లాక్ డౌన్ 

ఏరా!  అమెరికాలో ఎలా ఉన్నార్రా మీరు అందరూ” అని అమెరికాలో ఉన్న వేంకటాద్రి కి ఫోన్ చేసి అడిగాడు సింహాద్రి. ఇంకా వెంకటాద్రి సమాధానం ఇవ్వకుండానే “అవును రా , రెండు మాసాల నుంచి న్యూస్లో  “కరోనా కాటుకి అమెరికా విలవిల” అని , “ఆకలి రాజ్యం గా మారనున్న అగ్రరాజ్యం” అనేసి  నలుగురు తక్కువ కాకుండా తెగ డిస్కషన్లు టీవీ లో చూస్తున్నాము . “అవునోరే మర్చిపోయాను ఎప్పట్నించో అడుగుదామని , అక్కడకూడా లాక్ డౌన్ టైంలో, ఊసిపోక ఓసారి ఊరి ని చూసొద్దామని బయటకి  వెళ్తే  బాదేస్తున్నారా”  అని ప్రశ్నలుఅడుగుతూ ఉండగానే “ఎందుకు లేరా బయటకి  వెళ్లి  దెబ్బలు తినడం, ఇంట్లోనే జాగత్త గా  ఉండి  ఏదో తినేసి బతికేండీ” అని సలహా ఇస్తూ  ఫోన్  పెట్టేసాడు  సింహాద్రి.

వెంకటాద్రికి తిరిగి  ఫోన్  చేసి , సింహాద్రి కుతూహల  ప్రశ్నలకు, కూలంకుశం గా సమాధానం ఇద్దామనుకున్నాడు. కాని ఫోన్  చేస్తే  ఇంకా మిగిలిన ఛానల్ లలో జరిగిన డిస్కషన్ లు గుర్తొచ్చి , మరికొన్ని అడుగుతాడేమో అని భయపడి తిరిగి  ఫోన్ చెయ్యలేదు. ఒక పెన్ , పేపర్ తీసుకుని  స్నేహితుడు సింహాద్రికి  ఉత్తరం రాయడం మొదలెట్టాడు.

*************************

ఇంకా “లాక్డౌన్” అనేమాట ఎక్కడా  వినిపించని  రోజులు.

ఉద్యోగస్తులు ,వ్యాపారస్తులు ఎవరి పనుల్లో  వాళ్ళు ఉండి, వాళ్ళ కార్లలోనో, పక్కోళ్ల కార్లలోనో (అదే..కార్ పూలింగ్ ) , లేదా  ట్రైన్లోనో  ఆఫీస్ కి వెళ్ళి పోయి , అక్కడే బ్రేక్ఫాస్ట్ లు , లంచ్ లు తింటూ చక్క గా పని చేసుకుంటున్నారు. పిల్లకాయలు పొద్దునే లేచి చక్కగా ముస్తాబయ్యి , బుక్కులట్టుకుని బళ్లోకి వెళ్తున్నారు .

ఆఫీసునుంచి వచ్చిన వెంటనే తల్లితండ్రులు పిల్లకాయలని  కరాటే, స్విమ్మింగు, సంగీత, నృత్య, చిత్రలేఖనం లాంటి క్లాసులకి తిప్పుతూ, ఒకగంట అయినా పిల్లల్ని  స్క్రీన్  టైంకి దూరం చేస్తున్నామని సంబర పడిపోతున్నరోజులు . అప్పుడప్పుడు టీవీలు, ఫోన్లు పక్కన పెట్టి బయటికి వెళ్లి చక్కగా ఆడుకుంటున్న పిల్లలు .

****************************

అది పుట్టింది ఎక్కడో ఊహన్ లో నైనా , ఊహించుకొనే లోపులోనే  ఊళ్ళ ఊళ్ళ ని దాటుకుంటూ ,  వేలవేల మైళ్ళు ప్రయాణించి “మీ  ఊపిరిని ఊదే దానికీ నేను రెడీ” అన్నట్టుగా  ప్రపంచాన్ని చుట్టేసింది మన కంటికి కనిపించని సూక్ష్మజీవి.

అంతే ! ఆ మహమ్మారి  వచ్చేసింది. ఒక్కసారి  “షెల్టర్ ఇన్  ప్లేస్ ”  ఆర్డర్స్  వచ్చేసాయి. వర్క్   ఫ్రొం హోమ్ చెయ్యాలని , బళ్ళు  కూడా  బంద్ చేస్తున్నామని అవసరమయితే  తప్ప బయటకి  రావద్దని  వచ్చేసాయి ఆదేశాలు.

*****************************

జూమ్ (zoom )  మంతర్  కాళీ … జు..జూమ్ మంతర్  కాళీ… పొద్దున్నే  ఆఫీస్ లు జూమ్(zoom ) మీటింగ్లతో  మొదలు .

అసలే కరోనా సమయం,  ఎవడూ ఇంటిగడప దాటడని  వాళ్ళకి  ధైర్యం. స్లాక్ (slack) చాట్స్ తో  నిద్రలేపుదాం అని ఈస్ట్ కోస్ట్  వాళ్ళు ఇష్యూష్ తో మొదలెట్టిన మీటింగ్స్, అంతులేని  సీరియల్ కథల లా సాగిపోతున్నాయి.

ఎలాగో  పిల్ల, పీచు, కుక్క, నక్కా , పిల్లి, బల్లి లు  కూడా  హోమ్ లోనే  ఉంటాయి కాబట్టి, అప్పుడప్పుడు జూమ్  మీటింగ్  మధ్య లో కుక్కలతో కుశల ప్రశ్నలు, పిల్లులతో పలకరింపులు ,  పిల్లలతో అల్లర్లు . అది సీఈఓ మీటింగయినా  మామూలు మీటింగ్ అయినా ఇవన్నీ  కామన్ అన్నమాట  .

హమ్మయ్య పసిఫిక్ సమయం సాయంత్రం ఆరు అయింది. ఇక విశ్రాంతి తీసుకొని, భార్యామణి దయతలిచి చేసిన సమోసా ఛాట్  తిందామనుకుంటే , కంగారు దేశం నుంచి మళ్ళి టింగుటింగు మంటూ స్లాక్ చాట్ లు.

ఇక పిల్లల విషయానికొస్తే ,  అప్పట్లో , అప్పుడప్పుడు  బయటికివెళ్ళి చక్కగా ఆడుకొనేవాళ్ళు,  ఇప్పుడు ఎప్పుడూ ఐపాడ్ , ఫోనో,  లేదా  జూమ్  లో  క్లాస్ లతో ఇంట్లోనే ఉంటూ, అమ్మా నాన్నల చేత చక్కగా అడిగి మరీ చేయించుకుని తింటున్నారు.

గ్రోసరీస్ అన్నీ  ఆన్లైన్  లోనే   ఆర్డర్  చేసేస్తున్నారు. ఇన్స్టాకార్ట్  వాళ్ళు  డోర్బెల్   కొట్టేసి, తలుపు తీయకుండానే సరుకులు ఇంటి ముందు పెట్టేసి తుర్రుమని పారిపోతున్నారు . కొంతమంది ఆర్డరు చేసిన సరుకుల్ని కార్ దిగకుండానే  ట్రంక్  (డిక్కీ ) లో పెట్టేసి షాపులోకి తిరిగి పరిగెత్తుతున్నారు .

**************

ఇంట్లో మగవాళ్ళు , కుదిరితే  కాజా  చెయ్యమని , వీలుంటే  చేగోడీ లు అంటూ  ఆడవాళ్ళని విసిగిస్తున్నారు. అప్పట్లో వంటల్లో  చేతులు తిరిగిన మగవాళ్ళు మాత్రం, ఇప్పుడు గరిటెలు తిప్పేస్తున్నారు. వచ్చే  వీకేండ్ కి పిల్ల కాయలకి పకోడీచేద్దామా లేదా  పొటాటో  చిప్స్  చేద్దామా అనే తర్జన భర్జన లో తల్లి తండ్రులు తెగ చూసేస్తున్నారు యూట్యూబ్ లో  వంటా-వార్పుల ప్రోగ్రామ్స్ .

బయటికెళ్తే  ముఖానికి మాస్క్లేసుకుని, ఇంటికొచ్చిన వెంటనే  చేతుల్ని సబ్బేసి రుద్దేసి మళ్ళి  పక్షిలాగా గూట్లో కి వెళ్ళి దాక్కోవడం . ….”ఇలాగ  జరుగుతోంది  రా  బాబు”  అంటూ  వెంకటాద్రి  ఉత్తరం  రాసి తన స్నేహితుడు సింహాద్రికి పోస్ట్ చేసాడు.

*********************

సంవత్సరం 2022 

రెండేళ్ళ తరువాత తన స్నేహితుడు రాసిన అందిన లెటర్ ని చదువుతూ  అనుకున్నాడు సింహాద్రి , అవును ఈ కరోనా ప్రపంచం లో ఎన్నో జీవితాలని మింగేసింది…ఎందరి బతుకుల్నో చిదిమేసింది. మనిషికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. ఆ కష్ట  సమయం లో చేయూత నిచ్చిన డాక్టర్లను, నర్సుల ను, స్వీపర్లను, పోలీసులను దేవుళ్ళు అని చెప్పింది. ఉద్యోగస్తులు, పెన్షనర్లు సగం జీతం తీసుకుని మరీ ప్రభుత్వాలకు సహాయం చేశారు. ఎంతోమంది స్వచ్చంధంగా ముందుకు వచ్చి నిరుపేదలకు అండగా నిలిచారు. అలాగే మనుషులకి గడప దాటకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉండచ్చని రుజువుచేసింది….

అనుకోకుండా , అదేసమయం లో వచ్చిన తన స్నేహితుని (వెంకటాద్రి) కాల్  చూసి ఇంకా ఆనందం వేసింది .

వేంకటాద్రి :  ఎలా ఉన్నావురా సింహాద్రి , చాలా రోజులయ్యుంది

సింహాద్రి : బానేఉన్నాం రా ,  నువ్వు రాసిన లెటర్ ఇప్పుడే చదువుతున్నా .

వేంకటాద్రి :అవునా , నేను  రెండేళ్ళ కితమే రాశారా… అదిప్పుడు అందింది నీకు.

సింహాద్రి : పొనీలేరా , ఇప్పటికైనా అందింది .  ఏరా ఎలాఉన్నావ్?  అప్పటికీ ఇప్పటికీ ఏదైనా మార్పు వచ్చిందా అక్కడ? .

వెంకటాద్రి : అప్పుడు మైసూర్ పాక్ చేయడం వచ్చింది .ఇప్పుడు మొత్తానికి పూత రేకులు చేయడం వచ్చేసింది. మిగతావి అంతా సేమ్. బయటికి వెళ్తే మూతికి మాస్కు  , ఇంటికి వస్తే  చేతికి సబ్బు. అక్కడెలా ఉన్నారు మనవాళ్లు ?

సింహాద్రి : ఇప్పుడు బయట పిజ్జాలు తేవట్లేదురా …మా పిల్లలు నేను చేసిన  పిజ్జా తప్పా  ఇంకోటి తినరు.  మిగతావి అంతా సేమ్.బయటికి వెళ్తే మూతికి మాస్కు, ఇంటికి వస్తే  చేతికి సబ్బు.

***********************************************************************

నోట్:ఇది కేవలం కల్పిత కథ. పాత్రలు, పాత్రధారులు కూడా కల్పితం. ఎవరినీ ఉద్దేశించినది కాదు.

కొరోనా వైరస్ చాలా ప్రమాదకరం. దానికి గూగుల్ లోఉండే పిచాయ్ అయినా నూడుల్స్ వండే  దేశాయ్ అయినా ఒకటే .

బయటికి వెళ్తే  పేస్ మాస్కు, ఇంటికివస్తే సబ్బుతో  చేతులు రుద్దుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం

*************************************************************************

ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s