పొలం పిలిచే.

అది హైదరాబాద్ మహా నగరం.

పరంధామయ్య, ఇంటి పెరట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలకి నీరు పోస్తున్నాడు.పోసిన నీరు వెంటనే ఇంకి పోతోంది. ఆ మొక్కలకు కావలసినంత నీరు పోసి, కుళాయి దగ్గర కాళ్లు, చేతులు కడుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ లోపులో తాతయ్యా అంటూ స్కూల్ నుంచి వచ్చిన మనవడు ఏమి చేస్తున్నావు అని పలకరింపు, ఈ గార్దెన్ లో అంటూ. అదేరా…చూడు ఈ మొక్కలకి నీళ్లు పోస్తున్నా..ఇప్పుడు చిన్నవి గా ఉన్నాయి కదా…నువ్వు పెద్ద అయేటప్పటికీ అవి కూడా నీలాగే పెద్దయి, పండ్లు , పూలు ఇస్తాయి అంటుండగానే, తుర్రున లోపలకెళ్లిపోయాడు ఆ మనవడు. ఈ లోపులో కిచెన్ లో నుంచి మావయ్య గారు టీ రెడీ గా ఉంది. వచ్చి తాగండి అని ఆ పరంధామయ్య కోడలు చెప్పింది . హా వస్తున్నా అని పరంధామయ్య మెల్లగా వెళ్లి కుర్చీ లో కూచుని టీ తాగుతున్నాడు.

అప్పుడే పరంధామయ్య కొడుకు గిరీష్ కూడా కార్ ని పార్క్ చేసుకుని, ఇంటిలో కి అడుగుపెట్టాడు. టీ తాగుతున్న పరంధామయ్య ని చూసి, నాన్నా మన ఊళ్ళో ఉన్న పొలం మంచి గిరాకీ వచ్చేలా ఉంది. మన ఊళ్ళో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి చూసారుట. నిన్న రియల్ ఎస్టేట్ రాజన్న కాల్ చేసాడు. ఆ పొలాన్ని మూసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం, ప్లాట్ ప్లాట్ లు గా చేసేసి అమ్మేస్తే మంచి రేట్ వస్తుంది అని అంటున్నాడు.. ఏమంటావు నాన్నా అంటూ, టీ తెమ్మని సైగ చేస్తున్నాడు కిచెన్ లో ఉన్న భార్యకి.

********************

అది లండన్ సిటీ.

రాజేశ్వరరావు, లండన్ లో నున్న కూతురు కుశల ఇంట్లో TV లో అన్నదాత ప్రోగ్రాం చూస్తున్నాడు.ఆ వచ్చే కార్యక్రమాల్ని చాల ఆసక్తి గా వింటూ చూస్తున్నాడు. పది ఏళ్ళ మనవడు నిఖిల్ పాలు తాగుతూ వచ్చి, ఏంటి తాతా ఆవుల్ని, గడ్డి ని, దూడల్ని చూస్తున్నావ్, ఫన్నీ గా. చాలా ఏనిమేటెడ్ చానెల్స్ ఉన్నాయి, అవి ఇంకా చాలా బాగుంటాయి అని నవ్వుతూ అడిగాడు. లేదు రా నిఖిల్, యేవో కొత్త కొత్త టెక్నిక్స్ చూపిస్తున్నాడు. అవి కూడా చూసి, నేర్చుకుని అధునాతన పద్దతిలో ఎలాగ పశువుల్ని పెంచవచ్చు అని చూస్తున్నా అని అంటుండగానే, మనవడు నిఖిల్ తుర్రున పారిపోయాడు ఆడుకోడానికి .

ఏంటి నాన్న ఇంకా ఈ ప్రోగ్రాం లు మీరు ను…ఎంచక్కా ఏదైనా ప్రోగ్రాం లు చూసుకోవచ్చు గా, ఈ ఆవులు, గేదెలు కాకుండా, అని కూతురు కుశల కొంచం విసుగ్గానే అంటూ పకోడీ తీసుకొచ్చింది తండ్రి రాజేశ్వరరావు కి. అవును నాన్న, ఎప్పటినుంచో అడుగుదామని అనుకుంటున్నా నిన్ను. ఆ పశువుల్ని, పొలాన్ని అన్ని అమ్మేసి, మీరుకూడా మన ఊరునుంచి నుంచి ఇక్కడికో, అన్నయ్య ఇంటికో వచ్చేచు కదా….ఇప్పటిదాకా చేసింది చాలు ఆ పశువులకు సేవ అని అనేసి, ప్లేటులో రెండు పకోడీ లు నోటిలో వేసుకుని కిచెన్ లో కి వెళ్ళింది ఎగ్జిట్ ఫ్యాన్ వేయడానికి.

***********************

అది అమెరికా

గోవిందం, అతని భార్య, కొడుకు ఇంటికి అమెరికా వచ్చారు. తాతా ! నానమ్మ! , మనం ఇప్పుడు చెర్రీ, స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కి వెళ్తున్నాం అంది తొమ్మిదేళ్ల చిన్నారి తన తాత గోవిందం తో హ్యాపీ గా గెంతుకుంటూ. అవును నాన్న, మనకి దగ్గెర లో చెర్రీ , స్ట్రాబెర్రీ పండ్ల తోటలు ఉన్నాయ్, అక్కడికి వెళ్లి చెట్టుకి వేలాడే పండ్లను కోసుకుని, కావలిసినవి అక్కడే తినేసి, ఇంకా కావాలంటే, కొన్ని కొనుక్కుని వచ్చేద్దాం అన్నాడు వెంకటేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో.సరేరా చూసొద్దాం ఆ తోటలని, ఆ పండ్లని అంటూ అంతా బయలుదేరారు కార్ లో ఆ తోటలకి.

గోవిందం చూస్తున్నాడు ఆ చెర్రీ, స్ట్రాబెర్రీ తోటలని. చాల మంది పిల్లా, పాపలతో వచ్చి ఆ చెట్టు మీద నున్న పండ్లను కోసుకుంటూ, కొన్ని సంచి లలో సర్దుకుంటున్నారు. పిల్లలు ఆ తోటల మధ్య నుంచి పరిగెడుతూ ఆడుకుంటున్నారు. గోవిందం కొడుకు వెంకటేష్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను నోట్లో పెట్టుకుని తండ్రి తో అంటున్నాడు. నాన్నా మన మామిడి తోటలు ఊళ్ళో ఎలా ఉన్నాయ్, అవును కదా ఈ ఏడు బాగానే వచ్చాయి అన్నావు. లాస్ట్ సంవత్సరం తుఫాను దెబ్బకి అన్ని కాయలు రాలిపోయాయి, ఏమి మిగలలేదు అన్నావ్. ఎందుకు నాన్నా ఇంక అవి, మంచి గా చెట్లు కొట్టించేసి, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టేద్దాం, ఎలాగ మనకి అది హైవే దగ్గెర లో ఉంది కదా అని తింటూ అంటున్నాడు. ఆ తింటూ మాట్లాడడం లో కొన్ని పదాలు అర్ధమయ్యాయి, కొన్ని సరిగా వినపడలేదు గోవిందానికి . కానీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టేద్దాం అనేది మాత్రం వినిపించింది గోవిందానికి. గోవిందం కూడా రెండు స్ట్రాబెర్రీ పండ్లు నోట్లో పెట్టుకుని చూస్తున్నాడు ఆ చెట్ల వైపు.

******************

హైదరాబాద్ లో నున్న పరంధామయ్య, కొడుకు గిరీష్ అన్న మాటకి  పెరటి వైపు చూసాడు. అప్పుడే నీళ్లు పోసిన మొక్కలు చిన్న చిరుగాలితో వయ్యారం గా ఊగుతూ పరంధామయ్యని పలకరిస్తున్నట్టు గా ఉన్నాయి. ఆ పలకరింపు తనని ఊళ్ళో ఉన్న పొలం వైపుకి తీసికెళ్ళింది.

పరంధామయ్య కి ఊళ్ళో ఐదు ఎకరాలు పంట చేలు, రెండు ఎకరాల కొబ్బరి ఉంది.. కష్ట పడి వ్యవసాయం చేసుకుంటూ గిరీష్ ని బాగా చదివించాడు.తను పొద్దునే సైకిల్ మీద వెళ్లి వరి చేలు , తోటలని పలకరిస్తూ వస్తూ వస్తూ , పొలం లో ఉన్న ఆవు పాలు పితికి తేచ్చేయడం. ఇంటికి వచ్చిన తరువాత ఆవు పాలతో వేడి వేడి కాఫీ తాగేసి మళ్ళీ పొలం వెళ్లి, మధ్యాన్న బోజనానికి రావడం. ఇలాగ తన వ్యవసాయాన్ని చక్కగా చేసుకుంటూ ఆనందం గా జీవనం సాగిస్తున్నాడు భార్య, పిల్లాడి తో.

ఏరా…కోదండం , ఈసారి పెద్ద తుఫానంట. మనవి నిలుత్తాయా అని అడుగుతున్నాడు పరంధామయ్య, కోదండాన్ని. కోదండం, పరంధామయ్య ఇద్దరూ బాల్య స్నేహితులు. పూర్తి వ్యవసాయ దారులు. అసలే కోతలు సమయం ఇప్పుడు ఈ తుఫాన్ ఏంటి రా అని అనుకుంటూ లోపల ఇద్దరూ బాధ పడుతున్నారు.

రానే వచ్చింది పెద్ద తుఫాను. బోరున వాన. గాలి కూడా ఎక్కువైంది. కోదండం ఇంట్లో అటు ఇటు నడుస్తున్నాడు. ఇంకా భోజనం చెయ్యలేదు. పొలాన్ని పలకరించి ఐదు రోజులయ్యింది. అవి ఎలా ఉన్నాయో , ఏంటో అని లోపల చాలా బాధ పడుతున్నాడు. ఇదిగో! అలాగా, ఒకసారి పరంధామమయ్య ఇంటికెళ్లి వత్తా అని సావిడి లో నున్న గొడుగు తీసుకుని తన భార్య కి చెప్పాడు కోదండం . ఇంత గాలి వానలో ఎక్కడికండి, అయినా మీరు ఇంకా భోజనం కూడా చేయలేదు అంటూండగానే వెళ్ళాడు బయటికి కోదండం గొడుగేసుకుని.
****
తెల్లారింది..ఊళ్ళో జనాలు అందరూ గుమిగూడి ఉన్నారు. పరంధామయ్య ఏడుస్తూ అంటున్నాడు, అంత రాత్రి వేళా, గాలివానలొ పొలానికి ఎందుకెళ్ళావు రా చనిపోయిన కోదండాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. కోదండం భార్య కూడా ఏడుస్తోంది. అవును వీడికి ఒకటే తెలుసు. ఆ మొక్కలని, చేలు ని పలకరించకూడ ఉండలేడు. వాడికి వ్యవసాయం అంటే ప్రాణం. అది లేకపోతె తోచదు. ఈ సారి తుఫానుకి, చేతికి వస్తుందనుకున్న పంట నీటి పాలవడం, మొక్కలన్నీ పడిపోవడం వీడు చూడ లేకపోయాడు ..అందుకే వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ అక్కడున్న పెద్దలు అనుకుంటున్నారు.

పరంధామమయ్య ఇంకా జీర్ణించ లేకపోతున్నాడు, తన స్నేహితుడు పక్కన లేకపోవడం. పరంధామమయ్య కూడా కొబ్బరి తోటలన్నా, వరి చేలు అన్నా ఎంతో ఇష్టం.
ఎప్పుడైనా జ్వరం వచ్చి పొలానికి వెళ్లపోతే, అయ్యో అవి ఎలా ఉన్నాయో అని తల్లడిల్ల పోయే వ్యక్తి. తను పొద్దున్నే పొలం వెళ్లిన వెంటనే, వచ్చావా పరంధామయ్యా అంటూ పైర గాలికి చేలు ఊగుతూ, శుభోదయం చెప్తున్నట్టు గా ఉండేది . పరంధామయ్య ఇవన్నీ చూసి తను నిశ్చయించుకున్నాడు. తన కొడుకు తన లాగ వ్యవసాయదారుని గా కాకుండా మంచి చదువు చదివించి ఉద్యోగం చేయించాలనుకున్నాడు. తను వ్యవసాయం చేస్తూ , పంట ల వాళ్ళ వచ్చే ఆదాయం తో మొత్తానికి కొడుకుని బాగా చదివించాడు. కొడుకు కూడా బాగా గా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్ లో.
********
కొడుకు గిరీష్ అడిగిన మాటకి, పరంధామయ్య సమాధానం చెప్తున్నాడు. గిరీశు, ఏమి అనుకోకురా…ఆ పొలం మా నాన్న , అదే మీ తాత చిన్నపట్నుంచి ఉంది. దాని మీద మన ఇంట్లో ఎన్నో శుభకార్యాలు, అలాగే మంచి చదువులకు కూడా ఉపాయాగపడింది. అంతకన్నా నాకు అవంటే ప్రాణం రా. నాకు పొలం తప్పా ఇంకోటి తెలియదు. ఎప్పుడూ పొలాన్నే చూస్తూ, పెరిగాను. ఇప్పుడేదో, పొలం మూసేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పి పండే పొలాన్ని మూసేసి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేలెను రా…నువ్వు తప్పదు అంటే అలాగే చేద్దాం, నేను రాత్రి బస్సు కి మన ఊరెళ్తా అని కొంచం బాధతో చెప్పాడు.
************
లండన్ లో నున్న రాజేశ్వర రావు కూతురి కుశల మాటలకి, కొంచం నొచ్చుకున్నాడు. లేదమ్మా కుశల. నీకు ఎప్పుడూ చెప్పలేదు అనుకుంట. నేను మా అమ్మ, నాన్న ల దగ్గెర కంటే ఎక్కువు గా ఈ పశువులతోనే ఉండేవాడిని. పొద్దునే లేచి, మన పని వాళ్లతో పాటు నేను కూడా వెళ్లి, పశువులకు గడ్డిని వేసి, పాలు పితికి అవి ఇంట్లో కొంత, కొంత పాల కేంద్రం లో ఇవ్వడం, ఇలాగ చేస్తూ చేస్తూ..ఏదో బానే సంపాదించ. కానీ నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం అక్కడే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఒకరోజు పశువుల శాల కెళ్లకపోతే, అవి చాలా బెంగ పెట్టేసుకునేవి . అలాగే నాకు కూడా ఉండేది. ఇప్పుడు మన దగ్గెర యెంత మంది పని వాళ్ళు ఉన్నా, నేను మాత్రం వాటిలిని దగ్గెరకెళ్ళి పలకరించలేకపోతే నా మనసు బావుండదు కుశల.. నాకు నా బిడ్డలెంత ఇష్టమో, అవి కూడా నాకు అంతే ఇష్టము అమ్మా అంటూ కొంచం గద్గద స్వరం తో అంటున్నాడు కూతురు కుశల తో.
*********
అమెరికా లో చెర్రీ తోటలో కొడుకు మాట విన్న గోవిందం ఇలా అన్నాడు. ఒరే అబ్బి .. ఎవరి తోటో కానీ ఇది, వాళ్ళు చాలా మంచోళ్ళు రా… చూసావా ఇప్పటీకే పిల్లలు, పెద్దవాళ్ళు ఇలాంటి తోటలకు వచ్చి కావాల్సిన పండ్లు తిని, మిగతావి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే ఎప్పటికీ ఇక్కడ తోటలు ఉంటాయి. ఏదో ఇంకా ఎక్కువ డబులొచ్చేస్తాయని తోటలని కొట్టలేము రా. అప్పటికీ ప్రక్రుతి కోపానికి కొన్ని చెట్లు ఎలాగ పడిపోతూ ఉంటాయి. నీలాగా అందరూ ఆలోచిస్తే ఇంకా మన దేశం లో చెట్లు ఏమి ఉంటాయిరా అబ్బి, అన్ని బిల్డింగ్ లు తప్పా అని కళ్ళు తుడుచుకుంటున్నాడు కొడుకు కేసి చూస్తూ……..

*********************
నాన్న నాన్న, చెప్పేది విను. నేను కూడా వస్తున్నా నీతో పాటు ఊరికి అన్నాడు కొడుకు హైదరాబాద్ లో నున్న పరంధామయ్య తో. పరంధామయ్య కి అర్ధమవలేదు. అవును నాన్నా ! నేను అక్కడికి వచ్చేది వ్యవసాయం చేయడానికి. నీకు తెలియకుండా నేను కొంత భూమిని కొన్నా. నేను నా స్నేహితుడు కూడా వచ్చి ఇప్పటి ఆధునిక పద్దతులలో అక్కడ వ్యవసాయం మీద ఫోకస్ చేస్తున్నాం. నారు మడులు వేసినప్పట్నుంచి , పంట చేతికొచ్చేవరకు అయ్యే ఖర్చులు మీద ఎనాలిసిస్ చేసి, ఖర్చు ని తగ్గించి ఎక్కువ ఆదాయం వచ్చేదాని మీద ప్రస్తుతం పని చేస్తున్నాం. అసలు నీ అభిప్రాయమేమిటో తెలుసుకుందామని ఆలా అడిగాను, క్షమించు నాన్నా నా ప్రశ్న కి నువ్వు నొచ్చుకుని ఉంటె, అంటూ నాన్నా ని గట్టి గా పట్టుకుంటూ. నాకు తెలుసు నాన్న…దేశానికీ వ్యవసాయం యెంత ముఖ్యమో అని. నేను నీ బిడ్డ ని నాన్న, రైతు బిడ్డ ని అని కొంచం నెమ్మదిగా అన్నాడు. పరంధామయ్య కూడా కొడుకుని ఆనందం గా కౌగలించుకున్నాడు.

ఈ లోపులో మనవడు మొహం నిండా మట్టి తో పరిగెడుతూఉన్నాడు. ఏరా మనవడా..ఏంటది మట్టి మొహం నిండా అని అడిగాడు పరంధామయ్య.తాతా నేను మట్టి మనిషిని, నేను కూడా వ్యవసాయం చేస్తా…పెద్దయ్యాక. అంటూ పరిగెత్తాడు. పరంధామయ్య మళ్ళి అక్కడ మొక్కలవంక చూస్తూ ఆనందం తో కన్నీరు కారుస్తున్నాడు. మొక్కలు యధావిధి గా ఊగుతూ శుభ రాత్రి చెప్తున్నాయి పరంధామయ్యకి.
***********
లండన్ లో ఉన్న కూతురు, అయ్యో లేదు నాన్న…నేను సరదాగా అడిగా. అసలు నువ్వు ఏమి అంటావు అని. మీ అల్లుడు గారు కూడా పశువులంటే అంటే చాలా ఇష్టం.
తను కూడా ఇక్కడ డైరీ ఫారం పెట్టాలని అనుకుంటున్నారు. నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు నీతో వచ్చి పశువుల్ని పెంచడం నుంచి అన్ని నీ దగ్గెర నేర్చుకుని, అప్పుడు ఇక్కడ పెడదామని ఆలోచిస్తున్నారు.ఇక్కడ పెట్టడం కుదరకపోతే ఇండియా వచ్చేసి డైరీ మీద మాత్రం ఫోకస్ చేస్తా నని అంటున్నారు. అవును నాన్న నాకు తెలుసు నువ్వు యెంత కష్ట పడ్డావో , అలాగే నీకు పశువులంటే యెంత ఇష్టమో…..ఈ మాటలు విని రాజేశ్వర రావు కి ఏడుపు ఆగలేదు. కళ్ళు తుడుచుకుంటూ..సరే నమ్మా..మీ ఆయనికి పశువుల పేడ నుంచి శిక్షణ మొదలెడతాను అనగానే, తండ్రి కూతుళ్లు నవ్వుకున్నారు.

మనవడు నిఖిల్ పాలు తాగుతూ, తాతా…నేను ఈసారి ఇండియా వచ్చినప్పుడు నాకు పాలు పితకడం నేర్పవా, అని అడిగాడు..సరే రా మనవడా అని తాతా అన్నాడు.
*********************
అమెరికాలో చెర్రీ తోటల్లో నున్న గోవిందంతో కొడుకు ఇలా అన్నాడు. నాన్నా నేను అసలు నీ అభిప్రాయం తెలుసుకుందామని అని అడిగా..అంతే కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు. నేను ఎప్పుడు అక్కడ తోటలని కలలో కూడా అమ్మాలని అనుకోను.ఈ లోపులో కోడలు కూడా అందుకుంది.అవును మావయ్య గారు. ఎప్పుడూ ఈయన అక్కడి మావిడి తోటలు గురించే చెప్తూ ఉంటారు, మీరెంత కష్ట పడి వాటిల్ని పెంచి, చూస్తున్నారో. తను కూడా ఎప్పటినుంచో అలాంటి తోటల్ని కొనాలని అనుకున్నారు. మీకు తెలియకుండా ఈ మధ్యనే ఈ చెర్రీ, తోటల్ని కొన్నారు. మీకు surprise చేద్దామని. ఆ మాటలకి గోవిందం నోటివెంట మాట రాలేదు. అవును నాన్నా….ఇవి మిమ్మల్ని చూసే కొన్నాను…మీరే నాకు ఆదర్శవంతులు. అని బుగ్గన జారుతున్న కన్నీరును తుడుచుకుంటూ. గోవిందానికి కూడా ఏడుపు వచ్చేస్తోంది. ఏమి మాట్లాడాలో తెలియక.

అక్కడ పండ్లు తింటూ, తాతా నానమ్మ , ఇండియా లో ఉన్న మామిడి తోటల్లో కూడా ఇక్కడ లాగ మాంగో picking పెడదామా….అపుడు అందరూ సమ్మర్ లో ఎంచక్కా మామిడి తోటలకి వచ్చి , fruits ని కోసుకుని తినేసి, మిగతావి కొనుక్కుని ఇంటికి పట్టికెళ్తారు, అంతే గోవిందానికి నవ్వు ఆగ లేదు. అవునే చిన్నారి! అలానే చేద్దాం వచ్చే సమ్మర్ అలాగే చేద్దాం అక్కడ మన మామిడి తోటల్లో “రండి, వచ్చి కోసుకోండి” అని బోర్డు పెడదాం అంటూ నానమ్మ చిన్నారి ని ముద్దాడింది.
*************************************************************************************
మట్టి ని నమ్మి, మట్టి లో పెరిగి, ఆ మట్టి నుంచి బంగారాన్ని తీసే ప్రతీ వ్యయసాయ దారుడి కి నమస్సుమాంజలి చెప్తూ …..

**************

ప్రసాద్ ఓరుగంటి

Note: కథ, కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s