రథ యాత్ర-1 (అనాతవరం దేవుడి పెళ్లి కథ)

పుట్టి , పెరిగిన ఊరంటే ఇష్టం లేని వారుండరు. ఆ ఇష్టాన్ని, ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని , అప్పటి జరిగిన విషయాలని ఒక కథ రూపం లో మలిచి పుట్టి పెరిగిన ఊరు ని తలచుకుంటూ, మీ ముందు ఒక చారిత్రాత్మక కథ ” రథ యాత్ర ” (అనాతవరం దేవుడి పెళ్లి కథ) .

*******************

పైరగాలికి ఊగుతూ, పలకరించే పచ్చని పొలాలు ఒక పక్క , అంత ఎత్తు నుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించే కొబ్బరి చెట్లు ఇంకో పక్క. వీటీలి మధ్య నున్న చిన్న రోడ్డు మీద ఝాట్కా బండి టక టకా మని గుఱ్ఱాల గిట్టల శబ్దం తో పరిగెడుతోంది. ఝాట్కా బండి లో కూర్చున్న పెద్దమనిషి కి కొంచం దూరం లో తామరాకులతో, కలువపువ్వులతో నున్న ఒక పెద్ద చెఱువు కనపడింది .దాని పక్కనే ఆనుకున్న శివాలయాన్ని దూరం గా చూస్తూ, కొండంత యెత్తునున్న రధాన్ని చూస్తూ మైమరచిపోయాడు. ఆ వెళ్తున్న ఝాట్కా బండి లో ఆ పెద్దమనిషి వెనక వెనక తిరుగుతూ గుడి వైపు దండం పెట్టుకుని ఉంటుంటే , అతని అనుచరుల్లో ఒక అతను గొప్ప చరిత్ర కలిగిన ఆ ఊరి గురుంచి, ఆ ఊరిలో జరిగే దేవుడి పెళ్లి రధ యాత్ర గురుంచి పూస గుచ్చినట్లు చెప్తున్నాడు…..

సుమారు 300 సంవత్సరాల క్రిందట అనాతవరం చరిత్ర :

అనాతవరం. ఈ ఊరు ఒకప్పుడు అన్నార్తులని (కూడు,గూడు,బట్ట లేని వాళ్ళు ) తల్లి లా ఆదరించిన ఊరు . కాబట్టి ఈ ఊరి ని “అన్నార్తుల వరం” గా పిలుచుకునే వారు. కాల క్రమేణా ఈ ఊరు అనాతవరం గా ప్రసిద్ధి కెక్కింది.

బ్రిటిష్ వారి కాలం లో విజయనగర గజపతి రాజుల పరిధి లో ఈ అనాతవరం గ్రామం ఉండేది. వర్షాధార పంట లతో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉండేవారు.

కొంతకాలం తరువాత , ఈ “అన్నార్తుల వరానికి” ప్రకృతి పరీక్షించి శపించినట్టుగా కరువు తాండవం చేసింది. వర్షాలు పడలేదు . ఉన్న పంట పొలాలు నీరు లేక ఎండి పోయాయి. చుట్టుపక్కల చెరువులు లేవు. పంటలు పండక, తిండి లేక ప్రజలతోపాటు, పశువులు, పక్షులు కూడా ఈ కరువు వలలో చిక్కుకుని అల్లాడారు.

*****

గజపతి రాజుల అధికారుల నుంచి శిస్తు కట్టమని ఆదేశం వచ్చింది అనాతవరం గ్రామ ప్రజలకి. అప్పటికే గ్రామ ప్రజలు కరువు కి కట కట లాడుతుండగానే , పన్ను కట్టట్లేదని పన్ను వసూల్ చేయమని మరో పరీక్ష పెట్టారు, ఈ “అన్నార్తుల వరానికి”. ఒక పక్క కరువు తోనూ , ఇంకో పక్క శిస్తు కట్టాలని వచ్చిన ఆదేశాలతో తో ప్రజలు బెంబేలెత్తి పోయారు ఏమి చేయాలో తెలియక .

శిస్తులు వసూలు అవట్లేదని తెలుసుకుని ఇక లాభం లేదనుకుని ఆ గ్రామ లో నివసిస్తున్న మాంఛి దృఢ కాయుఁడైన “అనుపిండి మహా పాత్రుడు” అనే యువకుడి ని దివాన్ గా నియమించి, శిస్తులు ముక్కు పిండి వసూల్ చేసే లాగ అతనికి అధికారం ఇచ్చారు ఆ గజపతి రాజుల ప్రభుత్వ అధికారులు.

“అనుపిండి మహపాత్రుణ్ణి” నిజం గా ఆ దేవుడే మనిషి రూపం లో పంపించినట్టుగా, అతడు వసూల్ చేయవలసిన శిస్తు ను పక్కన పెట్టి, ఊరు కి తూర్పు వైపున పెద్ద చెరువుని తవ్వించాడు . ఈ చెరువు తవ్వించడం వలన చుట్టూ పక్కల ఉండే వ్యవసాయ భూమిలకి పుష్కలమైన నీరు దొరికింది. వ్యవసాయ భూమిలకి నీరు అందించే విషయం లో ఈ మహపాత్రుడు గంగను ఆకాశం నుంచి భూమి కి తెచ్చిన భగీరథుడు అంతటివాడు అయ్యాడు. ఆ చెరువు ని ఆ అపర భగీరధుడి పేరుతో “మహిపాత్రుని చెరువు” అని , తరువాత “మహీపాల చెరువు” అని , ఇంకా తరువాత “మా పాల చెరువు” తో ఆ గ్రామం అనాతవరం ప్రక్కనే ఉంటూ మహిపాత్రుని పేరు తో గర్వం గా ఇప్పటికీ పిలవబడుతోంది.

అంతే కాకుండా ఆ మహా పాత్రుడు ఊరి కి పడమర దిక్కున కూడా ఇంకో చెరువు ని తవ్వించాడు. ఆ చెరువు తవ్విస్తుండగా అతడికి శివ లింగం కనిపించింది. అతను ఆనందా ఆశ్చర్యాలతో ఉండగా..

********

అనాతవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరం లో “ముని కూడలి” (ఇప్పటి ముని పల్లి) అనే గ్రామం లో మునులు ఉంటూ ,తపస్సు చేసుకునే వారు. ఆ మునుల్లో జన్ను మహర్షి కి ఈ శివ లింగం గురించి తెలియడం తో హుటా హుటా న కాలినడకన బయలు దేరి అనాతవరం గ్రామానికి చేరుకున్నారు జన్ను మహర్షి . వేద మంత్రాలతో, ముని పుంగవలతో , ఆ ఊరి పడమర తవ్విన చెరువు పక్కన ఆయన శివ లింగం స్థాపించి, పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి గుడి ని ప్రతిస్థాపించారు. అదే ఇప్పుడు పెద్ద చెరువు పక్కన కనిపించే శివాలయం.

ఆ తరువాత కొంత కాలానికి శ్రీదేవి , భూదేవి సమేత కేశవ స్వామి గుడిని (విష్ణాలయం) ని కూడా ప్రతిస్థాపించారు.

మొదట్లో శివాలయం ప్రధానార్చకులు గా శ్రీ వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారు, విష్ణాలయం ప్రధానార్చకులు గా శ్రీ అంగర శింగరా చార్యులు సేవలు చేసారు.

************************

కొంత కాలానికి అనాతవరం గ్రామం పిఠాపురం మహారాజు స్వాధీనం లో కి వచ్చింది. మరికొంత కాలానికి పిఠాపురం సామ్రాజ్యం లో నున్న కొన్ని గ్రామాలని అమ్మివేయడం తో భీమన పల్లి జమీందార్ శిరంగు సత్తిరాజు గారు, అనాతవరం గ్రామం ని కొనుగోలు చేసారు .ఆ తరువాత శిస్తులు వసూలు చేసే అధికారం ఆయనకి వచ్చింది.

భారత దేశానికీ స్వతంత్రం వచ్చిన తరువాత జమిందారీ వ్యవస్థ రద్దు అయ్యి , అనాతవరం భారత దేశ ప్రభుత్వం లో విలీనం అయ్యింది.

**********************

ఆ ఝాట్కా బండి లో పెద్ద మనిషి, అనాతవర చరిత్రని ఆతృతగా గా వింటూ, దేవుడి పెళ్లి చరిత్ర ని కూడా చెప్పమనడం తో అతని అనుచరుడు , సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుడి పెళ్లి గురించి చెప్తూ :

దేవుడి పెళ్లి : సుమారు 1935 నుంచి 1954 మధ్యన (ఊరికి ఇంకా కరెంట్ రాని సమయం ):

ఇంకా ఎడిసన్ కనిపెట్టిన బలుబు ఊళ్ళో వెలగట్లేదు. పక్షులు అప్పటికింకా చెట్లు మీద, ఇళ్ల కప్పుల మీదే వాలుతున్నాయి. గ్రామ ప్రజలు రాత్రిళ్ళు దీపం బుడ్డిలతో, హరికేను లాంతరులతో జీవనం సాగిస్తున్నారు. 

సందె పడుతోంది. పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. దూరం గా ఆవుదూడ పాలు తాగడం కోసం “అంబా ” అని అరుస్తోంది .ఇళ్లలో ఆడవాళ్లు మసిబారిన దీపం బుడ్డి లని, హరికేను లాంతర్లను తుడుచుకుంటూ వత్తులేస్త్తున్నారు . అప్పుడే పొలం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చిన మగవాళ్లు పెరట్లో కాళ్ళు, చేతులు కడుక్కుని సేద తీరుతున్నారు. అలాగే పొలం నుంచి సైకిల్ మీద వచ్చిన వాళ్ళు, సైకిల్ ని ఒక చేత్తో మోస్తూ, ఇంటిలో నున్న వీధి గది లో పెట్టి, స్టాండ్ వేసి, స్నానం చేయడానికి పెరట్లో నుయ్యి దగ్గెర కి వెళ్తున్నారు.వీధుల బయట చిమ్మ చీకటి గా ఉంది. దీపం బుడ్డిలని వెలిగించి, ఆకులో అన్నం పెట్టి వడ్డిస్తూన్నారు ఆడవాళ్లు.

********

వేసవి కాలం,వైశాఖ మాసం .అక్కడున్న వారిలో భక్తి ఉప్పొంగుతోంది. వీధులన్నీ “హర హర మహా దేవా! శంభో శంఖరా ” నినాదాలతో మార్మోగుతున్నాయి. ఒక పెద్ద రథం ఠీవీ గా వీధుల వెంట నడుస్తోంది. రథం లాగుతూ కొంతమంది, రథం లో దేవతా మూర్తి లని చూస్తూ కొంతమంది మురిసిపోతున్నారు. రథం దెగ్గర ఉన్న పెద్ద వాళ్ళు ఒక్కసారి “అశ్శరభ శరభ “అంటూ ఉంటే , అక్కడున్న యువత కూడా వాళ్లతో గొంతు కలిపి ‘అశ్శరభ శరభ’ అంటూ ఉండగా, వీధులన్నీ భక్తి తో పులకరిస్తున్నాయి. పాలు తాగుతున్న లేగ దూడ కి ,తల్లి ఆవు “తాగడం ఆపి,ఒక్కసారి ఆ రధాన్ని చూడు” అని చెప్పినట్టు గా ఆ ఆవులు రథం వంక మెడ ఎత్తి మరీ మరీ చూస్తున్నాయి….

*******

“అమ్మా అమ్మా”ఈ రోజు దేవుడి పెళ్లి టకదా ,కొండంత ఎత్తు ఉన్న పెద్ద రథం మన వీధి కి వస్తుంది ట , నేను రథం ఎక్కుతా, ఎక్కుతా” అని ఏడుస్తూ అమ్మని త్వరగా అన్నం పెట్టమని తొందర చేస్తున్నాడు ఒక చిన్న కుర్రవాడు. అప్పటికే అతడి స్నేహితులు తయారయ్యి, రథం ఎప్పుడు ఆ వీధి లో కి వస్తుందా అని వెయ్యి కళ్ళ తో చూస్తున్నారు. మేళ తాళా లతో ఒక పెద్ద రథం ఠీవి గా నడిచి వస్తోంది.

సుమారు నలభై అడుగుల ఎత్తు ,ఆరడుగుల తో పెద్ద పెద్ద చక్రాలుటర్నింగ్ లో ఎడమ వైపు కు గాని , కుడి వైపు కు గాని సులువు గా తిరగడానికి దీర్ఘ చతురస్రాకారం లో ఉండే ఇనప డ్రైవింగ్ స్టీరింగ్, రధాన్ని లాగడానికి బలమైన పగ్గాలతో పూరీ జగన్నాధుని రధం ఈ అనాతవరం గ్రామం లో తిరుగుతోందా అన్నట్లు భ్రమింప చేసే బ్రహ్మాండమైన పెద్ద రధం ఠీవి గా వీధుల వెంట నడుస్తోంది.

*******

పౌర్ణమి దెగ్గర పడే రోజులు కావడం వలన, చంద్ర కాంతి తో వీధులన్నీ, స్పష్టం గానే కనిపిస్తున్నాయి. రధం లో నిలబెట్టిన పెద్ద పెద్ద కాగడాలతో, ప్రతీ ఇంటిలో నుంచి వచ్చే ఆ దీపం బుడ్డి వెలుగువలనో, హరికేను లాంతరువలనో లేదా కొంత వెన్నెల వలనో, రధం లో దేవుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు.

అప్పటికే పిల్లలతో కిక్కిరిసిపోయిన రధం లో “మా పిల్లాడు కి కూడా కొంచెం చోటు ఇవ్వండని” అడిగాడు ఒక తండ్రి . నలభై అడుగుల రధాన్ని కింద నుంచి చూస్తూ “నాకు రధం లో కూర్చోవడానికి చోటు దొరికింది” అని ఆ పిల్లాడి లో ఆనందం, ఆ రధం లో దేవత మూర్తిలని చూస్తూ ఆ తల్లి తండ్రులు, హరి హర నామ స్మరణలు , “అశ్శరభ శరభ ” లు తో వీధులన్నీ మార్మ్రోగిపోతున్నాయి.

రధం ముందర బుట్ట బొమ్మలు, ఇతర దేవతా వాహనాలు కదుల్తున్నాయి. రధం శివాలయం దగ్గెర మొదలయ్యి, విష్ణాలయం మీదుగా,ముత్యాలమ్మ తల్లి గుడి ని దాటుకుంటూ, కుమ్మరి వీధులకి కమ్మని కనువిందు చేసి, పెంటపాటి సుబ్బారావు గారి ఇంటి నుంచి పప్పు సూర్యనారాయణ గారి ఇంటి మీదుగా , కట్లమ్మ గుడి వద్ద రధాన్ని నిలిపారు . పల్లకీ మరియు దేవతా వాహనాలు మాత్రం మూడో వీధిలో కి వెళ్తున్నాయి .పేరి విస్సయ్య గారి ఇంటి మీదుగా వరాహభట్ల శంబన్న శాస్త్రి గారి ఇంటి పక్క నుంచి వెళ్తూ మూల గున్నయ్య గారిల్లు , అనుపిండి కృష్ణమూర్తి (కామేశ్వరావు గారి తండ్రి) గారి ఇళ్లను దాటుకుంటూ నూకల సుబ్బారావు గారి ఇంటి పక్క నుంచి, నూకల మాణిక్య శర్మగారిని , నూకల వెంకట్రావు గారు, గంటి ప్రకాశం మరియి బుచ్చి మాస్టర్ గారి ఇంటి వద్ద దేవతా వాహనాలు ఆగాయి.

అప్పుడే నూకల మాణిక్య శర్మ గారు (అప్పటి యువకుడు ) ఇంట్లో కెళ్ళి తన తల్లి అబ్బాయమ్మ ని అడిగి , మంచి నీళ్లు తీసుకొచ్చి అరుగు మీద పెట్టిన వెంటనే, అతని తమ్ముళ్లు శేషప్ప గారు, బుల్లయ్య గారు, దేవతావాహనాలు మోస్తున్న కుర్రాళ్ల అందరికీ ఇస్తున్నారు . అందరూ మంచి నీళ్లు తాగేసిన తరువాత పల్లకీ , వాహనాలతో తిరిగి పేరి విస్సయ్య గారి ఇంటి పక్కనుంచి రెండో వీధిలోకి బయలుదేరాయి.

రధం లాగే యువత అంతా కలిసి ఒక్కసారి “అశ్శరభ శరభ “అంటూ కట్లమ్మ గుడి దగ్గెర నిలిపిన రధాన్ని ఓరుగంటి చిన్నమాస్టర్ (అప్పారావు) గారి ఇంటి దగ్గెర ఆపారు .

*******

ఇంటింటి వద్ద వాయించే మేళ తాళాలతో , అప్పటి యువకుల రధ నినాదాలతో, రెండో వీధి మార్మ్రోగిపోతోంది. అక్కడనుంచి నూకల అగ్నిహోత్రుడు గారు ఇంటి పక్క నుంచి, నూకల సిద్ధాంతి గారి ఇంటిదాకా రధం మెల్లగా కదిలింది. సిద్ధాంతి గారి తమ్ముడు నూకల సూరి బాబు గారికి, “మంచి నీళ్లు తెచ్చి అరుగు మీద పెట్టు” అని రధం లాగుతున్న అనుపిండి రామూర్తి గారు, సూరిబాబు గారికి చెప్పారు. వెంటనే ఆయన వెళ్లి గుండుగ లో నీళ్లు పోసి అరుగు మీద పెట్టారు. యువకులు నీళ్లు తాగేసి రధాన్ని మెల్లగా అమ్మన్న గారి రామం గారిల్లు , అక్కడ నుంచి నూకల బుల్లి వెంకన్న గారి ఇంటి వద్ద ఆపారు. “దూరం గా చూస్తున్న నూకల బుల్లి వెంకన్న గారు రధం దగ్గెరకొచ్చి “ఒరేయి పిల్లలూ , మంచి నీళ్లు గుండిగలో ఉన్నాయి ,అక్కడ తాగనివాళ్ళు, రధం దిగి తాగండి” అంటూ గట్టి గా అరిచారు. ఒక్క ఉదుటున రధం లో కూర్చున్న పిల్లలు, వాళ్లతో వచ్చిన తండ్రులు, రధం లాగుతున్న యువకులు కూడా అక్కడ గుండిగ లో పెట్టిన నీళ్లను తాగారు.

తరువాత నూకల నారాయణ మూర్తి గారి ఇంటి పక్క నుంచి మూల వీధి సందు దగ్గెర రధం ఆగింది. కోట గేట్లో నుంచి అనుపిండి రామం గారు, వడ్లమాని సోమేశ్వరరావు గారు వచ్చి రథం పగ్గం పట్టుకున్నారు. అక్కడ నుంచి మెల్లగా పెద్ద రధం, ఆదిరాజు లక్ష్మణ మూర్తి గారు ఇంటి నుంచి తూము దగ్గెరకొచ్చి ఆగింది. అప్పటికే తోటకూర రామరాజు గారు, మునసబు బుచ్చి బాబు గారు వచ్చి రధాన్ని రెండో వీధి సందు నుంచి అనుపిండి రామూర్తి గారి సందులోకి పోనిచ్చారు. మాంచి ధృడ కాయుడైన అమ్మన్న గారి రామం గారి ని, పెద్దాయన తోటకూర నరసింహ రాజు గారిని రధం ముందర ఉంచి వాళ్లిద్దరూ చక్కగా బాలన్స్ చేసుకుంటూ ,ఐరన్ స్టీరింగ్ ద్వారా కుడి వైపుకి మెల్లగా తిప్పుతూ, నూకల విశ్వనాథం మాస్టర్ గారిల్లు, నూకల పప్పు వెంకన్న గారింటికి (సుబ్బారావు మాస్టర్ గారి తండ్రి) , అనుపిండి రామూర్తి గారి ఇంటి మధ్య రోడ్డు మీద రధం ఆపారు .ఎప్పుడైనా రథం ముందరకి కదలనప్పుడు, అనుపిండి కృష్ణమూర్తి గారు (కావుడి గారి తండ్రి ) మరియు వడ్లమాని పెద్ద సోమేశం గారు లు వాళ్ళ భుజాలతో తోస్తూ,రధాన్ని ముందరకి నడిపించడం లో మేము సైతం అనే వారు .రధం లాగుతున్న కుర్రాళ్లందరికి అనుపిండి రామూర్తి గారి ఇంటి దగ్గెర పెట్టిన పెద్ద గుండిగ లో మంచి నీళ్లు తాగడానికి సరఫరా చేసారు.

********

రధం మీద కూర్చుని పట్టుకున్న కాగడా దీపాలతో , ఒకటో వీధి మెరిసిపోతోంది. బుట్ట బొమ్మలు , దేవతా వాహనాలు రధం ముందర కదుల్తున్నాయి. రధం లాగుతున్న కుర్రాళ్ళు ఒక్కసారి రధం పగ్గాలు పట్టుకుని “అశ్శరభ శరభ” అని అరిచారు . రధం లో నున్న పిల్లలు కూడా వంతు పాడారు. రధం మెల్లగా అనుపిండి రామభద్రుడు గారు, అనుపిండి అగ్గన్న గారి (సన్యాసిరావు మాస్టర్ గారి తండ్రి) ఇంటి మీదుగా, తోటకూర నాయిన రాజు గారు, తోటకూర సీతా రామరాజు గారి ఇంటి మీదుగా, వడ్లమాని నారాయణ (అవతారం గారి) గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ రామరాజు గారింటి దెగ్గర ఆగింది.

అక్కడ నుంచి మెల్లగా కొడుకుల కాళమ్మ గారింటి కి, ఐసోల్ల కామేశ్వరావు మాస్టర్ ఇంటి దాకా, అక్కడనుంచి పేరిచర్ల వారింటిదాకా వెళ్లి ఆగింది. (అప్పట్లో ఆ వీధి చివర సరిపెల్ల సత్యం గారు, దాట్ల గారుల ఇళ్ళు ఉండేవి ). పెద్ద రధం మాత్రం తిరిగి తిన్నగా అనుపిండి బుచ్చి బాబు గారింటి వద్ద ఉంచి, బుట్ట బొమ్మలు, దేవతా వాహనాలు మళ్ళీ తిరిగి మునసబు గారి తూము గుండా అనుపిండి రామూర్తి గారి సందు ద్వారా, అనుపిండి పేరన్న గారింటికి, ఆ తరువాత సూరపరాజు గారింటికి, పక్కనే ఉన్న రాణి వీరభద్రం గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ సరిపెల్ల కాంబాబు గారు /శంబన్న శాస్త్రి గారి ఇంటి వద్ద ఆగింది. అక్కడ కాసిన్ని మంచి నీళ్లు తాగేసి , అక్కడ నుంచి పెద్దమాస్టర్ (మరువాడ అప్పారావు) గారి ఇంటి వద్ద ఆగి, తిరుగుముఖం పట్టాయి.ఏ సందు లో నైనా మేళ తాళాలు వాయించకూడదు అనే నిబంధన ఉండడం తో హరి హర నామ స్మరణలతో మాత్రమే సరిపెల్ల వారి వీధుల నుంచి , మళ్ళీ మునసబు గారింటికి తిరుగు ప్రయాణం మొదలెట్టాయి దేవతా వాహనాలు .

*******

తరువాత దేవతా వాహనాలు, తిరిగి మునసబు బుచ్చి బాబు గారింటి వద్ద ఆగాయి. అలసిన వారందరూ అరుగుల మీద కూర్చునే ఉంటె, పెద్ద గుండిగ లో మజ్జిగ నీళ్లు పెట్టి తాగమని చెప్తున్నారు పెద్దలు. రధం లో కూర్చున్న పిల్లలు, రధం లాగే యువత అందరూ వచ్చి ఒకొక్కలే మజ్జిగ నీళ్లు తాగి మళ్ళీ రధం పగ్గాలని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. సన్నాయి మేళం వాయించే వాళ్ళని కూడా తాగమని బుచ్చిబాబు గారు చెప్పడం తో వాళ్ళు కూడా మజ్జిగ నీళ్లు తాగేసి బయలు దేరారు.

రధం మెల్లగా బుచ్చి బాబు గారి ఇంటి నుంచి మొదలయ్యింది. అక్కడనుంచి సరిపెల్ల అన్నాజీ గారి ఇంటికి, నూకల పాపడు గారి ఇంటి పక్కనుంచి వెళ్తూ , రావమ్మ గారిఇంటి పక్క నుంచి, మరువాడ కృష్ణమూర్తి గారిల్లు , నూకల విశ్వ సుందరం గారిల్లు , నూకల బెల్లం కొట్టు సూరిబాబు గారి ఇంటి నుంచి, కోతుల మామ్మ , పాలగుమ్మి రామారావు గారిల్లు , అత్కూరి నారాయణరావు గారిల్లు పక్కనుంచి శివాలయం ప్రధానార్చకులు వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారి ఇంటి మీదుగా శివాలయం దగ్గరకి చేరాయి.

********

రధం లో ఉత్సవానికి ఊరేగించిన విగ్రహాలని తీసి, ప్రధాన అర్చకులు వెలవెలపల్లి ఎర్ర భ్రమ్మయ్య గారు శివాలయం లో పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి కి కళ్యాణం జరిపించారు. రంగ రంగ వైభోగం గా జరుగుతున్న ఆ కల్యాణానికి ఊళ్ళో పెద్దలు అందరూ తిలకిస్తూ ఉంటె, గుడి ముందర ఆగి ఉన్న రధాన్ని యువత గుడి పక్కనున్న ఖాళీ స్థలం లో కి పెడుతున్నారు.

అలాగా వైశాఖ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమైన పార్వతి సమేత జాహ్నవేశ్వర స్వామి మరియు శ్రీదేవి, భూదేవి సమేత కేశవ స్వామిల కళ్యాణం ఐదు రోజుల పాటు బ్రహ్మాండం గా మొదట్లో గుళ్లో భక్తులకి భోజనాలు ఏర్పాటు చేసేవారు. తరువాత మధ్యాన్నం పానకాలు, వడపప్పు, మజ్జిగ లు మంచినీళ్లు ఇస్తూ ఒక పక్క , కొండంత ఎత్తుని తలపించే నలభై అడుగుల రధం, దాని తో పాటు దేవతా వాహనాలు, హరి, హర నామ స్మరణలు, యువకుల “అశ్శరభ శరభ” “అల్లెల్ల వీర ” నినాదాలు తో అప్పటి ప్రజలు భక్తి తో ఉప్పొంగిపోయారు.

******************

(రధ యాత్ర-2 లో అత్యద్భుతమైన సంఘటనలు..అతి త్వర లో )

******************

Written by

(Prasad Oruganti )

ప్రత్యేక కృతజ్ఞతలు : రాంబాబు మాస్టర్ గారు , నూకల పేరప్ప గారు, వడ్లమాని బాబిగారు, వడ్లమాని ప్రసాద్, శర్మాజీ, నల్లయ్య శాస్త్రి గారు, హరే రాంబాబు, అర్చకులు వెలవెల పల్లి సోమేశ్వరావు గారు, నూకల కాంబాబు గారు, సన్నీ వడ్లమాని గారు.

23 thoughts on “రథ యాత్ర-1 (అనాతవరం దేవుడి పెళ్లి కథ)

orugantiprasadకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s