బస్సులు…కస్సు బుస్సులు

“ఇక మా ఊరు వెళ్తామండి, ఇక్కడికి వచ్చి  వారం అయ్యింది. పండగలు అన్ని అయ్యాయి కదా,మళ్ళి పండక్కి అందరం వచ్చేస్తాం” అంటూ పెట్టె లో దండం మీద ఆరేసుకున్న బట్టల్ని సర్దుకుంటున్నారు వచ్చిన చుట్టాలు. “ఇంకో రెండురోజులు ఆగి ,వెళ్ళచ్చు కదా” అని , ఫార్మాలిటీ కోసం ప్రశ్న వేసింది వచ్చిన గెస్ట్ లకి ఆతిధ్యం ఇచ్చిన ఒక ఇల్లాలు. “లేదు లేదు మళ్ళి వచ్చేస్తాం వచ్చే పండక్కి”, అంటూ బాగ్ లు పుచ్చుకుని, పిల్లా, జెల్లా లతో బస్సు ఎక్కడానికి గేట్ లో కి నడుచుకుంటూ వెళ్లారు ఆ వచ్చిన చుట్టాలు .

అసలే పండుగ సీజన్, ఇక్కడనుంచి మొత్తానికి అమలాపురం వెళ్ళిపోతే అక్కడనుండి ఎక్సప్రెస్ బస్సు పట్టుకుని మన ఊరు వెళ్లిపోవచ్చు అని చుట్టం లో ఒకడు చుట్ట కాలుస్తూ అంటున్నాడు. బస్టాండ్ లో జనాలు కిట కిట లాడుతున్నారు. ఎప్పుడు బస్సు వస్తుందా…అని ఎదురు చూపులు. దూరంగా బస్సు హార్న్ విన్పించింది.

బస్సు డ్రైవర్ దూరం గా బస్టాండ్ లో నున్న జన సంద్రాన్ని చూసి, బెంబేలెత్తి పోయి, బస్సు స్టాండ్ కి కొంచం ముందరున్న నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర బస్సు ఆపేసాడు, దిగే వాళ్ళని దించడానికి.బస్టాండ్ లో వెయిట్చేస్తున్న జనాలందరూ అక్కడికి పరిగెత్తుతున్నారు ఆపిన బస్సు ఎక్కేడానికి. బస్సు లో కండక్టర్ కిటికీ లోంచి తల పెట్టి నిక్కచ్చి గా చెప్పేసాడు చిల్లరుంటే నే ఎక్కండి, వెనకాల ఖాళీ గా బస్సు వస్తోంది అని.

బస్సు స్టాండ్ నుంచి పరిగెత్తి సాధించిన కొంతమంది చిల్లర లేని వాళ్లు,దిగే జనాల్ని తోసుకుంటూ ధైర్యం గా ఎక్కేసారు.చిల్లర ఉన్నవాళ్లు బస్సు ఎక్కే ధైర్యం లేకా , కిందే ఉండిపోయారు.మొత్తానికి ఈ బస్సు బయలుదేరింది పండగ జనాల్ని మోస్తూ.

నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర భంగపాటు జరిగిన చిల్లరున్న జనాలు శపధం చేసేసారు. “ఈసారి వచ్చే బస్సు ఇక్కడే ఆగుతుంది. ఆగిన వెంటనే బాగ్ లేసుకుని ఎక్కేద్దామని”. మళ్ళి బస్సు హార్న్ వినిపించింది. ఈసారి బస్సు డ్రైవర్ నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర ఆపకుండా బస్టాండ్ లోనే ఆపాడు. ఈసారి మేడ దగ్గెర వెయిట్ చేస్తున్న జనాలు బస్టాండ్ వైపుకి పరిగెత్తారు. అప్పటికే బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న చాల మంది లో కొంతమంది చిల్లర చూపిస్తూ బస్సు ఎక్కేసారు. కొంతమంది ఆయాసం తో పరుగులు పెడుతూ బస్సు వెళ్లిపోయిందని బాధతో తిట్లు మొదలెట్టేసారు.

ఇలాగ మొత్తానికి చాల మంది ఏవరి ఊళ్ళ కి వాళ్ళు వెళ్లలేక, చూద్దామనుకున్న మాట్నీ సినిమా చూడలేక, ఎక్కడనుంచి బయలుదేరారో, మళ్ళి అక్కడికే వెళ్లారు….
***********
అమలాపురం బస్టాండ్ లో ,ఆగి ఉన్న బస్సు బయలు దేరుటకు సిద్ధం గా ఉంది. ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంది. దాంతో ఈ బస్సు ముందరే బయలు దేరిపోతుందని జనాలు ఎక్కేసి కూర్చున్నారు. లోపల ఇంజిన్ గోల పెడుతోంది. చిన్న పిల్లలు గాలి తగలక ఏడుస్తున్నారు. తల్లులు విసుక్కుంటూ ఊరుకో పెడుతున్నారు.

ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ… చేస్తూ కూర్చున్న జనాలు, దూరం గా జేబు రుమాలు తో మూతి తుడుచుకుంటూ వస్తున్న డ్రైవర్, కండెక్టర్ ల ని చూసి, చాలా వెయిట్ చేసిన తరువాత చూసే తిరుపతి వెంకన్న దర్శనం లాగ ఫీల్ అయ్యిపోయి, సంతోషం తో ఉబ్బి తబ్బిబు అవుతున్నారు. బస్సు మెల్లగా బయల్దేరింది. కిటికీ లో నుంచి గాలి తగలడం తో,చంటి పిల్లలు ఏడుపు ఆపారు.

కొంత దూరం వెళ్లిన తరువాత ఎర్రవంతెన స్టాప్ వచ్చింది. అప్పటిదాకా ఏదో రాసుకుంటున్న కండెక్టర్, టికెట్ కొట్టడం మొదలెట్టాడు. జనాలని  తోసుకుంటూ వెనక్కి వస్తున్నాడు టికెట్ టికెట్ అంటూ. డ్రైవర్ బస్సు ని రోడ్డు ఎడమ వైపుకి ఆపి, కిందకి దిగాడు. మళ్ళి చంటి పిల్లలు ఏడవటం మొదలెట్టేసారు. చిల్లర ఇవ్వని వాళ్ళకి కండెక్టర్ టికెట్ వెనకాలవైపు రాస్తున్నాడు, దిగేటప్పుడు చిల్లర ఇస్తానని, మొత్తానికి అరగంట టికెట్ కొట్టిన తరువాత , చంటి పిల్లల ఏడుపు పెడబొబ్బలతో బస్సు బయల్దేరింది.

కొద్ది సేపటికి భట్నవిల్లి స్టాప్ వచ్చింది .బస్సు స్లో గా కాఫీ హోటల్ దగ్గెర ఆపాడు. డ్రైవర్ బస్సు దిగాడు. అతనితో పాటు కండెక్టర్ కూడా మెల్లగా దిగి హోటల్ లో కి ఇద్దరూ చేరారు. ఈలోపులో కొంత మంది ప్రయాణికులు కూడా బస్సు దిగి, హోటల్ లో టీ తాగుదామని వెళ్లారు . డ్రైవర్, కండెక్టర్ లు మైసూర్ బజ్జి తినేసి, టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్సు లో చిన్న పిల్లలు కిటికీ లో నుంచి చూస్తున్నారు మళ్ళి బస్సు ఎప్పడు బయలు దేరుతుందా అని. చంటి పిల్లలు ఏడ్చి ఏడ్చి అలసి పడుకుండి పోయారు.

బస్సు బయల్దేరింది. పెద్ద మిల్లు వచ్చింది.బస్సు చివరి సీట్ లో కూర్చున్న ప్రయాణికుడు లేచి నించున్న జనాలని తొక్కుకుంటూ అనాతరం స్టాప్ లో దిగడానికి కండక్టర్ సీట్ దగ్గెరికి వచ్చి టికెట్ ముక్క చూపించాడు. కండెక్టర్ టికెట్ వెనకాల చూసి, “ఎవయ్యా నీ స్టాప్ రాకూండానే ముందరే వచ్చి, డోర్ కి అడ్డం గా ఉన్నావు, ఉండు ఇక్కడ ఇంకోలు దిగుతారు. నీకిస్తాను, మీఇద్దరు చిల్లర మార్చుకోండి” అని నోట్ ఇచ్చి . స్టాప్ స్టాప్ అని అన్నాడు.

అప్పుడే బస్సు ఆగింది అని గ్రహించి, ఇక్కడే దిగాలి అనుకుంటూ వెనకాల సీట్ లో కూర్చున్న ఇంకో ప్రయాణికుడు కంగారు గా, జనాలని తోసుకుంటూ, వాళ్ళ చేత తిట్లు తింటూ,కండెక్టర్ సీట్ దగ్గెర కి వచ్చాడు. “ఏమయ్యా, తెలియదా నీ స్టాప్ ఎక్కడ దిగాలో, ముందరే రావాలి అంటూ” ఆ ప్రయాణికున్ని దుమ్మెత్తి పోస్తూ, “అదిగో ఆయన చిల్లర మార్చి ఇస్తాడు దిగు దిగు” అంటూ, రైట్ రైట్ అని అన్నాడు కండక్టర్.

బస్సు బయలు దేరింది దుమ్ము లేపుకుంటూ…….దిగిన ఇద్దరూ చిల్లర మార్చుకోవాడనికి అక్కడున్న కొట్లు తిరుగుతూనే ఉన్నారు…
*************************************
ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s