ఎర్ర కాలువ (ఎర్ర ని థ్రిల్లర్ కథ)

క్కడ ప్రదేశం చిమ్మ చీకటి గా ఉంది. ఒక ఆతను సైకిల్ మీద వెళ్తూ అక్కడ ఆగాడు. అక్కడున్న చిన్న కాలువ దాటి అటుపక్క గట్టు మీద కి వెళ్ళడానికి, సైకిల్ పైకెత్తుకుని, చిన్ని కాలువలో కి దిగాడు. నీటిలోకి దిగినెంటనే అతనికి నీళ్లు కాళ్ళకి చల్లగా తగులుతున్నాయి. సైకిల్ పైన ఎత్తుకుని, నడుస్తుండడం తో అతనికి చెమటలు బాగా పడుతున్నాయి. అటుపక్క, గట్టుకి చేరేలోపులో నీళ్లు వేడెక్కి, సల సల మని బుడగలు వస్తున్నాయి.

అప్పటిదాకా చల్ల గా ఉన్న అతని కాళ్ళు, వేడికి బొబ్బలెక్కుతున్నాయి. ఆ చిమ్మ చీకటిలోనీళ్లు ఎర్రగా మారి అతనికి కనిపిస్తున్నాయి. ఆ కాలువ గట్టు పక్కనున్న చెట్టు మీద నున్న ఒక పక్షి కిందకి చూస్తూ అరుస్తోంది. కాలువ లో నీళ్లు అన్ని ఎర్రగా మారి ఉన్నాయ్.సైకిల్ నీటిలో తేలుతూ ఎర్రగా కనిపిస్తోంది.
*******
తెల్లారింది. జనాలు ఆ కాలువ గట్టుదగ్గెర గుమిగూడి ఉన్నారు, నీటిలో నుంచి సైకిల్ ని తీశారు. చని పడి ఉన్న అతనిని కూడా వాళ్ళ బంధువులకి అప్పచెప్పారు. “అవును రా బాబు, ఇది నాలుగో ది. ఇంతకముందర కూడా ఇలానే జరిగింది. రాత్రి పూట కాలువ దాటుతుండగానే అనుకుంటా..మిగతా ముగ్గురు కూడా ఇలానే పోయారు” అంటూ చుట్ట తాగుతూ ఒకడు పక్కోడి కి చెప్తున్నాడు. “అవును. వీళ్ళకి దీని సంగతి తెలియదు అనుకుంటా” అని అవతల వ్యక్తి బుర్ర ఊపుతూ చెప్తున్నాడు. ఈలోపులో ఒక పోలీస్ వచ్చి “ఇక్కడనుంచి అందరూ వెళ్ళండి” అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అందరూ భయపడి మెల్లగా వెళ్తున్నారు. పోలీస్ చని పోయిన వ్యక్తి ని పరిశీలించి, “చాల్లే, ఇక ఇంటికి తీసికెళ్ళండి. దీని మీద ఇంకా విచారణ అక్కర్లేదు” అనేసి పక్కనున్న బడ్డీ లో చుట్ట తాగటానికి వెళ్ళాడు. బంధువులు మారు మాట్లాడకుండా ఆ మృతదేహాన్ని ఎడ్ల బండి లో తీసికెళ్లారు.

పది రోజుల తరువాత...

తెల్లవారు జాము మూడు గంటల 15 నిముషాలు. చిమ్మ చీకటి గా ఉంది. ముగ్గురు స్నేహితులు సైకిల్ మీద వెళ్తూ, కాలవ ని చూసారు. చుట్టూ ఏమి తిరిగి వెళ్తాములే, చూడ్డానికి చిన్న గా ఉంది కదా ,సైకిల్ నెత్తి మీద పెట్టేసుకుని వెళ్లిపోదాం అని ఒకడున్నాడు. సరేలే అని మిగతా ఇద్దరూ అన్నారు. ఒకడు కాలువలో దిగి సైకిల్ ని భుజానేసుకుని కాలువలో కి దిగాడు. రెండో వాడు కూడా మెల్లగా దిగాడు. మూడో వాడు దిగేలోపులో పైనుంచి ఒక పక్షి నెత్తి మీద నుంచి వెళ్ళింది .మూడో వాడు ఉలిక్కి పడి, అది ఎటు వైపు వెళ్లిందా అని చీకట్లో నుంచి చూస్తూ, అలాగా కాలువ వైపు చూసాడు…ఎర్రగా మారిన నీళ్లను చూసి భయపడి కెవ్వున కేక వేసాడు. గట్టి గా అరుస్తున్నాడు ఇవతల వైపు గట్టునుంచి. మిగతా వాళ్ళ ఇద్దరి జాడ తెలియలేదు. అరుస్తూనే ఉన్నాడు భయం తో….చెట్టు మీద పక్షి ఆరుస్తోనే ఉంది. సైకిల్ పక్కన పడేసి ఇంకో పక్క రోడ్డు వైపు పరిగెత్తాడు అరుస్తూ..

****

మళ్ళి తెల్లారింది. అదే జనాలు అక్కడ గుమి గూడారు. వీళ్ళతో కలిపి ఇరవై అని లెక్క పెడుతున్నాడు ఆ కాలువ పక్కనున్న బడ్డీ కొట్టు లో బీడీలు అమ్ముతూ భద్రయ్య. అదే పోలీస్ వచ్చి లెక్కలు రాసుకుని, “ఇక తీసికెళ్ళండి ఆ మృతదేహాలని” అని గట్టి గా అరిచాడు. అందరూ మెల్లగా సర్దుకుంటున్నారు. ఒక పదిహేనేళ్ళ కుర్రాడు పరమేశం వచ్చి భద్రయ్య తో “ఇక్కడ ఒక చిన్న బోర్డ్ పెట్టి రాత్రి పూట కాలువ దాటొద్దు అని పెట్టచ్చు కదండీ. చదువు వచ్చిన వాళ్ళు అది చదువుకుని ఈ కాలువలో దిగరు కదండీ” అని చిన్న సలహా పడేసాడు. “పోరా నువ్వు చెప్పేదేమిటి జనాలు కి ఎలా రాసి పెడితే ఆలా జరుగుతుంది పో ఇక్కడ నుంచి” అని గట్టి గా అరిచాడు పోలీస్ .పోలీస్ అరుపులకి అక్కడనుంచి వెళ్లిపోతూ పరమేశం సలహా విన్న అదే వయసు కుర్రాళ్లు కూడా పరమేశం తో చేరారు. “అవును పరమేశం మనం ఒక చిన్న బోర్డు పెడదాం రాత్రి వచ్చి” అనేసి అందరూ వెళ్లి పోయారు.

రాత్రి అయ్యింది. పరమేశం మరియు మరో ఇద్దరూ స్నేహితులు వచ్చి, చిన్న అట్ట మీద “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ప్రమాదం అని రాద్దాం” అని సలహా ఇచ్చాడు ఒకడు. పరమేశం వచ్చి “ప్రమాదం కాదు ఛస్తారు” అని రాద్దాం అనేసి ఆ కాలువ పక్కకి దిగి ఈ బోర్డ్ పెడుతూ ఉంటే ఒకడు కాలు జారీ కాలువ లో కి పడి పోయాడు.. వాడిని పట్టుకుందామని ఇంకోడు కూడా కాలువలో కి జారిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న పరమేశం కూడా వాళ్ళ ఇద్దర్ని కాపాడాలని కాలువలో కి దూకేసాడు. ముగ్గరూ కాలువలో ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ భయం గా ఉన్నారు. చీకటిలో నీటి తరంగాలు కనిపిస్తున్నాయి. “రండి ఇక వెళ్దాం” అని పరమేశం అంటూ ఉండగానే మిగతా ఇద్దరికీ నీళ్లలో కింద ఏదో కాళ్ళను పట్టేసినట్టు అరుస్తున్నారు. గట్టిగా అరుస్తూనే ఉన్నారు. నీళ్లు ఎర్రగా మారుతూ ఉన్నాయ్. పరమేశం కూడా దూకేసి వద్దామనుకునే లోపులోనే అంతా జరిగిపోయింది…నీళ్లు ఎర్రగా ఉన్నాయి. చెట్టు మీద ఎప్పటిలాగానే పక్షి అరుస్తూనే ఉంది..కాలువ పక్కనున్న బోర్డు మాత్రం గంభీరం గా తెలియచేస్తోంది, “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ఛస్తారు “ అని..

యధావిధి గా సూర్యుడు తన పని తానూ చేసుకుపోతున్నాడు. బడ్డీ కొట్టు భద్రయ్య మాత్రం ఈసారి కొంచం దిగులుగా నే ఉన్నాడు. ఎందుకంటె పోయిన ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఆ ఊరి వాళ్లే కాబట్టి. పోలీస్ వచ్చి అక్కడున్న బోర్డు ని చూసి “కుర్రాళ్ళు పాపం బాగానే పెట్టారు కానీ, అది మాత్రం వాళ్ళని వదల్లేదు” అంటూ “ఇక తీసికెళ్ళండి ఎలాంటి విచారణ ఉండదు ఈ శవాలకు. ఇదిగో భద్రం, నీ బడ్డీ కొట్టు కూడా తీసేయ్ ఇంకా ఎవర్ని ఇక్కడ రాకుండా చేద్దాం” అని, పోలీస్ గట్టిగా అరిచాడు. చుట్టు పక్కలనున్న చిన్న చిన్న కొట్టులని తీసేసారు. అందరూ వెళ్లి పోయారు. బోర్డు మాత్రం నించుంది. కాలువ లో నీరు యధావిధిగా పారుతోంది.
****
పది ఏళ్ళు తరువాత

ముగ్గురు పాతికేళ్ల కుర్రాళ్ళు ఆ ఊరి మీద, అక్కడున్న కాలువ మీద పరిశోధిద్దామని పట్నం నుంచి ఆ ఊరి కి వచ్చారు. అప్పటికే ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లు తో మూసికొని ఉంది. జన సమాచారం లేదు. పక్షులు చెట్ల మీద అరుస్తున్నాయి. ముగ్గురు కుర్రాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి ని వెనక వేసుకుని అక్కడ తెంచుకున్న కర్రలతో దారికి అడ్డం గా ఉన్న మొక్కలను తీస్తూ కాలువ దగ్గెర కి వెళ్తున్నారు.దూరం గా మట్టికొట్టుకుని పోయిన బోర్డు కనిపించింది, అక్షరాలు స్పష్టం గా లేవు..ముగ్గురు దగ్గెర కెళ్ళి చూసారు..”రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, చస్తారు” అని ఉంది. ముగ్గురు నవ్వుకున్నారు. పాపం ఎవడో ఇలా బోర్డు పెట్టి అందర్నీ భయపెట్టేసి ఉంటాడు అని ఒకడున్నాడు. అరె కానీ, చాలా మంది చచ్చి పోయారు కదా! అది మనం విన్నాం కదా…ఇక్కడేదో ఉంది అని రెండో వాడు అన్నాడు. అవును మనం వచ్చింది అందుకే పరిశోధించడానికే చూద్దాం ఏమి ఉందొ ఇక్కడా, అయితే రాత్రి దాకా వెయిట్ చేయాలా అని కొంచం కర్ర ని అటు ఇటు తిప్పుతూ అన్నాడు.

కర్ర జారీ కాలువ లో కి పడింది. కర్ర తీద్దామని వెళ్లే లోపులో కాలువ లో నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. ముగ్గురు యువకులు పైనుంచే చూస్తున్నారు కాలువ వైపుకి. కాలువ లో పడిన కర్ర గిరా గిరా తిరుగుతోంది. చెట్టు మీద నున్న పక్షులు అరుస్తున్నాయి. వీళ్ళలో ఒకడు కెమెరా తీసి ఆ నీళ్లలో కర్రని ఫోటో తీస్తున్నాడు. కర్ర తిరుగుతూ తిరుగుతూ ఎర్రగా మారింది. వీళ్ళు అందరూ గట్టు మీదే కూర్చుని మొత్తం జరిగింది రాసుకున్నారు. ఫోటో లు తీశారు. గాలి మొదలయ్యింది అకస్మాత్తు గా. రాస్తున్న పేపర్లు ఎగిరిపోయాయి. వెంటనే వీళ్ళు కొంచం పైకెళ్ళి అక్కడున్న చెట్టు కొమ్మల్ని గట్టిగానే పట్టుకున్నారు. కింద నీళ్లు ప్రశాంతం గానే ఉన్నాయ్. బోర్డు మాత్రం దీనం గానే చూస్తోంది.

చీకటి పడుతోంది. ఈ ముగ్గురు తెచ్చుకున్న ఆహారాన్ని ఒక చెట్టుకింద కూర్చుని తింటున్నారు. తింటూ కాలువ వైపు టార్చ్ లైట్ వేస్తూ చూస్తున్నారు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని…ఏమి చేద్దాం ఇప్పుడు అని ఒకడున్నాడు. ఏముంది. కాలువలో దిగి చూద్దాం అని ఇంకోడు సమాధానం ఇచ్చాడు. వద్దు ఇప్పుడు దిగద్దు, రాత్రి అంతా, ఇక్కడే కూర్చుని చూద్దాం అని మూడో వాడు అన్నాడు. అలాగే అని ముగ్గురు టార్చి లతో కాలువ వైపు చూస్తూ అక్కడున్న కర్రలని, రాళ్ళని కాలువలో వేస్తూ చూస్తున్నారు. నీళ్లు ఎర్రగా మారడం, వేసిన వస్తువులు నీళ్లలో గిరగిరా తిరగడం చూస్తున్నారు. ఇదంతా మళ్ళి పేపర్ లో రాసుకున్నారు.

కొన్ని పక్షులు చెట్లు మీద నుంచి అరవడం మొదలెట్టాయి. ఒకడు చెట్టు మీద టార్చ్ వేసి చూసాడు. ఏమి కనపడలేదు. కాలువలో కేసి చూసాడు. కాలువ లో రెండు పెద్ద వింత ఆకారం తో ఏదో జంతువూ తిరుగున్నట్టు కనిపించింది. టార్చ్ వేస్తూ, ఇంకోడు ఫోటో తీసాడు. ఈసారి పెద్ద బండ రాయిని కాలువ లో కి పడేసారు. ఆ చెప్పుడి కి పైన పక్షులు టప టప రెక్కలు ఆడించు కుంటూ యెగిరి పోయాయి. కాలువ లో వేసిన బండ రాయి వలన తరంగాలు వస్తున్నాయి. ఈసారి ఒకడు కాలువ దగ్గెర కెళ్ళి కర్ర ని వేసాడు.

వెంటనే వింతైన ఆకారం లో ఉన్న ఆ జంతువూ కర్ర ని తిప్పుతూ నోటిలో నుంచి ఊదుతోంది. ఆ గాలి కి అక్కడున్న నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. మిగతా ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి అదే పని చేస్తున్నారు. మొత్తానికి మన పరిశోధన లో విజయం సాధించాం. ఈవిషయాన్ని మన వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు అని అంటుండగానే…కాలువ లో నుంచి వచ్చి ఆ వింత జంతువూ అకస్మాత్తు గా నీళ్లు చిమ్మింది. దాంతో ముగ్గురు ఒడ్డునున్న కుర్రాళ్ళు కాలువలో కి పడిపోయారు. నీళ్లు ఎర్రగా మారాయి. ముగ్గురులో ఒకడు మాత్రం ఒడ్డు వైపు కి వచ్చి పైకి పరిగెత్తాడు. మిగతా ఇద్దరూ రాలేకపోయారు…కాలువ లో ఉన్న ఇద్దరూ విగత జీవులయ్యారు.

పైన ఉన్న పేపర్ లని, ఫోటో లని తీసుకుని భయం తో పరిగెత్తాడు. కొంత దూరం తరువాత అలసి, కళ్ళు తిరిగి పడిపోయాడు.
************
“సార్! సార్ ! యెర్ర వంతెన స్టాప్ వచ్చింది” అంటూ ఎవరో లేపుతున్నారు. “ఓహ్ మనం ఇక్కడే దిగాలి కదా , అవును మళ్ళీ పాతికేళ్ల తరువాత యెర్ర కాలువ ని చూస్తున్నా” అనుకుంటూ కంగారు గా బస్సు దిగాడు సుధాకర్ తన స్టాఫ్ మెంబెర్ తో. ఆ ప్రాంతమంతా బాగా అభివృద్ధి చెందింది. మెల్ల గా వెళ్లి అక్కడున్న ఐస్ క్రీం పార్లర్ లో “ఈ కాలువ పక్కన ఒక బోర్డు ఉండేది మీకు తెలుసునా” అని ఒక పెద్దాయనని అడిగాడు. “అది మొన్నటివరకు ఉండేదండి. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో తీసేసి బయట పడేసినట్టున్నారు. ఇంతకీ మీరు ఎవరు” అని ఆ పెద్దాయన అడిగాడు. “నేనా!” అని ఒకసారి నవ్వుకుని..”పాతికేళ్ల కిందట ఇక్కడా కాలువ మీద పరిశోధన చేయడానికి ముగ్గురు వచ్చాము. వాడి లో ఒకణ్ణి నేను” అని సుధాకర్ చెప్పాడు. ఆ పక్కనే ఐస్ క్రీం తింటున్న కుర్రాళ్ళు “ఇంటరెస్ట్ గా ఉంది సార్. ఈ విషయం మేము కూడా విన్నాం…అసలు ఏమి జరిగింది సార్ ఈ కాలువ లో” అని ఆత్రుత గా అడిగారు.

సుధాకర్ ఐస్ క్రీం తింటూ అప్పటి విషయాలు చెప్పడం మొదలెట్టాడు. “అప్పుడు నేను ఒక్కణ్ణి తప్పించుకుని బయట పడ్డాను. ఆ తరువాత ఆ పేపర్ లు, ఫోటో లు పోలీస్ ల కిచ్చి మొత్తం జరిగిందంతా చెప్పాను. పోలీస్ లు, గ్రామస్తులు కలిసి ఒక ప్లాన్ ప్రకారం అందరం అక్కడకు చేరుకొని ఆ వింత జంతువుల ని చంపేసాం. అవి మొసలి లా నీటిలో ఉండేవి.కానీ అవి విషాన్ని ఊదేటప్పటికీ చల్లగా ఉండే నీరు, వెంటనే సల సల మని బొబ్బలెక్కే వేడి నీరు గా మారడం, ఆ తరువాత నీరు ఎర్రగా మారడం . ఆ విష ప్రభావం తోను, నీటి వేడికి మనుషులు వెంటనే భయపడి చనిపోయేవారు .ఇప్పటికీ అవి ఈ కాలువలో కి ఎలా వచ్చాయో నా పరిశోధనలో తేల లేదు” అని సుధాకర్ అక్కడున్న కుర్రాళ్లతో చెప్పాడు . అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టి “థాంక్ యూ సార్ మీకు. మీ వలన ఇప్పుడు ఆ వింత జంతువులు లేవు, తరువాత ఆ కాలువ మీద నుంచి వంతెన వేశారు” అని అన్నారు.

**********

చీకటి పడుతోంది. ఎర్రవంతెన మీద నుంచి బస్సులు, కార్లు బిజీ బిజీ గా వెళ్తూనే ఉన్నాయి. సుధాకర్ కి దూరం గా కాలువ పక్కనే పడిపోయిన బోర్డు కనిపించింది. బోర్డు మీద అక్షరాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ఛస్తారు “ అని. అది చూసుకుని ఒకసారి నవ్వుకున్నాడు. దూరం గా కాలువ లో నీళ్లు ఎర్రగా మారడం గమనించాడు. మళ్ళి ఒకసారి గాల్లో కి చూసి నవ్వుకుని అవును ఈ నీళ్లు దుమ్ము, దూళి వలన వచ్చే ఎర్రటి నీరు అని అనుకుంటూ..పైకెళ్తున్నాడు.వెళ్తూ వెళ్తూ చిన్న కర్ర ని పడేసాడు కాలువలోకి .
నీళ్లలో పడిన కర్ర గిరా గిరా తిరుగొంది……నీళ్లు ఎర్రగానే ఉన్నాయ్.
*******************
Story Written By
ప్రసాద్ ఓరుగంటి

Note: కథ, కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s