గ్యాస్  బండ కిట్టయ్య

గుండె నిండా మొండి ధైర్యానెట్టుకుని , సైకిల్ వెనకాల గ్యాస్ బండల ని కట్టుకుని ఫుల్ సిలెండర్ తేవడానికి ముమ్మిడివరం వెళ్తున్నాడు కిట్టయ్య . అప్పటికే దుమ్ము పట్టిన సైకిల్ ని గుడ్డ ముక్క తో తుడిచేసి , చక్రాల్లో కొంత ఆయిల్ పోసి కొత్త సైకిల్ లాగ రెడీ చేసేసాడు.

“ఇదిగో ముమ్మిడారం  దాకా ఏళ్లొస్తా”  అని తన భార్యకి చెప్పి సైకిల్  ఎక్కపోతుంటే  “సరేలే ఎండక్కకుండా  వచ్చేసే ” అని ఇంట్లో నుంచే జాగ్రత్తలు చెప్పింది కిట్టయ్య భార్య . “అలాగే లే” అని సైకిల్ కి గ్యాస్ బుక్ లున్న  సంచి తగిలించి ,  స్టాండ్ తీసి మెల్లగా సైకిల్ ఎక్కి బయల్దేరాడు కిట్టయ్య .

ఎండాకాలం కావడం తో మండే సూరీడు కొంచం పెందలాడే  వచ్చేసి  తన  ప్రతాపాన్ని తెగ పెదర్శిస్తున్నాడు. వెళ్తున్న దారిలో కనపడే వాళ్లని నవ్వుతా పలకరిస్తూ,  ముమ్మిడారం కి వెళ్తున్నాడు కిట్టయ్య .

అప్పుడే కాఫి  హోటల్లో లోపల టిఫిన్ తినేసి బయట రోడ్డు పక్కన చేతులు కడుక్కుంటూ కిట్టయ్య ని చూసి అడిగాడు సత్యనారాయణ, “కిట్టయ్యా మంచి ఎండలో బయలు  దేరావ్ ముమ్మిడోర మేనా”  అని . “అవును నారాయణా” అని ఒకసారి సిలెండర్ తాడు గట్టిగా ఉందో లేదో అని వెనక్కి చూసి,  మెల్లగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కిట్టయ్య.

****************

ఊళ్ళో  అందరూ కిట్టయ్య  ని “గ్యాస్  బండ కిట్టయ్య ” అని పిలిచేవారు . కొంతమంది  చనువు గా ఉండే వాళ్ళు ‘కిట్టిగా ‘ అని కూడా  పిలిచేవారు . “ఇదిగో  కిట్టయ్యా  చూత్తుంటే ఈ సిలెండర్  ఇయ్యాలో రేపో  అయిపోయేలా ఉంది , ఇంటికి మా ఇయ్యాలోరు  వస్తున్నారు . గబాల్న ముమ్మిడారం వెళ్లి  ఫుల్  బండని తీసుకొచ్చే , ఇదిగో గ్యాస్ డబ్బులు, అలాగే వస్తూ  కాఫీ హోటెల్లో టీ తాగడానికి చిల్లర” అంటూ కోటయ్య, కిట్టయ్య  కి ఖాళీ  సిలెండర్ ఇచ్చాడు. “దానికేముంది  అండి , ఎలాగ  ధర్మారం గారి  ఫుల్ సిలెండర్ తేవడానికి వెళ్తున్నా, చెరోటీ కట్టేసి పట్టు కొచ్చేత్తా ” అని భరోసా ఇచ్చాడు కిట్టయ్య .

“కిట్టయ్యా ,  “పక్కాయన కి స్పేర్ సిలెండర్ ఉంది కానీ , నీకు తెలుసు కదా మా ఇద్దరికీ మాటల్లేవు , ఏదోటి చేసి ఆయనకి నచ్చజెప్పి, నా పేరు చెప్పకుండా ఆ సిలెండర్ తెచ్చేవయ్యా బాబూ.. నీకు పుణ్యం ఉంటుంది ” అని అన్నాడు రాజన్న దీనం గా మొహం పెట్టి . కిట్టయ్య కి జాలి వేసి ” అలాగే అండి  ఏదోటి  చేసేత్తా లెండి ”  అని  అనడం తో  ఆ మాటకి రాజన్న, కిట్టయ్య చేతులు పట్టేసుకున్నాడు నవ్వుతా.

కిట్టయ్య కి సిలెండర్ పని లేకపోతె, ఊళ్ళో ఇంకో  పని ఏదైనా చేస్తూ, జనాల తలలో నాలుక లా ఉండేవాడు . కిట్టయ్య కి జరమొచ్చి  కనపడక పోతే  ఊరంతా గగ్గోలు  పెట్టేసేవారు . కిట్టయ్య వంట్లో నలత గా ఉందని కొంత , వాళ్ళ ఇంట్లో వంట కి ఇబ్బంది అవుతుందేమో  అని మరి కొంత.

గాలి వానకి ఊరంతా అతలాకుతం అయిపోతే , ఊళ్ళో వాళ్ళతో పాటు కిట్టయ్య కూడా ఊరు మామూలు గా అవడానికి చాలా కష్ట  పడ్డాడు. కొన్నాళ్ళు గ్యాస్ సిలెండర్ తేవడానికి డబ్బులు కూడా తీసుకోలేదు.

“ఏరా కిట్టి గా, ఎంత కాలం ఇలా సిలెండర్ లు మోస్తావు రా, ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు కదరా” అని తనకి కావాల్సిన వాళ్ళు అంటే, “ఇయ్యాల రేపే ఇలాంటి పనులు ఉంటాయి మనకి, తరువాత ఎప్పుడో ఆ సిలెండర్ లు లారీ లోనో  ట్రాక్టర్ లోనో ఇంటి ఇంటికి తెచ్చేసే  రోజులు వస్తాయి” అని అడిగిన వాళ్ళకి నవ్వుతూ చెప్తూ ఉండే వాడు కిట్టయ్య .

**************************

కొంతకాలం ముందట ,కుంపటి లో బొగ్గులు వేసి వేసి, కింద మంట వచ్చే వరకు ఊదుతూ, ఎప్పడు వంట  అవుతుందో అని కుంపటిని  మసిబారిన ముఖం తో చూస్తూ, వంట వండే మగువలు. పొలం లోకో, పొరుగూరికో  కొంచం పెందలాడే తినేసి వెల్దామనుకుని, ఆ కుంపటి ని చూస్తూ కుత కుత లాడిపోయే మగాళ్లు .

మెల్లగా కాలం మారి, ఊళ్ళో  చాలామంది కుంపటి , నూతన్ స్టవ్ నుంచి గ్యాస్ స్టవ్ కి మారే రోజులు రావడం తో ఇళ్ళల్లో వంటలన్నీ గ్యాస్ మీద నడుస్తున్నాయి.  ఇంట్లోకి కొత్త గ్యాస్ కనెక్షన్ ఇస్తే , ఊరంతా  ఒకసారి వచ్చి చూసి ముచ్చటపడే రోజులు అవి .

తరువాత ఊళ్ళో జనాలు సిలెండర్ కోసం సైకిల్ మీద ముమ్మిడారం వెళ్లి ఫుల్ సిలెండర్ ని సైకిల్ వెనకాల కారేజీకి పెట్టి , సిలెండర్ కదలకుండా గోనెసంచి చుట్టి , దానికి పెద్ద చేంతాడు పకడ్బంధీ గా కట్టి, కష్టపడీ తీసుకొస్తున్నారు.

ఊళ్లోకి  కి అప్పుడే వచ్చిన కిట్టయ్య ఇదంతా చూసి ,  “ఆ కష్టమేదో నేనే  పడతాను, నా సైకిల్ కి గ్యాస్ బండలు చెరోటీ  అటూ ఇటూ తగిలించేస్తాను.కాపోతే సిలెండర్ తేవడానికి మీకు తోచింది ఇవ్వండి  చాలు” అని ఒకరిద్దరు దెగ్గర అనడం తో  వాళ్లకి తెగ నచ్చేసి , “ఊరులోఎవరకి అవసరమొచ్చినా నీదేరా కిట్టిగా” అనేసారు. అప్పటు నుంచి కిట్టయ్య  గ్యాస్ సిలెండర్ కిట్టయ్య అయ్యాడు.

కిట్టయ్య చూడ్డానికి సన్నగా ఉన్నా , చాలా మొండోడు. గ్యాస్ బండ ని అమాంతం గాఎత్తేసి అడిగినోళ్ళింట్లో  వంటింట్లో పెట్టేసి, రెగ్గులేటర్ ని కలిపేసి , గ్యాస్  వెలిగేవరకు దెగ్గరఉండి  ఏ లీకు లేకుండా చూసుకుని అప్పుడు వెళ్లేవాడు.

****************************************

సైకిల్ మీద ముమ్మిడారం వెళ్తున్న కిట్టయ్యకి  బొండాయికోడు దాటిన తరువాత కొంచం తల తిరగడం అని అనిపిస్తే , పక్కనేవున్న సోడా బడ్డీ  దెగ్గర కెళ్ళి , గోళీసోడా కొట్టమ్మనాడు. “అలాగే కిట్టయ్యా , కొంచెం  నీడలోకి వచ్చి నిలబడు” అని అన్నాడు సోడా బడ్డీ సుందరయ్యా . ‘అలాగే’ అంటూవచ్చి సోడా తాగేసి, జేబులోంచి చిల్లర తీస్తూ కింద పడిపోయాడు….

***********

కింద పడిన చిల్లర నేల మీద పడి గిరగిరా తిరుగుతున్నాయి. సోడా బడ్డీ సుందరయ్య కి నోటిమాట రావడం లేదు .

చుట్టుపక్క జనాలు అంతా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. “ఎండ లో  వడ దెబ్బ కొట్టేసి ఉంటుంది, కొంచం చల్లటి నీళ్లు మొహం మీద కొట్టండి. మన కిట్టయ్య లేచి కూర్చుంటాడు” అని కిట్టయ్య కి తెలిసిన ఒక పెద్ద మనిషి  అంటున్నాడు.

నీళ్లు మొహం మీద గుమ్మరిస్తున్నారు , లే… లే కిట్టయ్యా  అని అరుస్తూనేఉన్నారు … కింద పడిన చిల్లర కదలకుండా  నేలకి అంటిపెట్టుకునే ఉన్నాయి. సైకిల్  క్యారేజ్ కి కట్టిన గ్యాస్ బండలు కూడా సైకిల్ కి అంటిపెట్టుకునే ఉన్నాయి.

****************

ఆవిషయం తెలిసిన వెంటనే ఊరంతా స్తంభించింది . “ఎప్పుడూ మనతోటి ఉండే కిట్టయ్య ఇక లేడు” అనేది జీర్ణించుకోలేక పోయారు

*****************

రోజులు గడుస్తున్నాయి ……సంవత్సరాలు  పరిగెడుతున్నాయి .

*************

ఊళ్ళో కి పెద్ద లారీ హార్న్  వేసుకుంటూ వస్తోంది. లారీ  వెనకాల బోల్డన్ని సిలెండర్ లు కట్టేసి ఉన్నాయి. లారీ లో నుంచి ఒక కుర్రాడు దిగుతూ “మీరు ఫోన్ లో బుక్ చేసారు కదా ! సిలెండర్ ఇదిగోండి అంటూ ఇంటిగుమ్మం ముందు పెట్టీసి వెళ్ళిపోయాడు . లారీ దుమ్ము లేపుకుంటూవెళ్లిపోయింది. బయట ఇంటి గుమ్మంలో పెట్టిన సిలెండర్ ని లోపల కిచెన్లో కి  మోసికెళ్తూ , కిట్టయ్య ని ఓసారి గుర్తు చేసుకున్నాడు రాజన్న.

****************************************

ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s