వెనక వీధి కుర్రాళ్ళు

సమయం: సాయంత్రం , నాలుగు గంటలు. నలుగురు కుర్రాళ్ళు , ఒక వీధి రోడ్డు పక్కనున్న అరుగు పైన కూర్చుని యేవో మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనుంచి రెండు కుక్కలు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. ఎవరో సైకిల్ మీద పండ్లు పట్టుకుని అరుస్తున్నాడు..బత్తాయి పండ్లు , బత్తాయి పండ్లు అని….ఇంకో పక్క ముగ్గురు దృఢం గా ఉన్న మనుషులు గొడుగులు బాగు చేస్తాం… గొడుగులు బాగు చేస్తాం..అంటూ అరుస్తూ ఇంటింటికెళ్లి చెప్తున్నారు, . ఆ కుర్రాళ్ళు మాత్రం వాళ్ళ కబుర్ల లో వాళ్ళు ఉన్నారు.

సమయం : రాత్రి ఎనిమిది గంటలు. కుర్రాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఆ నలుగురి లో ఒకడు అంటున్నాడు రోజు మా నాన్న తిట్లకి భరించలేకపోతున్నా రా బాబు, ఏదో చదుకోవాలి, బాగు పడాలి అంటూ రోజూ నన్ను తిడుతూనే ఉన్నాడు. నాకా చదువు అబ్బట్లేదు. చిరాగ్గా ఉంది రా బాబు అంటూ. ఇంకో కుర్రాడు కూడా ఇంచుమించు అలాగే చెప్పాడు వాడి తల్లి తండ్రుల గురుంచి. అవును రా బాబు ఇప్పుడు ఇంటికెళ్లాలంటే భయం గా ఉంది, అంటూ మిగతా ఇద్దరు కుర్రాళ్ళు. సరే లే భోజనం చెయ్యాలిగా ఇంటికెళ్దాం , కుదిరితే రాత్రి కలుద్దాం లేదంటే రేపొద్దునే అంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు.

సమయం: రాత్రి 8 : 15 నిముషాలు. ఈ నలుగురు కుర్రాళ్ల ఇంట్లో పెద్ద పెద్ద గా గొడవలే జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడు బాగు పడతావురా అని ఒక తండ్రి, నువ్విక్కడవుంటే మమ్మలిని కూడా ఊరినుంచి తరిమేసేలా ఉన్నారు అని ఇంకోడి తండ్రి. ఇలా కాదు వీడికి నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తాడు అని కొంచం గట్టిగానే బుద్ది చెప్పిన ఇంకో తండ్రి, ఇంచుమించు ఇలాగే స్పందించిన మరో తండ్రి…ఇలాగ ఈ కుర్రాళ్ళు భోజనం చేస్తున్నంత సేపు గొడవలు..గొడవలు గా సాగుతున్నాయి.

భళ్ళున తెల్లారింది. మండే సూర్యుడు తన పని ని యధావిధి గా చేస్తూన్నాడు. అటువైపు వెళ్తున్న ఒక మనిషి ఈ నలుగురు కుర్రాళ్ళని చూసి, ఒరేయి అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగో అక్కడ తిరుగుతున్న ఆ నాలుగు కుక్కలకి మీకు పెద్ద తేడా లేదు, అవ్వీ తిరుగుతున్నాయి మీరు తిరుగుతున్నారు.. తూ..అంటూ.. సైకిల్ మీద నుంచి గట్టి గా తిట్టి ఇంకో వైపు కెళ్ళాడు. వీళ్ళలో ఒకడికి చిర్రెత్తుకొచ్చింది…పక్కనున్న రాయి ని తీసి గట్టి గా విసిరాడు..ఆ రాయి ,తిట్టిన అతని సైకిల్ కి తగిలి పెద్ద చప్పుడయింది. అతను సైకిల్ స్టాండ్ వేసి ఎవడురా నన్ను కొట్టాడు..హా అంటూ..ఆ నలుగురు కుర్రాళ్ళ దగ్గెర కొచ్చాడు.వచ్చి చెప్తా మీ పని…అంటూ అటు వైపు వెళ్తూ అమ్ముకుంటున్న పండ్ల అతన్ని, ఆ గొడుగుల బాగు చేసేవాళ్ళని చూపిస్తూ, చూడండీ రా వాళ్ళు నయం మీ కన్నా…ఇంటింటికెళ్లి అమ్ముకుంటున్నారు…ఉండు…మీ అమ్మ నాన్న లతో మాట్లాడి మీకు గట్టి గా చెప్తా అంటూ….స్పీడ్ గా మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

ఈసారి ఈ కుర్రాళ్ళకి భయం వేసింది. కొంచెం దూరం గా ఆ వీధి చివరిలో నున్న అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బత్తాయి పండ్లు..బత్తాయి పండ్లు అతను ఇంటి ఇంటి దగ్గెర ఆపుతూ అరుస్తున్నాడు. అలాగే గొడుగులు బావు చేస్తాం అంటూ వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ , అరుస్తూ వెళ్తున్నారు. ఒరేయి మనం కూడా ఏదో పని చేస్తే బావుంటుంది రా , లేకపోతె మనల్ని అందరూ తిడుతూనే ఉంటారు అని అని ఒకడన్నాడు. చదువు నా వల్ల కాదు. నేను కూడా ఏదో పని నేర్చుకుని పనిలో పడితే ఈ బాధ ఉండదు అని ఇంకోడు. లేదురా నేను మంచి బిజినెస్ చేస్తా…అది చేసి డబ్బులు సంపాదించి వీళ్ళ నోరు మూయిస్తా అని ఒకడు, లేదు రా నేను కొంచం చదివి చిన్న ఉద్యోగం చేసి, డబ్బులు సంపాదించి వీళ్ళ పని చెప్తా. సరే రా మనం ఇంక ఇక్కడ కలవద్దు. ఏదో చేసి మనోళ్ల కి మనం ఏంటో చూపిద్దాం అని ఒకల్నోకలు అనేసుకున్నారు….

మధ్యాహ్న్నమైంది.కుక్కలు అరుస్తున్నాయి.జన సంచారం లేదు. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ అన్ని వీధులు తిరుగుతున్నారు. ప్రతీ ఇంటిని పరిశీలిస్తూ మరీ వెళ్తున్నారు.కొన్ని పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయ్. కొన్ని విశాలమైన ఇళ్లులు ఉన్నాయ్. ఆ నలుగురిలో ఒకడు కుక్కల్ని కొడుతున్నాడు అరవకుండా…ఈ అరుపులకి ఇంట్లో కిటికీ లోనుంచి ఒక పెద్దావిడ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో అని చూసింది. ఎవరో దూరం గా నలుగురు మనుషులు ఆ రోడ్డు మీద తిరగడం కనిపించింది. వీళ్ళకి ఎప్పుడు బుద్దొస్తుందో, ఎప్పుడు బాగు పడతారో అంటూ ఆ తెరిచిన కిటికీ ని మూసేసింది.

సమయం సాయంత్రం : ఎనిమిది గంటలు. ఆ నలుగురు కుర్రాళ్ళు ఎవరింట్లో, వాళ్ళు భోజనం చేస్తున్నారు. యధావిధి గా వాళ్ళ తండ్రుల చేత తిట్లు తింటూ…అందరూ భోజనాలు చేసేసారు. అమ్మా నేను ఆలా బయటికెళ్ళొస్తా అంటూ ఒక కుర్రాడు వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళాడు. అలాగే మిగతా కుర్రాళ్ళు కూడా అలాగే ఇంట్లో చెప్పి బయటకి వచ్చి ఒక చోట నలుగురు మళ్ళి కలిశారు.

సమయం అర్ధరాత్రి 2 గంటలు. చిమ్మ చీకటి. కుక్కలు తెగ అరుస్తున్నాయి.మళ్ళి పారిపోతూ కొంచం దూరం గా వెళ్లి అరుస్తున్నాయి. పరుగుల శబ్దాలు. గేట్ శబ్దాలు. పెద్ద భవనం దగ్గిర పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.తాళాలు పగలగొడుతున్న శబ్దం.పరిగెడుతున్న కాళ్ళ శబ్దాలు…కుక్కల అరుపులు.

దొంగలు..దొంగలు..అంటూ పెద్ద పెద్ద కేకలు. ఈ కేకలని విని కొంతమంది పెద్దలు పెద్ద పెద్ద కర్రలతో, దీపాలతో బయటికి వచ్చేసారు. వీళ్ళ అరుపులు విని, వాళ్ళకెక్కడికెళ్ళలో తెలియకుండా ఇటు అటు పరిగెడుతూఉన్నారు. మొత్తానికి ఆ దొంగలని పట్టేసుకున్నారు .
**********
శబాష్ రా కుర్రాల్లారా ! మీరు చేసిన ఈ ఒక మంచి పని వలన, ఈ ఊరు ని దొంగల బారినుంచి కాపాడుకున్నారు, అని ఒక పోలీస్ ఈ నలుగురి కుర్రాళ్ళని అభినందించాడు. ఆ మాటకి ఈ నలుగురు కుర్రాళ్ళ తల్లి తండ్రులతో పాటు అక్కడున్న గ్రామస్తులు కి నోటి మాట లేదు. ఆ పోలీస్ ఆ గ్రామస్తులతో చెప్తున్నాడు. అవునండి ఈ నలుగురు కుర్రాళ్లే ఈ రోజూ గజ దొంగలని పట్టుకున్నారు. ఈ దొంగల ముఠా, పెద్ద పేరు మోసిన ముఠా. ప్రతీ రోజూ ఈ దొంగలు గ్రామాల్లో తిరుగుతూ ఏదో అమ్ముకున్నట్టు నటిస్తూ ఊరంతా పరిశీలిస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు . ఈ నలుగురు కుర్రాళ్ళు ప్రతీ రోజూ వీళ్ళని పరిశీలించి నాకు ఒకసారి చెప్పారు, సార్ మా ఊర్లో కొంతమంది అనుమానాస్పదం గా తిరుగుతున్నారు అని. అప్పటినుంచి ప్రతీ రాత్రి, పగలు ఈ దొంగలని ఆబ్సెర్వేషన్ లో పెట్టి ఈ నలుగురు కుర్రాళ్ళ సహాయం తో ఈ గజదొంగలని పట్టుకోగలిగాం అని చెప్పేసి పోలీస్ వెళ్ళిపోయాడు.

ఆ నలుగురు కుర్రాళ్ళు, మళ్ళి ఒక చోట కలిశారు…..ఏరా కుర్రాళ్ళు ఈ సారి ఇలాంటి దొంగల్ని కాదురా….ఇంకా పెద్ద పెద్ద దొంగల్ని పట్టుకోవాలి అని అప్పుడు వీళ్ళని తిట్టిన ఆ పెద్దాయన సైకిల్ మీద వెళ్తూ అంటున్నాడు . సరే బాబాయ్.. అప్పుడు మమల్ని తెగ తిట్టేశావ్, ఇపుడేమో ఇలాగ.. అంటూ కొంచం కోపం గానే కుర్రాళ్ళు అన్నారు. ఏరా మనోళ్లు మనకి ఇదే పని ఇచ్చే లా ఉన్నారు. ఇంకో పని చూసుకుందాం అంటే..లేదురా మన ఊరు ని, మనోళ్ల ని కాపాడుకోవడం మన బాద్యత….ఇంక ఇలాంటి పనులే చేద్దాం అని ఒకడున్నాడు. చూద్దాం రా బాబు..అని ఇంకొకడు. అలాగా…ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు ఆ వెనక వీధి నలుగురు కుర్రాళ్ళు…

సమయం మధ్యాహ్నం మూడు గంటలు.. అదే మండే సూర్యుడు ఎండల్ని మండిస్తూన్నాడు. మామిడి పండ్లు, మామిడి పండ్లు అని కేక వినిపించింది వెనక వీధిలో. కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఒకప్పుడు కిటికీ లోనుంచి చూసి, కుర్రాళ్లను తిట్టుకుని కిటికీ వేసేసిన పెద్దావిడ, ఇప్పుడు కిటికీలోనుంచి చూస్తోంది ఎవరా మామిడిపళ్ళు అరచేవాడు అని ..ఇంకా అరుపు దగ్గెరవుతోంది. ఇంటికి దగ్గెర గా వస్తున్న వాళ్ళను చూసి భయం తో ధడేల్ మంటూ కిటికీ మూసేసింది.
***********
ప్రసాద్ ఓరుగంటి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s