భోగి మంటలు

పండక్కి కొన్ని రోజుల ముందర….

మాలచ్చమ్మ చేసిన గో పిడకలు గోడలు మీద ఆరుతున్నాయి.ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ, ఆయాసపడుతూ వచ్చి ” భోగి దండలు తయారయ్యాయా అని ఆత్రుత గా అడిగాడు. “ఇంకా లేదు, ఆరిన తరువాత దండలు గుచ్చి పంపిచేత్తా” అని కొంచం విసుక్కుని ఆవు దూడకి గడ్డి వేయడానికి వెళ్ళింది మాలచ్చమ్మ.

పోస్ట్ మాన్ సైకిల్ మీద వెళ్తూ, ఉత్తరాలు ఇస్తున్నాడు. ఉత్తరాల చదివిన వాళ్ళు ఎంతో ఆనందం గా ఉన్నారు. కూతురు అల్లుడు వస్తున్నారని కొంతమంది,అబ్బాయిలు వస్తున్నారని కొంతమంది, చుట్టాలొస్తున్నారని ఇంకొకలు. ఇలాగ మొత్తానికి ఎప్పడు ఎప్పడు వస్తారా అని ఊరంతా ముగ్గేసి, ముస్తాబయ్యి ఎదురు చూస్తోంది. ప్రతీ ఇంటి వంటిల్లు పిండి వంటల ఘుమ ఘుమలు తో , ప్రతీ మనసూ, వచ్చే వాళ్ళ గురుంచి ఎదురు చూపులతో ఆహ్వానం పలకాలని తొందరపడుతోంది.

రెండో వీధి కట్లమ్మ గుడిదగ్గెర, పెద్ద సమావేశం జరుగుతోంది. ఎక్కడనుంచి భోగి మంటలకి దుంగల్ని తెచ్చుకోవాలి అని ఒకడు చెప్తున్నాడు. మిగతా వాళ్ళు అంతా వింటున్నారు. ఇంకోడు, “ఎలాగైనా పక్క వీధి మంట కన్నా మనది పెద్దగా ఉండాలి ఈసారి” అని నొక్కి వక్కాణించాడు. ఈ మాటకి అక్కడున్న కుర్రాళ్ళో ఉత్సాహం ఎక్కువైంది. సరే అంటే సరే అనేసుకున్నారు. వీళ్ళ అందరిదీ ఒకటే ఆశ, అదే జ్యాస, తీసుకుంటున్న శ్వాస కూడా అదే “మనదే పెద్ద భోగి మంట అవ్వాలి, అని “. దుంగల్ని తేవడానికి ధునియా ని దున్నేయడాన్కి సిద్ధం గా ఉన్నారు వీళ్లంతా.

చిన్న చిన్న పిల్లలు ఇంటింటి కి తిరుగుతూ “డొక్క ఏయమ్మ , డోలు ఏయమ్మ, ఏసినోళ్లకి పుణ్యం, ఏయనోళ్ళకి పాపం” అంటూ భోగి మంటలకి కొబ్బరి డొక్కలని, చిన్న చిన్న కర్రల్ని పోగు చేసుకుంటున్నారు. మనకెందుకు లే పాపం అనుకుని పెరట్లో కెళ్ళి డొక్కల్ని, కమ్మల్ని తీసి పిల్లలకి ఇస్తున్నాడు రాంకిష్ణ.

భోగి రోజు తెల్లవారు జామున :

ఊరంతా పొగమంచు కప్పేసి ఉంది. దుప్పట్లో ముసిగేసి పడుకున్న కుర్రాళ్ళు అంతా ఒక్క ఉదుటున లేచి కూర్చున్నారు. ఒకొక్కలే కట్లమ్మ గుడి దగ్గెర కి వస్తున్నారు. ఇంకా లేవనివాళ్ళని ఇంటి తలుపులు కొట్టి మరీ లేపుతున్నారు. శరభయ్య ఇంట్లో ,కొన్ని రోజుల ముందరే జాగ్రత్త గా దాచుకున్న దుంగల్ని, ఒకొక్కటే ఆయాసపడుతూ తీసుకు వచ్చారు. దుంగల్ని సరిగా పేర్చి, కిరసనాయిలు తెమ్మని కృష్ణ కి చెప్పారు. కృష్ణ కళ్ళు నలుపుకుంటూ , కిరసనాయిలు తెచ్చి పక్కనే ఉన్న కొబ్బరి డొక్కలని, దుంగల మీద పెట్టాడు. మండుతున్న డొక్కల్ని దుంగల్లో పడేసారు. అక్కడున్న కుర్రాళ్ళ కళ్ళలో భోగి మంటల వెలుగులు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నాయి.

తెల్లవారు తోంది. హరి దాసు గజ్జెల చప్పుడు దూరం గా వినిపిస్తోంది. సైకిల్ మీద నుంచి వెళ్తూ “పనస పొట్టు.. పనస పొట్టు” అంటూ ఎవడో అరుస్తున్నాడు. సైకిల్ కి పాల బిందులు కట్టుకుని పాలు పోస్తున్నాడు ఒకడు. మాలచ్చమ్మ తయారుచేసిన భోగి దండల్ని , పట్టుకుని ,పిల్లలు ఒకొక్కలే వస్తున్నారు ఈ భోగి మంట లో వేయడానికి.

అప్పటికే అక్కడకొచ్చి, మంట మీద చేతులు చాపి వెచ్చ పెట్టుకుంటున్న కోఠిగాడు , పిల్లలని చూసి, “ఇదిగో మంట చుట్టూ మూడు సార్లు తిరిగి దండం పెట్టి దండల్ని వేయండి” అని అన్నాడు. ఈ లోపులో మధ్యలో మంటల్లో కాలుతున్న దుంగ ని చూసి “ఇది మా పెరట్లో వుండే మడత మంచం లా ఉందే” అనేసి ఉందో, లేదో చూసుకోడానికి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కోఠి. ఇదే సమయమనుకుని అక్కడున్న కుర్రాళ్ళు మిగతా భోగీ మంటలు చూద్దామని, మెల్ల గా జారుకున్నారు అక్కడనుంచి.

దూరం గా వీధి చివర చిన్న హడావిడి మొదలయ్యింది. అప్పుడే డొక్కల్ని పేర్చి మంట వెలిగిస్తున్నారు అక్కడున్న పెద్దలు. ఆ మంట చూద్దామా అని ఒకడు అడిగాడు. “ఎహె అది డొక్కల మంట రా, దుంగల మంట కాదు” అని అనేశాడు ఇంకోడు.”పక్క వీధి కెళ్దాం అసలు ఆ పెద్ద మంట ఎలా ఉందో చూద్దాం” అని అన్నాడు ఇంకో కుర్రాడు. మొత్తానికి ఈ వీధి కుర్రాళ్ళు పక్క వీధి కెళ్లారు అక్కడున్న భోగి మంట ఎలా ఉందో చూడటానికి.

వెళ్తూ వెళ్తూ తూము దగ్గరున్న ఇంకో చిన్న భోగి మంట దగ్గెర ఆగారు.అప్పటికే అక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుని చేయి చాపి చలి కాచుకుంటున్నారు. దూరం గా పెద్ద మంట కనపడటం తో అక్కడనుంచి ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు.

ఆ పెద్ద మంట లో దుంగలు చాలానే ఉన్నాయి. కానీ అప్పటికే సగం కాలి పోయి ఉన్నాయి.”దుంగలన్నీ రాత్రే పేర్చేసాము తెల్లారేక అంటిద్దామని .ఈలోపులో నాగన్న చుట్ట తాగటానికి అని అర్ధ రాత్రి లేచి , దుంగల్ని అంటించేసి పడుకున్నాడు. తెల్లారయ్యేటప్పటుకీ సగం దుంగలు కాలిపోయినాయి” అనేసి ఆ వీధి లో ఉన్న రవి గాడు చేతులు కాచుకుంటూ వాపోయాడు. అయినా ఆ భోగీ మంట బ్రహ్మాండం గా వెలుగుతోంది.

నెల ముందరే తీసుకున్న షర్ట్, ప్యాంటు క్లాత్ లని, శ్రీకాంత్ టైలర్ కి ఇచ్చి “ఇదిగో శ్రీకాంతు! పండక్కి ముందరే ఇచ్చేయాలి” అని ఆది తీసుకుంటున్నప్పుడు వాడి చేత ఒట్టేయించుకున్నారు.సరిగా పండగ సమయానికి బట్టలు వచ్చేయడం తో ఒకింత గర్వం గా షర్ట్ కాలర్ కి, ప్యాంటు కి అటు ఇటు కూడా పసుపెట్టి, రకరకాల రంగులతో కొత్త బట్టలు వేసుకుని , ఊరిని కొత్త లోకానికి తీసికెళ్తున్నారు.

“ఏరా! పండక్కి సినిమా లు వచ్చాయి కదా! ఎల్దామా” అని గోపి అడిగాడు బుజ్జిని . “సినిమా తరువాత వెళ్లచ్చు కానీ క్రికెట్ మ్యాచ్ పురమాయించావా” అని గోపిని అడిగాడు బుజ్జి . “ఇదిగో ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళేసి, మ్యాచ్ పురమాయించి వచ్చేత్తా. ఈ లోపులో టీం కి 11 మంది ని పోగు చేసి ఉంచు” అనేసి సైకిల్ మీద తుర్రుమని వెళ్ళాడు.

పండక్కి బస్సు లు రష్ గా ఉంటాయి కాబట్టి , బస్సు దొరికితే, ఒకేసారి మార్నింగ్ షో, మాట్నీ షో లు చూసేసి వచ్చేస్తున్నారు ఫామిలీస్ తో కొంత మంది.

ఇంకో పక్క, ఆడవాళ్ళూ కూడా పండక్కి కొనుకున్న చీరలు కట్టుకుని, పక్కవీధిలో భోగీ పళ్ళు పేరంటానికి వెళ్తున్నారు.”అమ్మా అమ్మా నేనూ వస్తా” అంటూ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మలతో వెళ్తున్నారు.

ఊరికి వచ్చిన అల్లుళ్ళు, కొత్త బట్టలు కట్టుకుని, టక్ అప్ చేసుకుని, సన్ గ్లాస్ పెట్టుకుని , ఊరంతా తిరుగుతూ ఉంటె, “అల్లుడు గారు బాగా ఉన్నారా” అని అరుగు మీద కూర్చున్న కొంతమంది ఊరు పెద్దలు, లేచి మరీ ఆప్యాయం గా పలకరిస్తున్నారు.

జగ్గన్న తోట ప్రభల తీర్తానికి లారీ ని రెడీ చేసాడు శ్రీను. అందర ఇంటికెళ్లి ఆప్యాయం గా అడుగుతున్నాడు రమ్మని. లారీ కేబిన్ లో చోటు ఉంటె వస్తామని అన్నారు కొందరు. ఇది చూసి పక్కనున్న రమణ ట్రాక్టర్ రెడీ చేసాడు జగ్గన్న తోట తీర్తానికి. లారి తొట్టి లో కొంతమంది, ట్రాక్టర్ తొట్టి లో కూర్చుని కొంతమంది కుర్రాళ్ళు బూరాలు ఊదుకుంటూ సంబరం గా తీర్తానికి బయలు దేరారు.

పండగ రోజులు మెల్ల మెల్ల గా వెళ్తున్నాయి. వచ్చిన చుట్టాలు ఒకొక్కలే తిరుగు ప్రయాణాలు మొదలెడుతున్నారు. ఇంటి ఆడపడుచులు, అల్లుళ్ళు బయలుదేరుతుంటే “అప్పుడే పండగ అయ్యిపోయింది ఇంకా ఉంటె బావుంటుంది” అని మనుషుల తో పాటు ఊరు కూడా బెంగట్టుకుంది.

ఒక ఇంటి ముందు ముగ్గులు మరొక ఇంటి ముగ్గు తో దీనం గా మాట్లాడుతోంది , “మనం ఉంటేనే చుట్టాలు అందరూ వస్తూ ఊరంతా హడావిడి గా ఉంది. మనం లేకపోతె ఎవరూ రారు , మనం ఇక్కడే ఉందాం ఎక్కడికీ వెళ్ళద్దు” అంటూ , “సరే అలాగే అంది” పక్కింటి ముగ్గు.
***********
ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s