మూడో వీధిలో ఆ రాత్రి……..

 

అప్పటికే ఊరులో దొంగలు పడ్డారని తెలిసి, పెద్ద లందరూ అనుకుని రాత్రికో బాచ్ చొప్పున గస్తీ తిరుగుదామని నిశ్చయించుకున్నారు .ఉద్యోగ , వ్యాపారాలను బట్టి వాళ్ళు  ఆయా రోజులలో గస్తీ తిరగాలని అనేసుకున్నారు.
రాత్రి 9  గంటలకి ఒక చోట కలుద్దాం, అక్కడ నుంచి ఇద్దరు చొప్పున అన్ని వీధులు తిరుగుదామని, ఎవరో ఒకళ్ళు ఇంట్లో టీ పెట్టుకుని, ఆ టీ తాగేసి బయల్దేరుదామని కొందరు ప్రతిపాదించారు.
ఆ రాత్రి అందరూ టీ పెట్టుకుని, తాగుతూ ఉంటె, ఎక్కడో పరుగుల చప్పుడు. ఆ చప్పుడు దూరం అవుతోంది. ఆ టీ తాగడం ఆపేసి వీళ్ళందరూ వెతకటం మొదలెట్టారు.ఎవరూ కనిపించలేదు.మొత్తం
 ఊరంతా తిరిగారు.
ఎక్కడో కోడి అరుపు, దాని వెనకాల ఒకడు పరుగు.మొత్తానికి వీళ్లంతా కలిసి ఆ కోళ్ల  దొంగని పట్టుకున్నారు. వాడిని పట్టుకుని చెట్టుకి కట్టేసి, నాలుగు కుమ్ములు కుమ్మేసి ,  గస్తీ తిరుగుతూ దొంగని పట్టుకున్నామని  రాబోయే యువతరానికి గట్టిగా సందేశం ఇచ్చారు.

కాలం పరిగెడుతోంది….ఆ పెద్దల పిల్లలు యువకులయ్యారు.దొంగలు కూడా అప్పుడప్పుడు ఆ ఊరుని పలకరిస్తూనే ఉన్నారు .
ఒకరోజు యువకులంతా కలిసి గుమిగూడి మాట్లాడుకున్నారు.అప్పట్లో మన పెద్దలు ప్రతీ రాత్రి గస్తీ కాసేవారు. గస్తీ కాస్తూ మన పెద్ద వాళ్ళు కోళ్ల దొంగలని పట్టుకున్నారు..మనం కూడా గస్తీ కాస్తూ , కోళ్ల దొంగలను కాదు, గజ దొంగలని పట్టుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు.
ఒక రాత్రి అందరూ కలుసుకున్నారు ఒక చోట..హోటల్ నుంచి టీ టిఫినులు తెప్పించుకున్నారు.సరే ఇక రండి బయలు దేరుదాం అంటూ…అన్ని వీధులు తిరుగుతున్నారు.ప్రతీ ఇంటి తలుపులు కొడుతున్నారు మేము గస్తీ తిరుగుతున్నాం ..కొంచం జాగ్రత్త గా ఉండండి అని చెప్పినట్టు.వీళ్ళ అరుపులకి, తలుపుల బాదులకి, దొంగలు సంగతి దేవుడెరుగు,పడుకున్న వాళ్లకు నిద్ర విరుగుడు….

రాత్రి  రెండు  గంటల సమయం. అమావాస్య. దట్టమైన చీకటి. ఎక్కడో కుక్కల అరుపులు. వేసవి కాలం. రాత్రంతా కరెంటు లేదు.. అదే సమయాన దూరం గా ఆకాశం లో యెర్రని మంటల ఛాయలు, దట్టమైన పొగలు . ఎక్కడో ఏదో అంటుకుని దగ్దమైనట్టు గా…ఆ కాలిన వాసనలు అన్ని వీధులకి మెల్లగా తగులుతున్నాయి.
ఈ గస్తీ కాసే కుర్రాళ్ళు అందరూ పరిగెత్తారు.ఆ మంటలు ఎక్కడనుంచి వస్తున్నాయో అని.పరుగు పరుగున అందరూ ఆ మంటలవద్దకి చేరుకున్నారు.

మూడో వీధి.సమయం రెండు గంటల నలభై నిముషాలు… చిమ్మ చీకటి….దూరం గా ఒక కుక్క భయం తో అరుస్తోంది, పరుగుల శబ్దం ఎక్కువవుతోంది…ఎవరో వ్యక్తులు ఒక ఆ ఇంటి గోడ దూకి,ఆ ఇంట్లో ప్రవేశించారు. ఆ గోడ దూకిన వ్యక్తులు అటు ఇటు చూస్తున్నారు , ఎవరైనా లేస్తారేమో అని…

అక్కడ కొంత మంది ఆ మంటల్ని ఆపుతున్నారు…అక్కడ కాలని వస్తువులను తీసి పక్కన పెడుతున్నారు. పూర్తిగా కాలినవి చూసి అక్కడున్న వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.కొంత మంది నీళ్లు పోస్తున్నారు…కొంత మంది అవి చూస్తూ చుట్ట తాగుతూ, ఏదో పక్కోడి తో కబుర్లు చెప్తున్నారు.

తెల్లారింది…కాఫీ హోటెల్ లో ఇద్దరు ఇడ్లీ లు తింటూ మాట్లాడుకుంటున్నారు..పక్కనే ఎగురుతూ కాకి లు  గట్టిగా అరుస్తున్నాయి ఆ ఇడ్లీ ముక్క గురుంచి. ఏరా! తెలుసా నీకు, రాత్రి మూడో వీధి లో ఒక ఇంట్లో ,కొన్ని వస్తువులు , ఒక సైకిల్, మోటార్ సైకిల్ అంటా.. తీసికెళ్ళి ఆ పక్కనున్న పెరట్లో  పడేసి దొంగలు పారిపోయారంట..పోనీలే మొత్తానికి అవి అక్కడే ఉన్నాయి అని అన్నాడు.అవును రా నేనూ విన్నాను మళ్ళి దొంగలు ఊళ్ళో పడ్డారు…కుర్రాళ్ళు గస్తీ కాస్తున్నారు…మరీ ఈ దొంగలెలా పడ్డారో అంటూ చేతులు కడుక్కున్నాడు ఆ పక్కోడు. ఈ కబుర్లు వింటూ దోస తింటున్న ఒక కుర్రోడు  ముసి ముసి నవ్వులు నవ్వుకంటూ దోస లో చట్నీ వేయమని నవ్వాపుకుని అరిచాడు….

ఇప్పటికీ  ఆ దొంగలు ఆచూకీ మాత్రం ఎవరికి  తెలియదు…కానీ కుర్రాళ్ళు గస్తీ కాస్తూనే ఉన్నారు…
ఇదీ జరిగింది .. మూడో వీధిలో ఆ రాత్రి……
************************************************************
ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s