హై స్కూల్ రోజుల్లో… ఒక రోజు !!!!

సమయం ఉదయం 9 గంటల 40 నిముషాలు. రేడియో లో చిత్ర తరంగిణిలో చివరగా ఈ పాట అంటూ టాటా..గుడ్ bye అంటూ అక్కినేని పాట వేస్తున్నాడు. గబగబా భోజనం చేసేసి గదిలో ఉన్న పుస్తకాలని సర్దేసుకుని, బయట ఉన్న చెప్పుల్ని వేసేసుకుని అమ్మా స్కూల్ కి వెళ్తున్నాం అని గట్టిగా చెప్పేసి బయట పడ్డా.

అప్పటికీ వీధిలో భుజాన బుక్కులేసుకున్న పి.రమేష్, సత్తి, జాను, ఆసు గాడు, రెడీ గా ఉన్నారు స్కూల్ కి వెళ్ళడానికి. ఈలోపులో చిన్న కేక వినిపించింది వెనకనుండి. అది రాజా గాడు .నేను కూడా వస్తున్నా ఆగండి రా అంటూ, మేనల్లుడు బాలు గాడి బుగ్గన గిల్లుతూ, పరిగెత్తుకుని వచ్చేశాడు. వాడి వెనక వాళ్ళ అన్న సురేష్, ఈలోపులో మా వాళ్ళు నరేష్, రమేష్ లు కూడా ఇంట్లో నుంచి వచ్చేసారు.

మూల వీధి నుంచి పరుగు శబ్దం వినిపించింది. ఎవడో వస్తున్నాడు అని అనుకున్నాం. నేను వచ్చేసా అంటూ పి రవి పలకరింపు.అందరం గుమిగూడారు.శేఖర్ గాడు ఏడీ అంటూ ఎవడో సత్తిగాడిని అడిగాడు వాడు సంతపాకల్లో నుంచి రాడంట, అసలే ఇవ్వాళా మంగళారం సంత. అక్కడ కోళ్ల ని కోసే రోజు కదా అని బెల్లంముక్క చప్పరిస్తూ ఉన్న జాను గాడు టక్కున అనేశాడు.పక్కనే ఉన్న ఆసు గాడు ముక్కు మూసుకున్నాడు జాను గాడు కోడి అనేటప్పటికీ.

అప్పటికే రెడీ అయ్యిపోయి మా గురుంచి వెయిట్ చేస్తున్న హనుమాన్ దూరం గా వాళ్ళ ఇంటి దగ్గెర చూస్తున్నాడు. చక్కగా ముస్తాబయ్యి నేను రెడీ అంటూ జి రవి వాళ్ళ ఇంటిదగ్గర కూర్చుని ఉన్నాడు. అందరూ నడుస్తూ ఉంటె, మెల్ల గా మూడో వీధి నుంచి వచ్చి గుప్తా గాడు వచ్చి జాయిన్ అయ్యాడు.

కుమ్మరెంకన్న ఇంటి దగ్గెర వచ్చేటప్పటికి, అక్కడ కోళ్లు ఇటూ అటూ పరిగెడుతున్నాయి మా నడక శబ్దానికి. కుమ్మరెంకన్న మట్టితో కుండల్ని చేస్తున్నాడు.వెళ్తూ వెళ్తూ ఆసు గాడు అక్కడున్న మట్టి ని తీసి పక్కనున్న వాళ్ళ మీద వేద్దామనుకున్నాడు సరదాగా. ఎంక్కన్న చూడటం తో ఆ పనిని విరమించుకున్నాడు.అందరూ సంత పాకల మీద నుంచి నడవటం మొదలెట్టేసాం. అప్పటికే శరభయ్య సైకిల్ మీద నుంచి బెల్లం బుట్ట దింపుతున్నాడు. జాను గాడి బుగ్గలో లో నున్న బెల్లాన్ని చూసి, నాకు శరభయ్య ని బెల్లం ముక్క అడగాలనిపించింది. మళ్ళి తమాయించుకుని సాయంత్రం సంత కొచ్చినప్పుడు అడుగుదాములే అని సర్దేసుకున్నా. అక్కడున్న ముత్యాలమ్మ గుడిలో ఎవరో అక్కడ కుంకుం బొట్టేట్టుకుని ,అరటి పళ్ళు ఇస్తూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నారు. సంత లో మాంసం కొట్టు వాళ్ళు కూడా బుట్ట లని దింపుతున్నారు. కుక్కలు కూడా సంతలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.

అప్పటికే కోటా వాళ్ళు చేసిన పోకుండ లని, వేరుశెనగ అచ్చులని తీసి బల్ల మీద సర్దుతున్నారు. అక్కడున్న జీళ్ళు చూసి ఇక్కడ బావుండవ్, ఇవన్నీ ముక్కుపోయిన జీళ్లు. అమలాపురం లో జీళ్లు బావుంటాయి అని సురేష్ అన్నాడు. అవును రా అంటూ మిగతావాళ్ళు అన్నారు. కొంచం ముందరకి వెళ్ళేటప్పటికి సైకిల్ వెనకాల కట్టిన కోళ్లు అరుస్తున్నాయి. ఈలోపులో ఎవడో అన్నాడు, మనం మధ్యాన్నం వచ్చేటప్పటికి ఈ కోళ్లు అన్ని ఇక్కడ వేలాడుతూ ఉంటాయి అని. అక్కడ నుంచి కొంచం స్పీడ్ నడక మొదలెట్టాం. అప్పటికే దూరం గా స్కూల్ లో పిల్లలు అంతా చేరుకుంటున్నారు మార్నింగ్ అసెంబ్లీ కి. కుడివైపున స్మశానం కేసి చూడకుండా కొంచం పరుగులాంటి నడకతో ఈ గ్యాంగ్ అంతా హై స్కూల్ కి చేరుకున్నాం.

ఎవరి క్లాస్ లో వాళ్ళు దూరారు. అసలే బత్తుల రామమూర్తి గారి క్లాస్. నిన్న ఇచ్చిన హోమ్ వర్క్ లో నోట్ బుక్ మీద మార్జిన్ సరిగా గీయలేదు. ఈలోపులో అందర్నీ హోమ్ వర్క్ బుక్ లని టేబుల్ మీద పెట్టాలని ఆదేశం. అలాగే జామ చెట్టు కర్ర ని కూడా తీసుకురావాలని భట్నవిల్లి బులుసుగాడికి ఉపదేశం. వాడు తుర్రున వెళ్లి చెరువు గట్టుకి ఆనుకుని ఉన్న జామ చెట్టు ఎక్కి చిన్న కొమ్మని విరగగొట్టి, కొమ్మకున్న ఆకులని తెంపి, విజయ గర్వం తో ఆ కర్ర ని టేబుల్ మీద పెట్టాడు. వాడి తోనే మొదలయిన ఆ దెబ్బలకి క్లాస్ అంతా హహ కారాలు. ఈలోపులో టంగు టంగు మని గంగయ్య బెల్. ఆ బెల్లు శబ్దం వినగానే పిల్లల్లో ఒక విధమైన ఆనందం. ఆ ఆనందాన్ని లోపలే దాచేసుకుని ఇంకొక క్లాస్ కి రెడీ.

చిన్న తెలుగు మాస్టర్ గారి క్లాస్ నడుస్తోంది. పద్యాలూ పాడుతుండగా…గంగయ్య మెల్లగా క్లాస్ లో చిన్న నోటీసు తో రాక. ఆ రాక కి పిల్లల మది లో ఎన్నో ప్రశ్నలు. రేపు సెలవిస్తారని , లేదు ఈరోజు మధ్యాహ్నం నుంచి స్కూల్ సెలవని. ఈలోపులో చిన్న తెలుగు మాస్టర్ తన చక్కని స్వరం తో రేపు సెలవు, మళ్ళి ఎల్లుండే స్కూల్ అని నోటీసు చదువుతూ ఉండగానే మొదలయిన పిల్లల సందడి. ఈ సందడి కి ఆయన గట్టిగా ఒక కేక…ఆ కేక కి మళ్ళి పిల్లలు పిన్ డ్రాప్ సైలెన్స్.

ఈలోపులో ఇంటర్వెల్ బెల్ కొట్టాడు పొడుగు కాళ్ళ భూషణం, గంగయ్య పని మీదకి బయటికి వెళ్లడంతో. అంతే ఒక్క ఉదుటున పిల్లలంతా పరుగు పెట్టుకుంటూ గ్రౌండ్ లో కి కొంత మంది, మంచి నీళ్లు తాగుదామని నేను, భట్నవిల్లి నాగరాజు గాడు, రమేషు, జాను గాడు, ఆసు గాడు బయలుదేరాం కాలువ అవతలపక్కనున్న ధాన్యం మిల్లు నుయ్య దగ్గెర కి. అప్పటికే చాల మంది నీళ్లు దోసిళ్ళలో తాగేస్తున్నారు. నాగరాజు గాడు అన్నాడు నేను నీళ్లు తోడుతా, మీరందరూ దోసిళ్ళు పట్టండి అని.వాడు నీళ్లు పోస్తూ..పోస్తూ..ఆసు గాడి బట్టల మీద పోసేసాడు. వాడు ఒకటే ఏడుపు. వాణ్ని సముదాయించడానికి నాగరాజు గాడు సత్యనారాయణ బడ్డీ కొట్లో గరగర డ్రింక్ (ఐస్ ని అరగదీసి, దాంట్లో ఏదో కలర్ కలిపి, పైన సేమ్యా వేసి) తాగించాడు.వాడి తో పాటు మాకందరికీ ఇప్పించి, మిగతా చిల్లర ని లెక్కెట్టుకుని పై జేబులో వేసుకున్నాడు.కొంతమంది పిల్లలు అప్పుడే వచ్చి సైకిల్ మీద పెట్టిన పీచుమిఠాయి లు కొనుక్కుని తింటూ స్కూల్ గోడ మీద వేసిన సినిమా పోస్టర్ లని చూస్తున్నారు.

అప్పుడే హిందీ టీచర్ మెల్లగా క్లాస్ లో కి వెళ్తోంది. హమ్మయ్య ఇప్పుడు మనకి హిందీ క్లాస్ అనుకుంటూ నాగరాజు ఇప్పించిన గరగర డ్రింక్ ని ఇంకా గుర్తు తెచ్చుకుంటూ క్లాస్ లో కి జారుకున్నాం.

సమయం ఒంటిగంట పది నిముషాలు. ఈసారి గంగయ్య లాంగ్ బెల్ కొట్టాడు. ఈ లాంగ్ బెల్ కి కొంత మంది పిల్లలు ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్ లను ఓపెన్ చేసేసి తినడం మొదలెట్టారు. శేఖర్ గాడు తో పాటు అందరం ఈ సారి సంత పాకల మీద నుండి కాకుండా. తిరిగి రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. ఆనందరావు బడ్డీ దగ్గెర వచ్చేటప్పటికి దాహం వేసింది. ఆసు గాడు గోలి సోడా తాగుదామా అని అన్నాడు. శేఖర్ గాడు ఇప్పుడు తాగకూడదు అంటూ పక్కన ఉమ్మాడు. అప్పుడే పెద్దగాఢవిల్లి బస్సు టర్నింగ్ తిరుగుతోంది భీమన పల్లి రోడ్డుకి. పదండి పదండి అంటూ నరేష్, సురేష్ లు వెనకాల వస్తూ తొందర పెట్టారు.

గుడి పక్క కాన్వెంట్ దగ్గెర వచ్చేటప్పటికి అక్కడ కాన్వెంట్ పిల్లలు కనిపించారు. ఆసుగాడు ఊరుకోకుండా..”కాన్వెంట్ పిల్లలు కాకరకాయ ముక్కలు” అన్నాడు….నేను తగులుకుని “చిన్న స్కూల్ పిల్లలు చింత కాయ ముక్కలు అని అన్నా .అప్పుడే అటువస్తున్న పొట్టి సురేష్ గాడు “హైస్కూల్ పిల్లలు ఆవకాయ డొక్కలు అనేసి పారిపోయాడు”.వాడిని తరుముతూ మొత్తానికి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు.

రేడియో లో ప్రాంతీయ వార్తలు వస్తున్నాయి. గబా గబా అన్నం తినేసి, మళ్ళి అదే గ్యాంగ్ మధ్యాన్నం స్కూల్ కి బయలు దేరుతుంటే, విస్సప్ప గారి ఇసక కొట్లో మామిడి కాయలు కనిపించాయి జాను గాడికి. ఒక రాయి పైకి చెట్టు మీద కి విసిరాడు. అప్పుడే గేదెలని తీసుకుని కుమ్మరి మాలక్ష్మి వస్తోంది. జాను గాడు వేసిన రాయి గేదె తోక మీద పడింది. వెంటనే కుమ్మరి మాలక్ష్మి గట్టి గా అరుస్తూ ఉండగానే మళ్ళి స్కూల్ కి బయలుదేరాం.

గానుగ నూనె గానుగ నూనె అంటూ సైకిల్ మీద ఎవరో వీధిలో అమ్ముతూ వెళ్తున్నాడు దూరం గా. సంచి లని దులుపుకుంటూ పెద్ద లు సంత కి వెళ్తున్నారు కూర లు కొనుక్కోవడానికి.

సంత లో వేరుశెనగ పప్పు అచ్చు కొనుక్కోవాలి రా సాయంత్రం సంత కి వెళ్లినప్పుడు, అలాగే వెళ్తూ వెళ్తూ శరభయ్య బెల్లం కొట్లో బెల్లం ముక్క తినాలి అని స్కూల్ కి వెళ్తూ అన్నాను . అవును అక్కడ నానాజీ గాడు ఉంటాడు వాన్నడిగితే చిన్న ముక్క కూడా పెట్టలేదు లాస్ట్ వారం అని ఎవడో అన్నాడు. ఏరా సాయంత్రం బస్సు ఆట ఆడదామా లేదా దొంగా పోలీస్ ఆడదామా అని అడిగాడు పి. రమేష్. దొంగా పోలీస్ వద్దు రా బాబు, మొన్న మూడో వీధిలో ఆ ఇంట్లో దాక్కుంటే తెగ తిట్టేసారు అని ఆసు గాడు కొంచం దీనం గా అన్నాడు. ఈ మాటల్లో నే స్కూల్ వచ్చేసింది.

మధ్యాన్నం చెన్నా సాహెబ్ గారి సోషల్ క్లాస్ నడుస్తోంది. మళ్ళి గంగయ్య క్లాస్ లో కి మెల్లగా ఆయన చెవిలో వచ్చి ఏదో ఊదాడు. పొద్దున్నే వచ్చి నోటీసు తెచ్చి మా కందరికీ తీపు కబురు “రేపు సెలవు” అని చెప్పేసాడు కదా మళ్ళా ఏంటి ఈ చెవి లో ఉపదేశాలు అని అనుకుంటుండగానే, ఇదిగో కుర్రాళ్ళు! నంది కేశుని నోము అంట ఊళ్ళో, కాబట్టి మీరు అక్కడకి వెళ్లి తినేసి వచ్చేయండి అనేసి కుర్రాళ్ళకి ఆదేశం. పక్కనే ఉన్న దూనబోయిన నాగరాజు గాడు,దొంగ త్రినాథ్ బాబు లు ఒరేయి అవన్నీ మీకే అంట తినేసి వచ్చేయండి అనేసి అన్నారు నవ్వుతూ. అవును రా … స్పెషల్ పర్మిషన్ వచ్చిందట హెడ్ మాస్టర్ దగ్గెర నుంచి అనేసి, విజయ గర్వం తో భట్నవిల్లి కుర్రాళ్ళు లతో పాటు,అందరమూ సాయం కాల స్నాక్స్ కి నంది కేశుని నోము ని పండించడానికి బయలుదేరాం. అందర్నీ కూర్చో బెట్టారు, విస్తళ్ళు వేశారు. తినే ముందరే చిన్న సైజు వార్నింగ్ ఇచ్చారు కూర్చున్న పిల్లలకి. “ఆకులో పెట్టింది వదిలారో, తస్మాత్ జాగ్రత్త” అంటూ. వడ్డించడం మొదలెట్టారు. పెడుతూనే ఉన్నారు.తింటూ ఉండగానే మళ్ళి వడ్డిస్తున్నారు.పాయసం వేస్తూనే ఉన్నారు.తిన తిన లేక తింటూ, తినకపోతే హెడ్ మాస్టర్ గారు ఏమి అనేస్తారో అని భయపడుతూ, తింటూ తింటూ, ఆయాసపడుతూ మొత్తానికి తినేసి బయట పడ్డాం. నంది కేశుని నోము కి మా లాంటి అమాయక కస్టమర్స్ ని గుర్తించి, హెడ్ మాస్టర్ తో మాట్లాడి,మరీ స్పెషల్ పర్మిషన్ తీసుకుని, మమ్మల్ని అందర్నీ స్కూల్ నుంచి తీసుకు వచ్చి ఆ విందుకు మీరే ముందు అని చెప్పిన బుచ్చి మాస్టర్ గారి మణి గారిని ఆ నోము విషయం లో ఎప్పటికీ మర్చిపోలేరు.

ఏరా సంత లో కి వెళ్తున్నా, వస్తావా వేరుశెనగపప్పు అచ్చు కొనుక్కుందాం. అలాగే వెళ్తూ వెళ్తూ శరభయ్య బెల్లం కొట్లో బెల్లం ముక్క తిందాం, వస్తూ వస్తూ జీళ్లు కొనేసుకుని వచ్చేద్దాం అని ఎవడో బయట నుండి అడుగుతున్నట్టు అనిపించింది. నాకు డౌట్ వచ్చింది. వీడు ఆ నోముకి వచ్చి ఉండడు అందుకే అడుగుతున్నాడేమో అని అనుకుని , నో.. నో ..అంటూ ఆ నోము ని తలచుకుని ఇంట్లో కి పరిగెత్తేసా..

ఇంకా చీకటి పడలేదు. ఆటలు ఆడుకోవడానికి ఎవరు రాలేదు. ఎవరింట్లో పిల్లలు అక్కడే ఉన్నారు. బయటికి వస్తే మళ్ళి ఆ విందు కు మీరే ముందు అంటారేమో అని అన్ని బంద్ చేసుకుని ఇంట్లోనే ఉన్నాం.
************************************************************************
రేపు బుధవారం. లెక్కలు నోట్ బుక్ లో రైట్ సైడ్ మార్జిన్ వంకర గా వచ్చింది. అది సరి జేసుకోవాలి. లేకపోతె….జామ కర్ర…

******************
ప్రసాద్ ఓరుగంటి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s