నవంబర్’ 96

“బంగాళా ఖాతం లో  రెండు రోజుల కిందట పట్టిన వాయుగుండం అది తుఫాను గా మారి ఈ రోజు తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావం వలన వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ గా వర్షాలు పడచ్చు” అని  రేడియో లో వస్తోంది.

“ఏరా సోమేశమ్!  మన పంటలు ఒబ్బిడవుతాయా అంటావా ఈసారి” అని రేడియో వింటూ అడుగుతున్నాడు లింగయ్య . “ఎహె ఇవన్నీ మాములు వర్షాలే, ఆల్లు అలాగే చెప్తారు” అని చుట్ట వెలిగించడానికి, అగ్గి పెట్టి గురుంచి చొక్కా జేబు ని తడుముకుంటున్నాడు సోమేశమ్! .
*****
“అమ్మా! కాలేజీ కెళ్తున్నా” అని బాగ్ లో బుక్స్ వేసుకుని చెప్తోంది ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కి .. “ఆ సరే , బస్సు పాసు పట్టుకెళ్ళు. ఏదో వాన వచ్చేలా ఉంది.జాగ్రత్త గా వెళ్లి వచ్చేతల్లి” అంటూ ఆ తల్లి కూతురికి చెప్తోంది. “ఆ.. అలాగే” అంటూ తన ఫ్రెండ్స్ తో  బస్సు ఎక్కడానికి రోడ్డు దగ్గెర కొచ్చింది ఆ అమ్మాయి.
****
“ఏరా యెంత సేపురా, కాలేజీ కెళ్ళి అక్కడనుంచి మాట్నీ కి ‘భారతీయుడు’ సినిమా కి వెళ్లి వచ్చేద్దాం” అంటూ తన ఫ్రెండ్ రమణ ని త్వరగా తయారవ్వమని రావు తొందర పెడుతున్నాడు. “ఎహె ఇప్పటికే అది రెండు సార్లు చూసాం, ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా కి  ఇంకో సారి వెళ్ళొచ్చేచు ” అంటూ రెడీ అవుతున్నాడు బస్సు మీద కాలేజీ కి వెళ్ళడానికి రమణ.
****
“ఈ వారం ఇంకా కొబ్బరి కాయ దింపు తీయించలేదు. రేడియో లో వర్షాలు అని అంటున్నాడు. మళ్ళి ఇంకో వారం ఆగితే కానీ కుదరదేమో” అని మాణిక్యం కాఫీ హోటల్ లో  టీ  తాగుతూ అప్పుడే వేసిన బజ్జి కేసి చూస్తూ అంటున్నాడు పరమేశం.”పర్లేదు లెండి. వర్షాలు యెంత, రెండు రోజుల్లో తగ్గిపోతాయి, మీ చెట్లేమీ పడి పోవులెండి. ఎన్ని చూసాం ఇలాంటివి.  మళ్ళి వత్తా” అని అనేసి సైకిల్ మీద తుర్రున వెళ్ళాడు కొబ్బరి దింపులు తీసే కోటయ్య. “నీ చుట్టూ తిరగ లేక చత్తున్నా, సరే లే ఇంకో వారం లో కనపడతావు గా అప్పుడే తీయిత్త,
“ఇదిగో మాణిక్యం  టీ డబ్బులు” అంటూ మాణిక్యానికి ఇవ్వడానికి లేచాడు పరమేశం.
****
“సంద్రం లోకి ఇయ్యాల ఏళ్ళొద్దు మావా నువ్వు . ఆకాశం సూత్తుంటే ఏదో పెద్ద ఇపత్తు వచ్చే లా ఉంది. ఇయ్యాల వెళ్లకపోతే పర్లేదు. ఇంట్లో నే ఉండు మావా” అంటూ రెండేళ్ల పిల్లాడికి అన్నం పెడుతూ చెప్తోంది ఒక ఇల్లాలు. ఆ పక్కనే గుడ్డ ఉయ్యాలలో పసి బిడ్డ నిద్ర పోతోంది. “ఎహె ఇయన్నీ మాములే కదే, ఇలాంటివి ఎన్ని చూసాం, పర్లేదు లే కానీ నేను ఎల్లొత్తా” అంటూ చేపల వల తీసుకుని, తన వాళ్ళ తో సముద్రం లో కి వెళ్ళాడు చేపల్ని పట్టుకోవడానికి చంద్రన్న.
****
అప్పటికే మసిబారిన లాంతరు చిమ్నీ ని కడిగేసి, దాంట్లో కిరసనాయిలు పోసి ఉంచింది. చీకటైన వెంటనే లాంతర్ ని వెలిగిద్దామని పాపాయి. “ఏమండీ! వచ్చేయండి అన్నానికి, అన్నీ సర్దేశాను. ఈ కర్రెంట్ ఎప్పుడు వస్తుందో ఏమిటో , ఈ వానని చూస్తే కర్రెంట్ రెండు రోజులదాకా వచ్చేటట్టు లేదు. ఈ వానలు తగ్గాక మన పెంకులు నేయించాలండి. వర్షం ఇలాగె పడితే, మన ఇంట్లో కూడా పడి పోయేలా వుంది” అంది పాపాయి. “అలాగే చేద్దాం ఈ వాన తగ్గనీ, ఇప్పటికిప్పుడే పెంకులేమీ ఎగిరిపోవు కదా ఈ వానకి ఇలాంటి వి ఎన్ని చూసాం, ఆ కొంచం కూరేయి” అని  అన్నం తింటున్న నాగేశ్వర రావు భార్య తో అంటున్నాడు.
***
నల్లటి మేఘాలు ఊళ్ళని మింగేసేలా ఉరుమి ఉరుమి చూస్తున్నాయి. వాన జోరందుకుంది.రోడ్లన్నీ నిర్మానుష్యం గా ఉన్నాయి. కుక్కలు బెరుకు బెరుకు గా వెళ్లి దాక్కుంటున్నాయి. పక్షులు కూడా పెందరాళే వెళ్ళిపోయి, చెట్ల పైన
కట్టుకున్న గూట్లో కి వెళ్లి, తెల్లారిన తరువాత మళ్ళి రావచ్చు ,  అనుకుని గూట్లో, రెక్కల దుప్పటేసుకుని బజ్జున్నాయి.

ఎక్కడో రేడియో లోని వార్తలు, గాలి కి కొట్టుకొచ్చిన్నట్టుగా సగం సగం వినపడుతున్నాయి. మెల్ల మెల్ల గా గాలి ఊపందుకుంది.“ఇప్పడి దాకా కురిసి కురిసి అలసిపోయి ఉన్నావు. ఇప్పుడు నేను  అందుకుంటాను” అనేసి వర్షానికి గాలి తోడయ్యింది.

గంటకి సుమారు 145 కిలోమీటర్ లనుంచి 215 కిలోమీటర్ ల వేగం తో వీచే గాలులకి ఊళ్లన్నీ అతలాకుతలం అవుతున్నాయి. భీకర మైన శబ్దం వస్తోంది. పెద్ద పెద్ద చెట్లన్నీ పెళ పెళ మని కింద పడుతున్నాయి. భయంకరమైన గాలికి కొబ్బరి చెట్లు సైతం మేమూ తట్టు కోలేము అంటూ నేల కి ఒరుగుతున్నాయి. ఒక చెట్టు కాదు, వంద కాదు..వేల చెట్లు నేల కొరుగుతున్నాయి. “ఎప్పటి నుంచో చెట్లే మాకు మేడలు” అని గూళ్ళు కట్టుకున్న పక్షులు విల విల లాడుతున్నాయి.

ఇంటి పై కప్పులు లేస్తున్నాయి. ఇంట్లో ఉన్న జనాలు హహకారాలు పెడుతూ పిల్లా, పాపలతో బిక్కు బిక్కు మని ఓ మూల దాక్కుంటున్నారు. పూరి గుడిసెలు,వాటిలో ఉండే  ప్రాణాలు కూడా పూర్తిగా గాలి లో కలిసి పోతున్నాయి.
కరెంటు స్తంభాలు, తీగలు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి.

ఊరికి తిరిగెల్తున్న బస్సులు ఎక్కడిక్కకడ ఆగిపోయాయి. బస్సు లో పొద్దున్న కాలేజీ కెళ్ళి, తిరిగి వచ్చే పిల్లలు అంతా బస్సు లో నే చిక్కుకుపోయారు.బయట చిమ్మ చీకటి. ఒకొక్క చెట్టు , కళ్ళ ముందరే పెళ పెళ మని విరుగుతున్నాయి. విరుగుతున్న చెట్లు బస్సు మీద పడి బస్సు అద్దాలు పగులుతున్నాయి. బస్సు దిగి పరిగెత్తుకుని బయటకి వెళదామని బస్సు లో ఉన్న రమణ, రావు ల తో పాటు మరొకొందరు దిగారు. బయట వీస్తున్న ప్రచండ వేగానికి కొందరు చెల్లా చెదురయ్యారు. మరికొందరు ప్రాణ భీతి తో బస్సు ఎక్కేసి ఆయాస
పడుతున్నారు.
***********

మరుసటి రోజు ఉదయం  7 గంటలు.

సూర్యుడు యధా విధి గా వచ్చేసాడు. ఎండ పెళ్ళు మని కాస్తోంది. ఆకాశానికి ఏమి తెలియనట్టు గా చాలా నిర్మలం గా వుంది. ఊళ్లన్నీ ఎక్కడా నీడ లేని ఎడారి లా కనిపిస్తున్నాయి . చెట్లన్నీ పడిపోయి బస్సు ల ముందర ధర్నా చేస్తున్నట్టు గా ఉండడం తో , ముందర రోజు ఉదయం కాలేజ్ కి వెళ్లిన కొంత మంది పిల్లలు, బస్సు లోని ప్రయాణికులు  నడుచుకుంటూ, నీరసం గా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు.

సముద్రం లో కెళ్లిన 1000  మంది జాడ తెలియలేదు.కొన్ని వేల పశువులు, కోళ్లు విగత జీవులై ,చెల్లా చెదురయ్యి ఉన్నాయి..కొన్ని వేల ఎకరాలు నాశన మయ్యాయి. కొబ్బరి చెట్లన్నీ వడి తిరిగి పడి పోయి ఉన్నాయి.కొబ్బరికాయలు గుట్టలు గుట్టలు గా పడిపోయినవి కొన్ని, మరికొన్ని భయంకరమైన  గాలికి,చెట్టు మీద నుంచే విడిపోయి చుట్టుపక్కల ఇళ్ల మీద పడి ఇంటి పెంకుల్ని, గుడిసెల్ని, రేకు ఇళ్ల ని విధ్వంసం చేసినట్టు గా కనిపిస్తోంది.

గాలికి చాలా మంది ఇంటి పెంకులు ఎగిరిపోయాయి. వీధులన్నీ పెంకులు తో, కొబ్బరాకులతో రోడ్డు వేసినట్టుగా ఉన్నాయి. పడి పోయిన కర్రెంట్ తీగల మీద, తడిసిన బట్టలు ఆరేసుకుంటున్నారు.

నెల రోజుల తరువాత:

“ఏరా! కోటయ్య! ఇప్పట్లో కొబ్బరి తోటకెళ్ళే పని నీకు ఉండదు, నాకు ఉండదు” అని లోపల దుఃఖం తో  నెమ్మది గా అంటున్నాడు పరమేశం. “ఆయ్ అవునండి” అంటూ కోటయ్య ఏడుపు ఆపలేక పైకే ఏడుస్తున్నాడు.

“కరెంటు దీపాన్ని చూసి నెల రోజులయ్యింది” అని నెమ్మదిగా అంటోంది పాపాయి మళ్ళి లాంతర్ చిమ్నీ ని తుడుస్తూ తన భర్త తో, “అవునే, మొత్తానికి కరెంటు ఇవ్వాలో, రేపో వచ్చేస్తుంది అని  అంటున్నారు” అని భర్త , గది లోపల నుంచే ఆకాశం లో తెల్లటి మబ్బులని చూస్తూ చెప్తున్నాడు.

చేపలకని సముద్రం లో కెళ్ళి, మళ్ళి తిరిగి రాలేకపోయిన చంద్రన్న గురుంచి ,సముద్రం వైపు దిగులుగా చూస్తూ, తన పిల్లల తల నిమురుతోంది చంద్రన్న భార్య. దూరం గా సముద్రం లో కెరటాలు మాత్రం ప్రశాంతం గా తీరానికి వస్తూ వెళ్తున్నాయి .

సంవత్సరం తరువాత

“బంగాళా ఖాతం లో  రెండు రోజుల కిందట పట్టిన వాయుగుండం అది తుఫాను గా మారి ఈ రోజు తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావం వలన వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ గా వర్షాలు పడచ్చు” అని  రేడియో లో వస్తోంది.

ఇది విని సోమేశమ్, లింగయ్య లు  ఒకరి ముఖాల ఒక వైపు చూసుకుని నవ్వుకుంటున్నారు.

************************************
ప్రసాద్ ఓరుగంటి

Note: కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s