసి అంది మంగతాయారు. “అవును ఆవాలు కూడా మాడుగుల ఆవాలె” అనేసి కొంచం గర్వం గా ఫీల్ అయ్యి అక్కడనుంచి ఇంటికెళ్లింది. కూతురికి, కొడుకులకి ఇంక సర్దడానికి.

“మీ ఇంట్లో ఆవకాయ అయ్యిందా” అనే ప్రశ్న రాకుండా అడిగిన అడగని వాళ్లందరికీ సాంపిల్స్ ఇచ్చేసి ఆవకాయ పెట్టేశామన్న సంతోషం లో ఉంది కాంతం.
*****
కొన్ని రోజుల తరువాత ఇంకో ఇంట్లో :

“ఏమోయ్ ! భార్యా మణి! కొత్త ఆవకాయ పెట్టాలంటావా…ఇరుగు పొరుగు వాళ్ళ ఇచ్చిన సాంపిల్స్ తో ఈ ఏడు ని పంపించేద్దామా అని మాటలు వినిపిస్తున్నాయి ఇంకో ఇంట్లో…

రెండు రోజుల తర్వాత

లోపల పెరట్లో నుంచి ఇంటిలోకి, అటూ ఇటూ చాలా హడావిడిగా తిరిగేస్తోంది ఆ ఇల్లాలు. పెరట్లో ఆరేసిన ఎండు మిరపకాయలు “మేము తయారు” అన్నట్టుగా ఎండలో ఎండుతున్నాయి. పక్కనే రోలు “నేను కూడా రెడీ మిమ్మల్ని దంచడానికి” అన్నట్లు ఎండు మిరపకాల వైపున , పక్కనే ఉన్న మాడుగుల ఆవాల వైపున, అటుపక్క నున్న రాళ్ల ఉప్పు వైపుకి ఉరిమి ఉరిమి చూస్తోంది..
*************************************
ప్రసాద్ ఓరుగంటి

Note: కథ లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

 

పేపర్ పాపారావు

అరుగు మీద కూర్చుని, గ్యాంగ్ తో పేకాట ఆడుతున్నాడు పాపారావు. ఆ అరుగుమీద రెండు మూడు తెలుగు న్యూస్ పేపర్ లు “తెగ చదివేసి, దాంట్లో సారాన్ని పీల్చేసినట్టుగా” నలిగి పోయి పడి ఉన్నాయి. పేకాట మధ్యలో ప్రాంతీయ వార్తలనుంచి, పారిస్ వార్తల దాకా, “కోటి పల్లి నుంచి కాలిఫోర్నియా దాకా” తాను పేపర్ లో చదివేసి, పీల్చేసినవి అక్కడ పేకాట ఆడుతున్న వాళ్లతో ఊదేస్తున్నాడు పాపారావు.

“యాండీ పాపారావు గారు, మీరు భలే చెప్తున్నారండి ఇన్ని విషయాలు. అసలు మీరిక్కడ ఉండాల్సినవాళ్లు కాదు. ఎక్కడో అమెరికానో, లండన్ లోనో ఉండాలండి” అంటూ ముక్క తీసుకుంటూ ముక్కు ఎగరేస్తూ అంటున్నాడు పేరయ్య. “ఎహె అమెరికా లో ఏముంది రా , “అక్కడికెళ్లిన వాళ్ళని తిరిగి పంపించేత్తారుట”, అంటూ పగలబడి నవ్వుతున్నాడు పాపారావు. “అవునండీ, పాపారావు గారు, నాకు తెల్వక అడుగుతున్నా! మీరెప్పుడైనా అమెరికా కి ఎల్లారా” అని పక్కూరినుంచి వచ్చి మరీ పేకాట ఆడుతున్న పుల్లయ్య ఆత్రుత గా ప్రశ్న వేసాడు పాపారావు ని. “ఆబ్బెబె . ఛ.. ఛ. అలాంటి చోట్ల కి నేను వెళ్ళను, నాకు అక్కడ పనేంటి” అని పెద్ద పాట్రియాట్ లాగ పళ్ళు బయటెట్టి సమాధానం ఇచ్చాడు పాపారావు.

****

“ఏరా భూషణం, విన్నావా ! ఆ పక్క వీధి వాళ్ళు , అమెరికా నుంచి మొత్తం బెటాలియన్ అంతా దిగిపోయారంట” అని పాపారావు ముక్కు మీద కి జారుతున్న కళ్ళ జోడుతో పేపర్ చదువుతూ అంటున్నాడు పక్కోడి తో. “కాదండి, పండగ కదా అని మొత్తం ఫామిలీ తో వచ్చేరుట” అని రిప్లై ఇచ్చాడు ఆ పక్కోడు. “నీకు తెలియదు రా” అంటూ తుండు గుడ్డేసుకుని పెరట్లో కి వెళ్ళాడు పాపారావు.

ఆ అమెరికా నుంచి వచ్చిన కుర్రాళ్ళు, అందరిటికి వెళ్లి పలకరిస్తున్నారు. అందరూ ఆప్యాయం గా తిరిగి పలకరిస్తున్నారు. ఆ కుర్రాళ్ళు , పేకాట ఆడుతున్న జనాల దగ్గెరకొచ్చి పలకరించారు. వీళ్ళని చూసిన పాపారావు, “ఏమయ్యా, మీరు వచ్చారా, ఆల్లు పంపించేసారా” అంటూ ఎటకారపు నవ్వుతో పలకరించాడు.

****

రోజులు గడుస్తున్నాయి. పాపారావు కొడుకు పరమేష్ కి అనుకోకుండా ఫారిన్ పిలుపు వచ్చింది.మూటా ముళ్ళు సర్దుకుని అమెరికా కి వెళ్ళాడు. కొన్ని నెలలు తరువాత వాళ్ళ నాన్న ని కూడా అమెరికా కి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు.

పాపారావు గారు, మీ ఎబ్బాయి అమెరికా ఎల్లాడు ట కదా, మీరు ఎల్తారా “అని ఒకడు పేకాటలో ముక్కేస్తూ ఎటకారం గా అడిగాడు. “అవును రా, ఇక్కడేముంది అంతా అక్కడే. ఏది కనిపెట్టిన వాళ్లే కనిపెట్టాలి” అని అప్పుడే ప్లేట్ మార్చి ముక్కేయమన్నాడు పక్కూరి పుల్లయ్యని. పుల్లయ్య ముక్కేస్తూ ముక్కున వేలేసుకున్నాడు పాపారావు మాటలు విని..

పాపారావు మొత్తానికి వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. కాన్సులేట్ వాళ్ళు వేసిన ప్రశ్నల కి తడబడి, తింగర సమాధానాలు చెప్పడం తో, మొహం మీద ఏమి అనలేక నవ్వుతూ వీసా రిజెక్ట్ చేసి, వాళ్ళు కసి అలాగా తీర్చుకున్నారు. తరువాత కొడుకు, పాపారావు చేత ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయించి , చివరాఖరికి పాస్పోర్ట్ మీద అమెరికా స్టాంప్ ఏయించుకున్నాడు.

****

పాపారావు అమెరికా వెళ్లి ఆరు నెలలు తరువాత తిరిగి వచ్చాడు. పేకాట ఫ్రెండ్స్ అంతా ఆనందం గా ఉన్నారు. పాపారావు అమెరికా నుంచి వచ్చాడని. “యాండీ పాపారావు గారు, ఎలా జరిగింది మీ అమెరికా ట్రిప్ ” అని ముక్కలు పంచుతూ ఒకడు అడుగుతున్నాడు. “ఛీ ఎదవ దోమలు, అంటూ దోమని కొడుతూ “అక్కడైతేనా” అని, దూరం గా వినిపిస్తున్న బైక్ హార్న్ లని విని “ఈళ్ళు మారరు రా బాబు, ఉత్తుత్తునే హార్న్ లు వేస్తారు, “అక్కడైతేనా” అని చెవులు మూసుకుంటూ, ఆ.. ఏమి అడుగుతున్నావు అని ప్రశ్న అడిగినోన్ని తిరిగి ప్రశ్న వేసాడు. .

ఇది చూస్తున్న పేకాట జనాలు బిత్తర పోయి “ఈడింతే…ఈడు మారడు” అనుకుని పేక ముక్కలతో పారిపోయారు. పాపారావు యధావిధి గా పేపర్ లో మునిగిపోయాడు.
***********************

(నోట్: ఇది కేవలం కల్పిత కథ. పాత్రలు, పాత్రధారులు కూడా కల్పితం. ఎవరినీ ఉద్దేశించినది కాదు.)

*************
ప్రసాద్ ఓరుగంటి

నవంబర్’ 96

“బంగాళా ఖాతం లో  రెండు రోజుల కిందట పట్టిన వాయుగుండం అది తుఫాను గా మారి ఈ రోజు తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావం వలన వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ గా వర్షాలు పడచ్చు” అని  రేడియో లో వస్తోంది.

“ఏరా సోమేశమ్!  మన పంటలు ఒబ్బిడవుతాయా అంటావా ఈసారి” అని రేడియో వింటూ అడుగుతున్నాడు లింగయ్య . “ఎహె ఇవన్నీ మాములు వర్షాలే, ఆల్లు అలాగే చెప్తారు” అని చుట్ట వెలిగించడానికి, అగ్గి పెట్టి గురుంచి చొక్కా జేబు ని తడుముకుంటున్నాడు సోమేశమ్! .
*****
“అమ్మా! కాలేజీ కెళ్తున్నా” అని బాగ్ లో బుక్స్ వేసుకుని చెప్తోంది ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కి .. “ఆ సరే , బస్సు పాసు పట్టుకెళ్ళు. ఏదో వాన వచ్చేలా ఉంది.జాగ్రత్త గా వెళ్లి వచ్చేతల్లి” అంటూ ఆ తల్లి కూతురికి చెప్తోంది. “ఆ.. అలాగే” అంటూ తన ఫ్రెండ్స్ తో  బస్సు ఎక్కడానికి రోడ్డు దగ్గెర కొచ్చింది ఆ అమ్మాయి.
****
“ఏరా యెంత సేపురా, కాలేజీ కెళ్ళి అక్కడనుంచి మాట్నీ కి ‘భారతీయుడు’ సినిమా కి వెళ్లి వచ్చేద్దాం” అంటూ తన ఫ్రెండ్ రమణ ని త్వరగా తయారవ్వమని రావు తొందర పెడుతున్నాడు. “ఎహె ఇప్పటికే అది రెండు సార్లు చూసాం, ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా కి  ఇంకో సారి వెళ్ళొచ్చేచు ” అంటూ రెడీ అవుతున్నాడు బస్సు మీద కాలేజీ కి వెళ్ళడానికి రమణ.
****
“ఈ వారం ఇంకా కొబ్బరి కాయ దింపు తీయించలేదు. రేడియో లో వర్షాలు అని అంటున్నాడు. మళ్ళి ఇంకో వారం ఆగితే కానీ కుదరదేమో” అని మాణిక్యం కాఫీ హోటల్ లో  టీ  తాగుతూ అప్పుడే వేసిన బజ్జి కేసి చూస్తూ అంటున్నాడు పరమేశం.”పర్లేదు లెండి. వర్షాలు యెంత, రెండు రోజుల్లో తగ్గిపోతాయి, మీ చెట్లేమీ పడి పోవులెండి. ఎన్ని చూసాం ఇలాంటివి.  మళ్ళి వత్తా” అని అనేసి సైకిల్ మీద తుర్రున వెళ్ళాడు కొబ్బరి దింపులు తీసే కోటయ్య. “నీ చుట్టూ తిరగ లేక చత్తున్నా, సరే లే ఇంకో వారం లో కనపడతావు గా అప్పుడే తీయిత్త,
“ఇదిగో మాణిక్యం  టీ డబ్బులు” అంటూ మాణిక్యానికి ఇవ్వడానికి లేచాడు పరమేశం.
****
“సంద్రం లోకి ఇయ్యాల ఏళ్ళొద్దు మావా నువ్వు . ఆకాశం సూత్తుంటే ఏదో పెద్ద ఇపత్తు వచ్చే లా ఉంది. ఇయ్యాల వెళ్లకపోతే పర్లేదు. ఇంట్లో నే ఉండు మావా” అంటూ రెండేళ్ల పిల్లాడికి అన్నం పెడుతూ చెప్తోంది ఒక ఇల్లాలు. ఆ పక్కనే గుడ్డ ఉయ్యాలలో పసి బిడ్డ నిద్ర పోతోంది. “ఎహె ఇయన్నీ మాములే కదే, ఇలాంటివి ఎన్ని చూసాం, పర్లేదు లే కానీ నేను ఎల్లొత్తా” అంటూ చేపల వల తీసుకుని, తన వాళ్ళ తో సముద్రం లో కి వెళ్ళాడు చేపల్ని పట్టుకోవడానికి చంద్రన్న.
****
అప్పటికే మసిబారిన లాంతరు చిమ్నీ ని కడిగేసి, దాంట్లో కిరసనాయిలు పోసి ఉంచింది. చీకటైన వెంటనే లాంతర్ ని వెలిగిద్దామని పాపాయి. “ఏమండీ! వచ్చేయండి అన్నానికి, అన్నీ సర్దేశాను. ఈ కర్రెంట్ ఎప్పుడు వస్తుందో ఏమిటో , ఈ వానని చూస్తే కర్రెంట్ రెండు రోజులదాకా వచ్చేటట్టు లేదు. ఈ వానలు తగ్గాక మన పెంకులు నేయించాలండి. వర్షం ఇలాగె పడితే, మన ఇంట్లో కూడా పడి పోయేలా వుంది” అంది పాపాయి. “అలాగే చేద్దాం ఈ వాన తగ్గనీ, ఇప్పటికిప్పుడే పెంకులేమీ ఎగిరిపోవు కదా ఈ వానకి ఇలాంటి వి ఎన్ని చూసాం, ఆ కొంచం కూరేయి” అని  అన్నం తింటున్న నాగేశ్వర రావు భార్య తో అంటున్నాడు.
***
నల్లటి మేఘాలు ఊళ్ళని మింగేసేలా ఉరుమి ఉరుమి చూస్తున్నాయి. వాన జోరందుకుంది.రోడ్లన్నీ నిర్మానుష్యం గా ఉన్నాయి. కుక్కలు బెరుకు బెరుకు గా వెళ్లి దాక్కుంటున్నాయి. పక్షులు కూడా పెందరాళే వెళ్ళిపోయి, చెట్ల పైన
కట్టుకున్న గూట్లో కి వెళ్లి, తెల్లారిన తరువాత మళ్ళి రావచ్చు ,  అనుకుని గూట్లో, రెక్కల దుప్పటేసుకుని బజ్జున్నాయి.

ఎక్కడో రేడియో లోని వార్తలు, గాలి కి కొట్టుకొచ్చిన్నట్టుగా సగం సగం వినపడుతున్నాయి. మెల్ల మెల్ల గా గాలి ఊపందుకుంది.“ఇప్పడి దాకా కురిసి కురిసి అలసిపోయి ఉన్నావు. ఇప్పుడు నేను  అందుకుంటాను” అనేసి వర్షానికి గాలి తోడయ్యింది.

గంటకి సుమారు 145 కిలోమీటర్ లనుంచి 215 కిలోమీటర్ ల వేగం తో వీచే గాలులకి ఊళ్లన్నీ అతలాకుతలం అవుతున్నాయి. భీకర మైన శబ్దం వస్తోంది. పెద్ద పెద్ద చెట్లన్నీ పెళ పెళ మని కింద పడుతున్నాయి. భయంకరమైన గాలికి కొబ్బరి చెట్లు సైతం మేమూ తట్టు కోలేము అంటూ నేల కి ఒరుగుతున్నాయి. ఒక చెట్టు కాదు, వంద కాదు..వేల చెట్లు నేల కొరుగుతున్నాయి. “ఎప్పటి నుంచో చెట్లే మాకు మేడలు” అని గూళ్ళు కట్టుకున్న పక్షులు విల విల లాడుతున్నాయి.

ఇంటి పై కప్పులు లేస్తున్నాయి. ఇంట్లో ఉన్న జనాలు హహకారాలు పెడుతూ పిల్లా, పాపలతో బిక్కు బిక్కు మని ఓ మూల దాక్కుంటున్నారు. పూరి గుడిసెలు,వాటిలో ఉండే  ప్రాణాలు కూడా పూర్తిగా గాలి లో కలిసి పోతున్నాయి.
కరెంటు స్తంభాలు, తీగలు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి.

ఊరికి తిరిగెల్తున్న బస్సులు ఎక్కడిక్కకడ ఆగిపోయాయి. బస్సు లో పొద్దున్న కాలేజీ కెళ్ళి, తిరిగి వచ్చే పిల్లలు అంతా బస్సు లో నే చిక్కుకుపోయారు.బయట చిమ్మ చీకటి. ఒకొక్క చెట్టు , కళ్ళ ముందరే పెళ పెళ మని విరుగుతున్నాయి. విరుగుతున్న చెట్లు బస్సు మీద పడి బస్సు అద్దాలు పగులుతున్నాయి. బస్సు దిగి పరిగెత్తుకుని బయటకి వెళదామని బస్సు లో ఉన్న రమణ, రావు ల తో పాటు మరొకొందరు దిగారు. బయట వీస్తున్న ప్రచండ వేగానికి కొందరు చెల్లా చెదురయ్యారు. మరికొందరు ప్రాణ భీతి తో బస్సు ఎక్కేసి ఆయాస
పడుతున్నారు.
***********

మరుసటి రోజు ఉదయం  7 గంటలు.

సూర్యుడు యధా విధి గా వచ్చేసాడు. ఎండ పెళ్ళు మని కాస్తోంది. ఆకాశానికి ఏమి తెలియనట్టు గా చాలా నిర్మలం గా వుంది. ఊళ్లన్నీ ఎక్కడా నీడ లేని ఎడారి లా కనిపిస్తున్నాయి . చెట్లన్నీ పడిపోయి బస్సు ల ముందర ధర్నా చేస్తున్నట్టు గా ఉండడం తో , ముందర రోజు ఉదయం కాలేజ్ కి వెళ్లిన కొంత మంది పిల్లలు, బస్సు లోని ప్రయాణికులు  నడుచుకుంటూ, నీరసం గా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు.

సముద్రం లో కెళ్లిన 1000  మంది జాడ తెలియలేదు.కొన్ని వేల పశువులు, కోళ్లు విగత జీవులై ,చెల్లా చెదురయ్యి ఉన్నాయి..కొన్ని వేల ఎకరాలు నాశన మయ్యాయి. కొబ్బరి చెట్లన్నీ వడి తిరిగి పడి పోయి ఉన్నాయి.కొబ్బరికాయలు గుట్టలు గుట్టలు గా పడిపోయినవి కొన్ని, మరికొన్ని భయంకరమైన  గాలికి,చెట్టు మీద నుంచే విడిపోయి చుట్టుపక్కల ఇళ్ల మీద పడి ఇంటి పెంకుల్ని, గుడిసెల్ని, రేకు ఇళ్ల ని విధ్వంసం చేసినట్టు గా కనిపిస్తోంది.

గాలికి చాలా మంది ఇంటి పెంకులు ఎగిరిపోయాయి. వీధులన్నీ పెంకులు తో, కొబ్బరాకులతో రోడ్డు వేసినట్టుగా ఉన్నాయి. పడి పోయిన కర్రెంట్ తీగల మీద, తడిసిన బట్టలు ఆరేసుకుంటున్నారు.

నెల రోజుల తరువాత:

“ఏరా! కోటయ్య! ఇప్పట్లో కొబ్బరి తోటకెళ్ళే పని నీకు ఉండదు, నాకు ఉండదు” అని లోపల దుఃఖం తో  నెమ్మది గా అంటున్నాడు పరమేశం. “ఆయ్ అవునండి” అంటూ కోటయ్య ఏడుపు ఆపలేక పైకే ఏడుస్తున్నాడు.

“కరెంటు దీపాన్ని చూసి నెల రోజులయ్యింది” అని నెమ్మదిగా అంటోంది పాపాయి మళ్ళి లాంతర్ చిమ్నీ ని తుడుస్తూ తన భర్త తో, “అవునే, మొత్తానికి కరెంటు ఇవ్వాలో, రేపో వచ్చేస్తుంది అని  అంటున్నారు” అని భర్త , గది లోపల నుంచే ఆకాశం లో తెల్లటి మబ్బులని చూస్తూ చెప్తున్నాడు.

చేపలకని సముద్రం లో కెళ్ళి, మళ్ళి తిరిగి రాలేకపోయిన చంద్రన్న గురుంచి ,సముద్రం వైపు దిగులుగా చూస్తూ, తన పిల్లల తల నిమురుతోంది చంద్రన్న భార్య. దూరం గా సముద్రం లో కెరటాలు మాత్రం ప్రశాంతం గా తీరానికి వస్తూ వెళ్తున్నాయి .

సంవత్సరం తరువాత

“బంగాళా ఖాతం లో  రెండు రోజుల కిందట పట్టిన వాయుగుండం అది తుఫాను గా మారి ఈ రోజు తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావం వలన వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ గా వర్షాలు పడచ్చు” అని  రేడియో లో వస్తోంది.

ఇది విని సోమేశమ్, లింగయ్య లు  ఒకరి ముఖాల ఒక వైపు చూసుకుని నవ్వుకుంటున్నారు.

************************************
ప్రసాద్ ఓరుగంటి

Note: కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.