అప్పుడు అలాగ …ఇప్పుడు ఇలాగ

ఇంకా టీవీ ఏంటెన్నా లు అక్కడక్కడా కనపడే రోజులు, అలాగే సమయం సందర్భం లేకుండా కరెంట్ తీసేసే సమయం 

సిగరెట్టు పొగలు దట్టం గా గాల్లోకి సుడులు సుడులు గా తిరుగుతున్నాయి. అక్కడ హాళ్ళో కూర్చున్న పిల్లలూ, పెద్దలూ అటువైపే చూస్తున్నారు.తరువాత ఏమి జరుగుతుందా అని. ఈ లోపులో టపీమని కరెంట్ పోయింది. చూస్తున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా అరిచారు. దూరం గా ఒకడు పరిగెత్తుకుంటూ ఆయాస పడుతూ ఈ ఇంటికి వస్తున్నాడు. ఆయాసపడుతూ చెప్తున్నాడు “ఇప్పుడే లైన్ మాన్ నిచ్చినేసుకుని ఆ వీధి లో కి వెళ్తున్నాడు, బహుశా అతడే కరెంట్ తీసేసి ఉంటాడేమో అని అన్నాడు. అక్కడున్న వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. “రండి రా వెళ్దాం” అంటూ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ తీసి సైకిల్ సీట్ మీద ఒకడు, ముందర కడ్డీ మీద ఇంకోడు, వెనకాల క్యారేజీ మీద మరొకడు తొక్కుకుంటూ “అసలు ఎవడు ఈ టైం లో కరెంట్ తీసాడు” అని అడిగి కడిగి పడేద్దామని ఆవేశం గా బయలుదేరారు.

వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి , ఆ వ్యక్తి సైకిల్ కి నిచ్చెన కట్టుకుని కొబ్బరి తోటలో కి వెళ్లడం తో “ఎహె ఇతను లైన్ మాన్ కాదు. కొబ్బరి కాయలు దింపులు తీయడానికి తోటలోకి వెళ్తున్నాడు” అని గ్రహించి , “ఎవడు చెప్పాడో వాడి పని పడదాం” అనుకుని మళ్ళి సైకిల్ వేసుకుని బయలుదేరారు. కరెంట్ ఇక్కడ కాదంట , “బొమ్మూరు లో పెద్ద ట్రాన్సఫార్మర్ పేలి పోయిందిట, ఇయ్యాల ఇంకా రాదు ట” అని అంతక ముందర చెప్పినాడే సైకిల్ మీద వెళ్ళిపోతూ చావు కబురు చల్లగా చెప్పాడు. “కరెంట్ ఎలాగ లేదు, రండిఎహె క్రికెట్ ఆడుకుందాం” అని ఎవడో చెప్పడం తో కుర్రాళ్లందరూ వికెట్ లు, బాట్, బాల్ పట్టుకుని సంత పాకల మీదుగా హై స్కూల్ కి వెళ్తున్నారు.

*******

ఒక అర్ధ రూపాయి కోయిన్ గాల్లో కి యెగిరి తిరుగుతోంది. అక్కడున్న అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. కాయిన్ కింద పడి బొమ్మ పడితే బాటింగ్ చేద్దామని రాంబాబు అనుకున్నాడు. కానీ అది బొరుసు పడడం తో “కాయిన్ సరిగా గిర గిరా తిరగలేదు” మళ్ళీ కాయిన్ వేయమన్నాడు. “లేదు లేదు” అని అటుపక్క టీం జనాలు గొడవ చేస్తున్నారు. రెండో సారి మళ్ళీ కోయిన్ గాల్లో కి ఎగిరింది.ఈ సారి కాయిన్ మళ్ళీ బొరుసు పడింది. “లేదు లేదు మూడో సారి వెయ్యాలి. మూడోసారి ముత్యం. ఇదిగో !ప్రభాకర్ ఈ సారి, కాయిన్ కిందపడిన వెంటనే, నీ కోయిన్ తీసేసుకో” అని ఆదేశమిచ్చాడు రాంబాబు. దీన్ని కొన్ని ఊళ్ళల్లో “గొని” అంటారని రాంబాబు వాళ్ళింటికొచ్చిన చుట్టాలబ్బాయి చెప్పాడు. మరి కొంతమంది “తొండి” కూడా అంటారని ఆ తరువాత తెలిసింది. మొత్తానికి మూడోసారి బొమ్మ పడటం, ప్రభాకర్ కోయిన్ తీసేసుకుని జేబులో పెట్టేసుకోవడం జరిగిపోయాయి.

అటుపక్క టీం ఇక చేసేదేమి లేక బాల్ పుచుకుని బౌలింగ్ వేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి మొదట టీం బాటింగ్ అయ్యింది. బౌలింగ్ వేసి వేసి అలిసి అలిసి విసిగిపోయిన రెండో టీం బాటింగ్ కి రెడీ అవుతున్నారు.”మొదట ఓపెనర్ గా ఎవడు” అని డిసైడ్ చేసుకోలేక పంటలు వేయమన్నాడు శీను . మొదట బాటింగ్ చేద్దామనుకున్న ముగ్గురు చేతులు పట్టుకుని పంట వేయడం మొదలెట్టారు. ఆ పంట లో మిగతా ఇద్దరికన్నా భిన్నం గా చేయి వేయడం తో శీను నెగ్గాడు. మొత్తానికి మొదట బాటింగ్ వచ్చిందని చేతికి గ్లోవ్స్ ,కాళ్ళ కి పాడ్ పట్టుకుని క్రీజ్ లో కి అంతులేని ఉత్సాహం తో వెడుతున్నాడు శీను. అటుపక్క బాల్ పుచ్చుకుని స్పిన్ చేద్దామని రాంబాబు రెడీ అవుతున్నాడు.

దూరం గా సైకిల్ మీద ఒక వ్యక్తి గ్రౌండ్ లో కి రావడం కనిపిస్తోంది. అతని మాటలు దగ్గెరవుతున్నాయి. “కరెంట్ వచ్చేసింది ట” “కరెంట్ వచ్చేసింది ట” అని ఆయాస పడుతూ సైకిల్ దిగకుండానే అరుస్తున్నాడు. ఇది విన్న వెంటనే బాల్ ని పక్కన పడేసి అతని సైకిల్ ఎక్కేసి ఊళ్ళో కి తుర్రున పారిపోయాడు రాంబాబు .మొదట ఇన్నింగ్స్ ఆడేసి ఫీల్డింగ్ చేస్తున్న కుర్రాళ్ళు కూడా పరిగెత్తు కుంటూ వెళ్లిపోయారు. అటుపక్క రన్నర్ గా నించుని, బ్యాట్సమెన్ సింగల్ కొడితే, పరిగెత్తడానికి సిద్ధం గా వుండి బాటింగ్ చేసేద్దామనుకున్న ఇంకో కుర్రాడు, “మొదట ఇన్నింగ్స్ లో బౌలింగ్ ఎలాగ ఇవ్వలేదు, వీళ్లిద్దరి లో ఎవడో ఒకడు త్వరగా అవుట్ అయిపోతే , హ్యాపీ గా ఫస్ట్ డౌన్ దిగేద్దామని” వెయిట్ చేస్తున్న ఇంకోడు, ఇలాగ బౌలింగ్ వేసిన బ్యాచ్ చేసేదేమి లేక పాడ్ లు, వికెట్ లు పట్టుకుని సంత పాకల మీదుగా ఇంటికి తిరుగు ముఖం పెట్టారు.

******

మళ్ళీ అందరూ పోగయ్యారు హాళ్ళో టీవీ చూడ్డానికి. అప్పుడే కపిల్ దేవ్ బౌలింగ్ లో జావేద్ మియాందాద్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాల్ ఈలలతో, చప్పట్లతో మోత మోగి పొయ్యింది. ఆ టైం లో టీవీ చూస్తూ ఒక పిల్లగాడు ఆవలిస్తున్నాడు. “ఒరేయి నువ్వు ఆవలిస్తూనే ఉండరా ఈ మ్యాచ్ అయ్యేవరకు , ఇంకో వికెట్ పడుద్దేమో” అని కుర్చీ లో ముందరకే టెన్షన్ తో కూచుని ఉన్న సూరి ఆ కుర్రాడి తో అన్నాడు. వాడు నోరు తెరిచి ఆవలిస్తూనే ఉన్నాడు, మరో వికెట్ పడుతుందేమో అని. అలాగ క్రికెట్ మ్యాచ్ లు చూడ్డానికి అందరూ కలిసి టీవీ ఉన్న ఇంట్లో కెళ్ళి మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు

**********

టీవీ ఏంటెన్నా లు కొబ్బరిచెట్లతో పోటీ పడి మరీ కనపడే రోజులు, అప్పటిలాగానే సమయం సందర్భం లేకుండా కరెంట్ తీసేసే సమయం

రోజులు గడుస్తున్నాయి….కాలం కపిల్ దేవ్ బంతి లా ఫాస్ట్ గా తిరుగుతోంది. అందరి ఇంటి పెరట్లో ఏంటెన్నా లు కొబ్బరి చెట్లతో పోటీ పడీ మరీ నిలిచి ఉన్నాయి. ఎప్పుడూ చెట్ల మీదో, ఇంటి పై కప్పుల మీదో వాలే పక్షులు చక్కగా ఏంటెన్నా ల మీద వాలి ఉయ్యాల జంపాలా ఆడుకుంటున్నాయి.

“మా టీవీ లో బొమ్మల కన్నా చుక్కలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి అని ఒకడు . “మా టీవీ లో సౌండ్ వినిపిస్తోంది, బొమ్మ రావట్లేదు అని వాపోతున్నాడు మరొకడు. యాంటెన్నా లు ఇటుతిప్పి, ఎటు తిప్పినా చుక్కలు, ఆ చుక్కల్లో చంద్రుడు లాగా వార్తలు చదివే శాంతి స్వరూప్.

ఇంట్లో టీవీ లు అయితే దిష్టి బొమ్మల్లా టేబుల్ మీద కూర్చున్నాయి .బయట యాంటెన్నా లు రేవు లో తాడి చెట్లలా ఉన్నాయి. మనకి టీవీ చూసే భాగ్యం లేదా అని అందరూ విసుక్కుంటూ, చుక్కల్లోనే అప్పటి యాంకర్ చెప్పే “ఉదయం ఉదయం ప్రసారాలు, మధ్యాన్నం -మధ్యాన్న ప్రసారాలు” లు వింటూ ఎవడైనా వచ్చి బావు చేత్తే బావుండును అని అనుకుంటున్నారు.

****

దూరం గా సన్నటి వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. చూడ్డానికి శివ లో నాగార్జున లాగా ఉన్నాడు. సైకిల్ స్టాండ్ వేసాడు. కింద కి వంగి నాగార్జున లాగ సైకిల్ చైన్ తీయకుండా, సంచి లోంచి స్క్రూ డ్రైవర్ తీసాడు .ఇంకో చేతిలో రెంచు పట్టుకుని, నోటిలో స్క్రూ డ్రైవర్ పట్టుకుని చకచకా గోడ ఎక్కేసాడు ఏంటెన్నా ని ఫిక్స్ చేయడానికి. “హమ్మయ్య డాట్రు గారి సత్తిబాబు వచ్చేసాడు” ఇక టీవీ లో బొమ్మ కనపడుద్ది అని టీవీ ఆన్ చేయడానికి లోపలకెళ్ళాడు అప్పటిదాకా చుక్కల్లో వికెట్ లని లెక్కెట్టుకుంటున్న ఒకడు. సత్తిబాబు వచ్చేసాడు అని తెలుసుకున్న ఇంకోడు సైకిల్ ఎక్కి వచ్చేసి గోడమీద ఉండి ఫిక్స్ చేస్తున్న సత్తిబాబుని “ఏవయ్యా సత్తిబాబు ఇక్కడ బిగించేసి గొమ్ముని వచ్చేవయ్యా బాబు, టీవీ సరిగా చూసి చాలా రోజులయ్యింది ” అని అనేసి తుర్రున సైకిల్ ఎక్కి వాళ్ళఇంటికి వెళ్ళిపోయాడు సత్తి బాబు కి ఘన స్వాగతం చెప్పడానికి. మొత్తానికి అందరి ఇళ్లల్లో ఏంటెన్నా లు ఫిక్స్ చేసేసి చుక్కలు లేని టీవీ లో బొమ్మల్ని చక్కగా రావడానికి సత్తిబాబు చుక్కాని అయ్యాడు.

ఇంటికెళ్లిన సత్తిబాబు ఆలోచిస్తున్నాడు. తరువాత ఏమి చేస్తే బావుంటుంది అని.

***************

యాంటెన్నా గొట్టాలని బట్టలు ఆరేసేందుకు ఉపయోగపడే సమయం

రోజులు దూసుకెళ్తున్నాయి. కాలం మారుతోంది. ఎప్పుడో టీవీ లో వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చే సినిమా లు కాదు.ప్రతి రోజు వస్తే యెంత బావుంటుంది అని, మనకు కావలసిన సినిమా లు వేస్తె ఇంకా సూపర్ అనుకునే రోజులు.

ఒక ఇంటి పై కప్పు మీద పెద్ద డిష్ ఉంది. ఇంట్లో కట్టలు కట్టలు గా కేబుల్ వైర్లు. ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళు ఇంటింటికి వెళ్లి కేబుల్ కనెక్షన్ ఇస్తున్నారు .అప్పటికే అందరి ఇంట్లో నల్లటి కేబుల్ వైర్లు టీవీ తో కనెక్ట్ అయ్యిపోయి ఉన్నాయి. రోజుకి కావలసిన సినిమాలు వేసేస్తున్నారు.

మెల్లగా ఛానెల్స్ కూడా వస్తున్నాయ్. ఈ టీవీ మీ టీవీ అని, ఈ కేబుల్ మీ కేబుల్ అంటూ ఒక ఛానల్, రెండు, మూడు. ..మెల్లగా మెల్లగా లెక్కలేని ఛానెల్స్ . బోల్డన్ని సినిమాలు. చానెల్స్ లో సీరియల్స్ .

*****

రాత్రి సమయం 7 గంటలు. ఊరు బయట అంతా నిశ్శబ్దం. ఒక ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. ” నువ్వు బతకాలంటే, ఇక్కడనుంచి వెంటనే వెళ్ళిపో ” అని. ఇంకో ఇంట్లో ” నిన్ను చంపకపోతే నా పేరు అఖిలాండేశ్వరి కాదు” అని. ఇంకో ఇంట్లో కూడా ఇంచు మించు అలాంటివే. ఇవన్నీ ఎవరింట్లో గొడవలు కావు . టీవీ సీరియల్స్ లో అరుపులు.

***********

ఫోన్ లోనే ప్రపంచాన్ని చూస్తూ, పక్కన ఏమి జరుగుతుందో తెలియని రోజులు :

పెద్ద పెద్ద టీవీ లు. టీవీ లో బోల్డన్ని ఛానెల్స్. ఛానెల్స్ లో లెక్కలేని మరియు అంతం లేని సీరియల్స్.

పెద్ద పెద్ద సెల్ ఫోన్లు . ఫోన్లలోనే ప్రపంచికం. ఆ ప్రపంచికం చుట్టూతా పిల్లలూ , పెద్దలూ.

హల్లో కూర్చుని చేతి లో మొబైల్ పట్టుకుని టీవీ లో వస్తున్న క్రికెట్ ని చూస్తున్నాడు ఒక కుర్రోడు. టపీమని కరెంట్ పోయింది. “రేయ్ ఆడుకుందాం వస్తావా” అని పక్క ఇంట్లో ఉంటున్న ఇంకో కుర్రోడుకి వాట్స్అప్ చేసాడు . “ఇదిగో వచ్చేస్తున్నా రా” అని అతను రిప్లై ఇచ్చాడు. మూడో కుర్రాడు కూడా “నేను కూడా వస్తున్నా” అని వీళ్ళ తో వచ్చి చేరాడు. ముగ్గురు కలిశారు. ఒక చోట కి చేరారు . ముగ్గురూ జేబులో నుంచి సెల్ ఫోన్ లు తీశారు. మొదలెట్టారు సెల్ లో గేమ్ లు.

*******************************

ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s