మన ఊరి ఆటలు…..

ఈరోజు సంక్రాంతి కదా…కొన్ని ఊళ్లలో గాలి పటాలు ఎగరేస్తుంటారు అని గాల్లో చూస్తూ , ఆ రోజు లు గుర్తు చేసుకుందామని చూస్తే.. ఇక్కడ ఎవరో పిల్లలు డ్రోన్ లు ఎగరేస్తున్నారు….రెండు, మూడు డ్రోన్ లు గాల్లో కి తిరుగుతున్నాయి .పోన్లే, అక్కడ పండక్కి గాల్లో గాలిపటాలు , ఇక్కడ గాల్లో ఈ డ్రోన్ లు అనుకుంటూ ఉంటూ….ఆ డ్రోన్ నన్ను నా చిన్నప్పటి ఆటల దగ్గెరకి తీసుకెళ్లింది.
——————————————————————————–
ఇంకా కుర్రాళ్ళు క్రికెట్ మొదలెట్టని కాలం .అంతకు ముందు “అనాతవరం క్రికెట్ కధలు” లో చెప్పినట్టు , ఇంకా బాటరీ బళ్ళు ఆడుతూ..ఒకటో వీధి, రెండో వీధి కుర్రాళ్ళ మధ్య జరుగుతున్న ఆటల లో వచ్చే మాటల యుద్దాలు ఇంకా సాగుతున్నాయి.

మెల్లగా పెద్ద పురికొస తీసుకుని, దానికి ఆ చివర ముడి వేసి, ఒరే నేను డ్రైవర్, వాడు కండక్టర్ , ఎవరెక్కుతారు ఎవరెక్కుతారు మా బస్సు అంటూ, చూస్తున్న పిల్లల్ని బతిమాలి ఎక్కుంచుకుని పరిగెత్తడం.కానీ, డ్రైవర్ కి కండక్టర్ కి ఉన్న బస్సు సరదా ఎక్కే ప్రయాణికులకు ఉండేది కాదు…..ఈ బస్సు ప్రయాణం, ఎన్ని ఎయిర్ బస్సు లు ఎక్కినప్పిటికి అందరికీ గుర్తు ఉండే తీపి ప్రయాణం.

ఒరే దొంగా పోలీస్ ఆడదామా అని ఒక్కడంటే, అవునురా ఆడదాం, ఆడదాం అంటూ సై అంటే సై అని మిగతా కుర్రాళ్ళు, కొంత మంది పిల్ల పోలీస్ లు, పిల్ల దొంగలని వెతికి పట్టుకోవడం..ఈ దొంగలు మూడో వీధి మూలా గున్నయ్య గారి పెరట్లో లేదా, ఎవరి పెరట్లో నైనా … భయం భయం గా దాక్కోవడం, ఎందుకంటె..పెద్దవాళ్ళు ఎక్కడ తిట్టేస్తారేమోనని , ఆ తిట్లకి పిల్ల పోలీస్ లకు దొరికిపోతామేమో అని
….కొన్ని సార్లు బుల్లివెంకన్న గారి మీద మేడా లోను , అప్పుడప్పుడు పెద్ద పెరట్లోకి …

ఇలా భయానందాల మధ్య ఆడే దొంగా పోలీస్.
——————————————————————————–
ఎన్నో కూతలు…ఆ కూతల మధ్యన ఆట…ఆ ఆట కబడ్డీ…..నా కు గుర్తున్న కొన్ని కూతలు.

“చెట్టు మీద దయ్యం నాకేమీ భయ్యం” అంటూ కూస్తూ అటుపక్క కి వెళ్లే ఈ ఆట గాడికి చాలా భయం అవతలి పక్క వాళ్ళు పట్టేసుకుంటారేమో అని.

“ఎలుకల రాముడు తేనే పట్టును బిగించి కొడితే లడ్డుండ లడ్డుండ”..అంటూ..గుక్క తిప్పుకోకుండా అంటూ , గుటక వేసేలోపులో , గుటుక్కుమని దొరికిపోయి కొంతమంది కూతగాళ్ళు.

“చెరకు తోటకు చాటుడు బియ్యం, బాతు గుడ్డుకు ఫటేల్ దెబ్బ ..జీవిచ్చి..జీవిచ్చి అంటూ, పదే పదే పాడి మధ్య లో కూత మర్చి పోయి , దొరికిపోయే కొంతమంది కూతగాళ్ళు.

“రాముడు కొట్టాడు, రక్తం కారింది, భీముడు కొట్టాడు బియ్యం కారింది” అంటూ కూస్తాడు ఒకడు,

“రాత్రి పది గంటలకు, మనిషి కొట్టిన దెబ్బలకు, పోలీసోడు కేకలకు, గుర్ఖా వోడి అరుపులకి, జీవిచ్చి..జీవిచ్చి” అంటూ కూస్తాడు ఇంకోడు.

ఇంకోడు, “అంబాజీ పేట, నీ పెళ్ళాం మూట” అంటే అటుపక్క నుండి వచ్చే కూతరి “ఎండు కొబ్బరికాయ నీ బాబు తలకాయ” అంటూ అంటాడు..

ఈ కూతల మధ్య, రాంబాబు మాస్టర్ గారి పాత ఇల్లు దద్దరిల్లు పోయేలాగా… ఇలాగ కొంత కాలం కబడ్డీ ఆటలు.
_______________________________________________________________________
ఇవన్నీ బోర్ కొట్టేసిన తరువాత, కొంత కాలం ఎస్ ఆట అని, విండో సబ్జార్ అని, కర్రెంట్ షాక్ అని ఇంపోర్టెడ్ గేమ్స్ ఆడేస్తే, “నించుంటే తాప్” అంటూ ఎవడో సడన్ గా ఏదో ఆట మధ్య లో అంటూ నించున్న వాళ్ళని తన్నడం, ఆ తన్ను లు తిన్నవాడు కోపం తో రగిలిపోయి మళ్ళి తిరిగి తన్నడం..ఇలాగ ఆ ఆటలలో చిన్న చిన్న యుద్దాలు.

కొంత కాలం, L O N D O N ఆట. పంటలు వేసుకుని, ఆ పంట వేసినప్పుడు ఎవడైతే చెయ్య ని మిగతా ఇద్దరికీ భిన్నం గా వేశాడో వాడు దొంగ అని చెప్పి, ఈ లండన్ గాని, ఎస్ ఆట అని, విండో సబ్జార్ గాని నడిచేవి.ఈ ఆటలకి చాలా ముఖ్యమైనది ఈ పంట.

మరి కొంత కాలం, జొరీ బాలని, ఏడు పెంకులాట అని చెప్పి, రబ్బరు బాలు తో అవతల వాడి నడ్డి మీద వడ్డించడం, ఆ వడ్ఢిమ్పుడికి నెప్పి తో వచ్చే ఆ బాధకి తెలియకుండానే వచ్చే తిట్లు కొన్ని, కొట్టిన వాడి మీద కసితో బాలు ఎప్పుడు దొరుకుతుందా అని దొరికినఅప్పుడు కలిగే ఆ ఆనందం వర్ణ నాతీతం.

ఇలాంటి ఆటే కింగ్ అని , ఒక సర్కిల్ గీసి, అందరు కాళ్లు ఆ సర్కిల్ బౌండరీ మీద పెట్టి, పైనుంచి వదిలిన ఆ బాలు ఎవరి పాదాలకు తగులుతుందో, వాళ్ళు అటుపక్క టీం ని పరిగెడుతూ ఉంటె, బాలుతో కాళ్ళ మీద కొట్టడం, ఈ కొట్టడం లో మొహం మీదో.. ఎక్కడో తగలడం, మళ్ళి ప్రారంభమయ్యే యుద్దాలు.

ఇలా ఇలా ఆడుతూ, క్రికెట్ వచ్చిన తరువాత కుడా ఫ్రెంచ్ క్రికెట్ అని, నించుని తాను తిరగకుండా,ఆ బాట్ ని బాల్ తో కొట్టి, ఆ బాట్ ని తన చుట్టూ తిప్పుకుంటూ (భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో , అలాగా ఈ బాట్ ని కూడా ఆలా తిప్పుతూ స్కోర్ ని లెక్కేసుకోవడం. ఈ మధ్యలో ఆ బాలు కాలు కి తగిలిన వెంటనే, ఈ భూ భ్రమణాలు/భూ పరి భ్రమణాలు ఆగిపోయి, ఔట్ అనేసి ఆ ఫ్రెంచ్ బాట్స్మన్ ని పెవిలియన్ కి పంపడం.

.ఈ ఆటలన్నీ బోర్ కొడితే, ఎలాగ బిజినెస్ గేమ్ ఉంది కదా అని కొందరు, ఇవన్నీ కాదు…కొంచం ఆధ్యాత్మికం లో ఉందాం అంటూ సత్తి, రాజా లు అయితే ఏకం గా ఇంట్లోనే గుడి కట్టేయడం. అంటే చిన్న గుడి ని సిమెంట్ తో కట్టేసి భజనలు చేద్దామనే వీరు.

దేవుడి పెళ్లి సీజన్లో లో అయితే, కొబ్బరి పుచ్చు లకి ఈనుపుల్లలు గూర్చి, దాన్ని రధం అనేసి గొప్పగా ఫీలవ్వటం.

ఇలాగ..ఒకటి కాదు..ఎన్నో వైవిధ్యమైన ఆటలు. ఆ ఆటల మధ్య ఎన్నో తియ్య తీయని స్నేహాలు, అప్పుడప్పుడు కయ్యాలు.

ప్రతీ బాల్యం వెనుక యేవో ఆటలు ఉంటాయి.. ఇవి నా బాల్యం లో, నా స్నేహితుల మధ్య న జరిగిన కొన్ని మధురానుఆటలు…మన ఊరి ఆటలు……
——————————————————————————–
ప్రసాద్ ఓరుగంటి

4 thoughts on “మన ఊరి ఆటలు…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s